ఐరోపా ఖండంలో 1848లో వరస విప్లవాలు చోటుచేసుకొంటున్నప్పుడు, ఆస్ట్రియా రాజనీతిజ్ఞుడు మెటెర్నిక్ 'ఫ్రాన్స్ తుమ్మితే ఐరోపాకు జలుబు చేస్తుంది' అని వ్యాఖ్యానించారు. ఆ తరవాత ఈ నానుడి- అమెరికా తుమ్మితే యావత్ ప్రపంచానికి జలుబు చేస్తుందిగా మారిపోయింది. తాజాగా అమెరికా స్థానంలోకి చైనా వచ్చిచేరింది. ప్రపంచానికే కర్మాగారంగా మారిన చైనాలో గడచిన ఆరు నెలలుగా సంభవిస్తున్న పరిణామాలు మిగతా ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని కనబరుస్తున్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ మార్పులు చైనా భవిష్యత్తునే కాదు, ప్రపంచం భవితనూ ప్రభావితం చేస్తాయి.
బీజింగ్ బిట్ కాయిన్‌ను అడ్డుకోవడంతో మొదలుపెట్టి స్వదేశంలోని శతకోటీశ్వరుల పని పట్టడం అంతటా ప్రకంపనలు సృష్టించింది. ప్రపంచంలో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన అలీబాబా గ్రూపు సహవ్యవస్థాపకుడు జాక్ మాను తెరవెనక్కు నెట్టిన చైనా కమ్యూనిస్టు పాలకులు ఆపైన ఇతర శతకోటీశ్వరులకూ పగ్గాలు బిగించసాగారు. బడా టెక్ కంపెనీ అయిన టెన్సెంట్ ఆధిక్యానికి కత్తెర వేసిన తరవాత క్యాబ్ సేవల సంస్థ డిడి మీద వేటు పడింది. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమకారులను సమర్థించిన ఒక సంపన్న వ్యవసాయ కంపెనీ అధిపతిని కమ్యూనిస్టు ప్రభుత్వం 18 నెలలపాటు జైలుకు పంపింది. చైనాలో మొత్తం 25 అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలపై ప్రత్యేక నియంత్రణలు విధించారు. ఈ వ్యాపార వ్యతిరేక విధానాల వల్ల షాంఘై స్టాక్ మార్కెట్ సూచీ భారీ నష్టాలను చవిచూసింది. అమెరికాలో లిస్టయిన చైనా కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టిన మదుపరులు లక్ష కోట్ల డాలర్ల మేరకు నష్టపోయారు. చైనా కరెన్సీ విలువ తగ్గిపోవడంతో ఎగుమతిదారులు, దిగుమతిదారులకు ఆర్థిక చిక్కులు ఏర్పడుతున్నాయి.
భారంగా మారిన చదువులు
తమ పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత నిమిత్తమే టెక్ కంపెనీలపై నియంత్రణ విధిస్తున్నామని, వాటి గుత్తాధిపత్యం తగ్గితే వ్యాపార పోటీ పెరిగి ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందని చైనా ప్రభుత్వం చెబుతోంది. నేడు చైనా ఆర్థిక వ్యవస్థకు 35 శాతం ఆదాయం టెక్నాలజీ రంగం ద్వారానే సమకూరుతోంది. అలీబాబా చలవతో వర్ధిల్లుతున్న అనేకానేక చిన్న కంపెనీలు గడచిన దశాబ్ద కాలంలో మూడు కోట్ల మందికి ఉపాధి కల్పించాయి. 1981లో డెంగ్ జియావో పింగ్ ఆర్థిక సంస్కరణలు చేపట్టి సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో తొలిసారి ప్రైవేటు కంపెనీలను అనుమతించారు. అప్పటి నుంచి చైనా ప్రభుత్వం ఇచ్చిన వెన్నుదన్నుతో ప్రైవేటు కంపెనీలు ఇంతింతై వటుడింతై అన్నట్లు అభివృద్ధి చెందాయి. దీన్ని ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానమని, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానమని వర్ణిస్తున్నారు. దీనివల్ల భారీగా ప్రైవేటు కంపెనీలు పుట్టుకొచ్చాయి. చైనా ఆర్థిక వ్యవస్థ అల్పాదాయ స్థితి నుంచి వేగంగా మధ్యాదాయ స్థాయికి ఎదిగింది.
85 కోట్లమంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. బడా కంపెనీల యజమానులు శతకోటీశ్వరులయ్యారు. 2021 అంతర్జాతీయ సంపన్నుల జాబితాలోని అపర కుబేరుల్లో 1,058మంది చైనాలోనే ఉన్నారు. 2008-09 ఆర్థిక సంక్షోభం తరవాత ఎగుమతులపై ఆధారపడటం తగ్గించి, స్వదేశంలో వినియోగాన్ని పెంచాలని చైనా నిశ్చయించింది. కానీ, జనం ఆదాయం తరిగిపోవడంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. విద్యావ్యయం బాగా పెరిగిపోవడంతో కుటుంబాలు పిల్లల్ని కనడానికి సంకోచించే పరిస్థితి ఏర్పడింది. చైనా టెక్నాలజీలో కొత్త శిఖరాలు అధిరోహించాలంటే విద్యతోనే సాధ్యం. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఏటా 1.1 కోట్లమంది పోటీపడుతున్నారు. దీంతో కోచింగ్ వ్యాపారం 10,000 కోట్ల డాలర్ల స్థాయిని అందుకొంది. చైనా ప్రభుత్వం కోచింగ్ కేంద్రాలు, విద్యాసంస్థలను లాభాపేక్ష లేనివిగా మారాలని ఆదేశించింది. చైనాలో అట్టడుగు ఆర్థిక శ్రేణిలో ఉన్న 10 శాతం ఉన్నతాదాయ వర్గంలోకి చేరాలంటే ఏడు తరాలు పడుతుంది. అదే దక్షిణ కొరియాలో అయిదేళ్లు, జపాన్‌లో నాలుగేళ్లు మాత్రమే పడుతుంది.
కంపెనీలపై పట్టు