కొవిడ్ తీవ్రత(Covid surge in India) తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో వర్షాలు ముమ్మరించి సీజనల్ వ్యాధుల(Viral Fever in India) ముప్పు పెరుగుతోంది. పలు రకాల విషజ్వరాలు(Seasonal Fever) జోరందుకుంటున్నాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక వైరల్ ఇన్‌ఫెక్షన్లు దాదాపుగా ఒకే రకమైన వ్యాధి లక్షణాలు కలిగి ఉండటం వల్ల కొన్నిసార్లు కొవిడ్‌గా భావించే ప్రమాదం ఉంది. గత సంవత్సరం వర్షాకాలంలో లాక్‌డౌన్ కారణంగా ప్రజలు భౌతిక దూరం పాటించడం వల్ల సాంక్రామిక వ్యాధులు చాలా వరకు తగ్గాయి. ప్రస్తుతం సాధారణ పరిస్థితుల నేపథ్యంలో జనసమ్మర్దం అధికంగా ఉండేచోట్ల విషజ్వరాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. కొవిడ్‌ను, సాధారణ విషజ్వరాలను వేర్వేరుగా గుర్తించడంలో ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముంది. ఈ విషయంలో వైద్యులతోపాటు ప్రజల్లోనూ అవగాహన పెరగాలి.
వర్షాకాలంలో అధికం
దేశంలో డెంగీ(Dengue fever) వంటి జ్వరాలు ప్రబలడానికి నగరీకరణే ప్రధాన కారణంగా నిలుస్తోంది. నీరు నిల్వ ఉండేచోట దోమలు వృద్ధిచెంది జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దేశంలో డెంగీవ్యాప్తి వర్షాకాలం తరవాత ఎక్కువగానే ఉంటున్నా, దక్షిణాది రాష్ట్రాల్లో ఏడాది పొడవునా కేసులు కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి ప్రస్తుతం గ్రామాల్లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యాధికి ప్రధాన వాహకమైన ఏడిస్ దోమ మనదేశంలో అన్ని పెద్ద నగరాల్లోనూ కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్ల మందిని ప్రభావితం చేసే మలేరియా మన దేశంలో ప్రధానమైన ప్రజారోగ్య సమస్య.
అటవీ, గిరిజన ప్రాంతాల్లో మలేరియా(Malaria in India) ప్రభావం అధికం. రెండు దశాబ్దాలుగా మలేరియా తాలూకు మరణాల శాతం తగ్గినా వ్యాధి బారిన పడుతున్న వారు అధికంగా ఉంటున్నారు. ప్రాణాంతకమైన ఫాల్సిపారం మలేరియా వయసుతో నిమిత్తం లేకుండా ప్రభావితం చేస్తుంది. ప్రజారోగ్య వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో, పారిశుద్ధ్య వ్యవస్థ లోపాల వల్ల పట్టణాలు, నగరాల్లో మలేరియా విజృంభిస్తోంది. జులై నుంచి నవంబర్ మధ్య మన దేశంలో మలేరియా తీవ్రరూపం దాలుస్తుంది. మందులకు లొంగని మలేరియా కేసులు ఊపిరితిత్తుల సమస్యలను మరింత జటిలంగా మారుస్తున్నాయి. తక్కువ మోతాదులో లేదా తక్కువ కాలం మాత్రమే మందులను వాడితే వ్యాధి తగ్గని పరిస్థితి నెలకొంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030నాటికి మలేరియాను 90శాతం తగ్గించే ప్రణాళికను చేపట్టింది. కేవలం మందులు వెదజల్లడం వంటి ప్రక్రియల ద్వారానే కాకుండా నూతన సమగ్ర విధానాల ద్వారా పరిసరాలు, వ్యక్తిగత పరిరక్షణకు సైతం అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని మలేరియా ప్రభావిత దేశాలు గుర్తుచేశాయి. మందకొడిగా సాగుతున్న మలేరియా టీకా పరిశోధనలు కొన్ని దేశాలకే పరిమితమయ్యాయి. వర్షాలు, వరదల వల్ల విజృంభించే లెప్టోస్పిరోసిస్ వ్యాధి ఎలుకలు, మేకలు, పందుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాలేయం, మూత్రపిండాలు పాడై, మరణించే పరిస్థితి నెలకొంటుంది. ఏటా లక్షమందికిపైగా దీనిబారిన పడుతున్నారు.