Uapa Act misuse: జనాగ్రహ నిరసన వేరు, ఉగ్రవాద కుట్ర వేరు. ఆ రెంటిమధ్యా కచ్చితమైన విభజన రేఖ ఉందంటూ సర్వోన్నత న్యాయస్థానం ఏనాడో ఉద్బోధించినా- వాస్తవిక కార్యాచరణలో, ఆ స్ఫూర్తికి నిలువెల్లా తూట్లు పడుతున్నాయి. రాజ్యసభా ముఖంగా కేంద్రం తాజాగా వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (యూఏపీఏ-ఉపా) కింద ఒక్క 2020 సంవత్సరంలోనే 1321 మంది అరెస్టయ్యారు. అందులో 70 శాతం వాటా ఉత్తర్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, మణిపుర్‌లదే. 2016 నుంచి లెక్కలు తీసి ఆ కరకు చట్టం కింద అరెస్టయిన 7243 మందిలో నేర నిర్ధరణ జరిగింది 212 కేసులలోనేననీ కేంద్రం వెల్లడించింది. 286 మందిని నిర్దోషులుగా విడిచిపుచ్చారు!
బెయిలుకు నోచుకోక..
Supreme court on uapa: 2019తో ముగిసిన అయిదేళ్ల కాలావధిలో 'ఉపా'కింద అరెస్టయినవారిలో నేర నిర్ధరణ జరిగింది కేవలం రెండుశాతం కేసులలోనేనన్న జాతీయ నేరగణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నిర్ధరణ దిగ్భ్రాంతపరుస్తుంది. తక్కినవారిలో ఎందరో బెయిలుకు నోచుకోక జైలు గోడల నడుమ నిస్సహాయంగా మగ్గిపోతున్నారు. సాధారణ నేరాల్లో హేయమైన వాటికి, ఉగ్రవాద దుశ్చర్యలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించ నిరాకరిస్తూ యథాలాపంగా కేసులు బనాయించడం పౌరస్వేచ్ఛను కబళించడమేనని న్యాయస్థానాలు హెచ్చరిస్తున్నా- 'ఉపా' నిబంధనల దుర్వినియోగం కొనసాగుతూనే ఉంది. బెయిలు కోసం శతవిధాల యత్నించి విఫలమై కారాగారంలోనే చనిపోతానేమోనని ఆక్రందిస్తూ కడతేరిన ఫాదర్ స్టాన్ స్వామి విషాదాంతం, మరెందరో విచారణ ఖైదీల దారుణ దుస్థితికి నిలువుటద్దం. సత్వర విచారణ సాధ్యపడనట్లయితే బెయిలు ఇవ్వాల్సిందేనన్న 'సుప్రీం' నిర్దేశం చురుగ్గా అమలుకు నోచుకోవడమే, అందుకు సరైన పరిష్కారం!
ఇదీ చూడండి:Lockup death: పెచ్చరిల్లుతున్న పోలీసు హింస... లాకప్ మరణాలకు అంతం లేదా?
ప్రాథమిక న్యాయ సూత్రానికి విరుద్ధంగా..
Editors guild on uapa: ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటన స్వేచ్ఛల పరిరక్షణ గురించి ఆమధ్య జి-7 వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ గంభీర వ్యాఖ్యలకు, దేశీయంగా స్థితిగతులకు పొంతన కుదరడం లేదని 'ఎడిటర్స్ గిల్డ్' వాపోయింది. 'ఉపా' నాలుగు, ఆరు సెక్షన్ల కింద అరెస్టయిన వ్యక్తిపై కేస్ డైరీలో ప్రాథమిక సాక్ష్యాధారాలున్న పక్షంలో తాత్కాలిక బెయిలు సైతం ఇవ్వరాదని 43(డి)(5) సెక్షన్ చెబుతోంది. దోషిగా నిరూపణ కానంతవరకు ఏ నిందితుడినైనా నిర్దోషిగానే పరిగణించాలన్న ప్రాథమిక న్యాయ సూత్రానికే అది విరుద్ధం. అటువంటి కర్కశ శాసనాన్ని, రాజద్రోహ నిరోధానికి ఉద్దేశించిన ఐపీసీ(భారతీయ శిక్షాస్మృతి) సెక్షన్ 124ఎ ను కలగలిపి- ఎదురాడినవారిపై ప్రయోగించే ధోరణులు కొన్నాళ్లుగా పెచ్చుమీరుతున్నాయి. వాటిని రద్దు చేయాల్సిందేనని ఇటీవల పిలుపిచ్చిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం, జస్టిస్ మదన్ లోకుర్ ప్రభృతులు మన్నికైన సూచనలూ చేశారు. అక్రమ అరెస్టులతో ఏళ్ల తరబడి నిర్బంధానికి కారకులైన వాళ్లను వ్యక్తిగతంగా బాధ్యుల్ని చేసి, వారినుంచే పరిహారం ఇప్పించాలనీ ప్రతిపాదించారు.
ప్రజాస్వామ్యానికే విఘాతకరంగా..
uapa human rights violations: కొన్నేళ్ల క్రితం 'ఉపా' చట్టం కింద పోలీస్ చెరలో చిక్కిన ఎన్‌కే ఇబ్రహీం వంటి వారెందరో చీకటి కొట్టాల్లోనే మగ్గిపోతున్నారు. విచారణ పూర్తి కాలేదన్న పేరిట బెయిలు దక్కనివ్వకుండా చెయ్యడం, రాజ్యాంగదత్తమైన జీవన హక్కునే క్రూరంగా అపహసిస్తోంది. ఇటీవల వేర్వేరు తీర్పుల్లో దిల్లీ హైకోర్టు చెప్పినట్లు- కఠినతర బెయిలు నిబంధనలు, నేరాభియోగాల దాఖలు వెసులుబాట్లు కలిగిన 'ఉపా' కొనసాగడం ప్రజాస్వామ్యానికే విఘాతకరమవుతుంది! నిన్న కాక మొన్న అక్రమ నిర్బంధాల్ని తప్పుపట్టిన ఏపీ ఉన్నత న్యాయస్థానం- వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన 24 గంటల్లోగా వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచకపోవడం ఏమిటని సూటిగా ప్రశ్నించింది. దీటైన జవాబేదీ? 'కనీసం అభియోగాలైనా నమోదు చేయకుండా నిందితుణ్ని పదకొండేళ్లపాటు జైలులో ఉంచుతారా?' అని ఈమధ్యనే 'సుప్రీం' లేవనెత్తిన అభ్యంతరం- దేశంలో నేరన్యాయ అవ్యవస్థనే కళ్లకు కడుతోంది. సాకల్య ప్రక్షాళనను లక్షించి సమగ్ర సంస్కరణలు సాకారమైతేనే- ఈ మానవ హక్కుల క్రూర హననానికి అడ్డుకట్ట పడేది!
ఇదీ చూడండి:అసమానతల అంతమే నిజమైన వృద్ధి