కశ్మీర్‌లో ఎన్నో ఏళ్లుగా జరుగుతోన్న సంఘర్షణను 'పరోక్ష యుద్ధం'గా పిలుస్తుంటారు. ఈ మాటకు బలం చేకూర్చే కారణాలు లేకపోలేదు. పాకిస్థాన్ సైన్యం.. శిక్షణ పొందిన ఉగ్రవాదులను కశ్మీర్లోకి ఉసిగొల్పుతుంటే.. మనవైపు ఉన్న వేర్పాటువాదులు, అవినీతి రాజకీయ నాయకులు అందుకు మద్దతిస్తున్నారు. స్థానిక యువతను తుపాకులు పట్టేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి చిక్కుముళ్ల మధ్య కశ్మీర్ సమస్యకు పరిష్కారమేది? కశ్మీర్ సమస్య పూర్తి చిత్రాన్ని తెలిపే విశ్లేషణాత్మక సమాచారాన్ని ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా. ఈయన 2016 లక్షిత దాడులకు నాయకత్వం వహించిన సైనికాధికారి.
ప్రజామద్దతు ఉందా?
ప్రజామద్దతు లేకుండా దాదాపు 30 ఏళ్ల నుంచి సాయుధ తిరుగుబాటు సాధ్యం కాదు. అయితే కశ్మీర్‌కు దీర్ఘకాలిక పరిష్కారం అందించడానికి... ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతును బలహీనపరిచడం, హింసాత్మక సంఘటనలను నివారించడం చేస్తున్నాము. వీటితో పాటు అక్కడి ప్రజలపైనా ఎక్కువ దృష్టి పెట్టాలి. కశ్మీర్‌లో 'ఉగ్రవాదం' అనే పదానికి బదులుగా 'తిరుగుబాటు' అని అనే వాళ్లకు చెప్పేది ఒక్కటే. ఉగ్రవాదం కూడా 'తిరుగుబాటు'లో భాగమే.
పాక్ అస్త్రమిదే...
తిరుగుబాటుదారులను ఎదుర్కోవడాన్ని "హార్ట్స్ అండ్ మైండ్స్" అని పిలుస్తుంటాం. వాస్తవం ఏంటంటే ఈ తిరుగుబాటును అణిచివేయడానికి మనసు కన్నా బుర్ర ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. తప్పుడు సమాచార వ్యాప్తి, నకిలీ వార్తల ప్రచారం వెనుక ఉద్దేశం ప్రజల మనసులను ప్రభావితం చేయడమే. జనాలను తమ వైపునకు తిప్పుకొని వారి విశ్వాసం, మద్దతు పొందేందుకు.. సమాచార వ్యూహాల ద్వారా ప్రయత్నాలు చేస్తుంటాయి ఉగ్ర సంస్థలు. దీన్ని సైన్యం పరిభాషలో 'సమాచార యుద్ధం' అని పిలుస్తారు.
ఈ యుద్ధంలో ప్రధానంగా నకిలీ వార్తలపై ఆధారపడే ఉగ్రవాదులే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. "నిజం గడప దాటేలోపు... అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టేస్తుంది" అన్న విన్స్టన్ చర్చిల్ మాటలు అక్షరసత్యాలు. ఆ కాలంలో సమాచార వ్యవస్థ ప్రధానంగా రేడియోలు, టెలిగ్రాఫ్పై ఆధారపడి ఉండేది. ఈ రోజు స్మార్ట్ఫోన్ల సాయంతో ప్రపంచంలో ఎక్కడికైనా వేగంగా సమాచారాన్ని చేరవేయొచ్చు.
2018లో చేసిన 'మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' అధ్యయనం ప్రకారం.. నిజమైన వార్తల కంటే తప్పుడు సమాచారం 70 శాతం అధికంగా రీట్వీట్ అవుతోంది. నకిలీ కథనాలు నిజమైన వార్తల కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని అధ్యయనంలో తేలింది.
కశ్మీర్‌లో పాక్ కుయుక్తులు
- కశ్మీర్‌లో మతం, జాతిని కాపాడేందుకే ఉగ్రవాదులు ఉన్నారని.. దేశంలో పెరుగుతున్న హిందూ జాతీయవాదంతో ముప్పు పొంచి ఉందని పాక్ జోరుగా వదంతులు పుట్టిస్తోంది.
- కశ్మీరీ ప్రజలు అణచివేతకు గురవుతున్నారని.. భద్రతా దళాలు మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నట్లు చెబుతోంది.
అయితే భారత ప్రభుత్వం తన సమాచార వ్యవస్థ ద్వారా ఈ రెండూ తప్పని బలంగా నిరూపించాలి. అలా చేయడం పెద్ద కష్టమేమీ కాదు.