తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మహమ్మారిపై అసమగ్ర యుద్ధం- అడుగడుగునా వైఫల్యం!

ఇప్పటివరకు దేశంలో కరోనాతో నాలుగు లక్షల మందికిపైగా చనిపోయారు. అయితే ఈ సంఖ్య ప్రభుత్వ గణాంకాల కన్నా చాలా ఎక్కువే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు టీకాల కొరత.. వెంటాడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కొత్త వేరియంట్​ కేసులు నమోదవుతున్నాయి. మరి కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు సమర్థంగా అమలవుతున్నాయా? వైరస్​ నియంత్రణలో ప్రభుత్వాలు ఎంతవరకు సఫలమయ్యాయి?

covid situation in India
దేశంలో కరోనా పరిస్థితి

By

Published : Jul 3, 2021, 8:27 AM IST

కరోనా రెండోదశ దేశంలో అల్లకల్లోలం సృష్టించింది. మరణాల సంఖ్య గతంతో పోలిస్తే చాలా పెరిగింది. అధికార గణాంకాల కన్నా చాలా ఎక్కువగా- దేశవ్యాప్తంగా 15 లక్షల మందిని కరోనా బలి తీసుకుని ఉంటుందని ఐఐఎం అహ్మదాబాద్‌ ఆచార్యులు చిన్మయ్‌ తుంబే అంచనా వేస్తున్నారు. ఈ మహమ్మారి తీవ్రతను అడ్డుకోవాలంటే అందరికీ టీకాలు వేయడమే ఏకైక మార్గం. జనవరి 16 నుంచి భారత్‌లో టీకాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికి 24 వారాలు గడిచాయి కానీ, ఇచ్చిన డోసులు దాదాపు 33.6 కోట్లే. ఈ ఏడాది చివరికల్లా దేశంలో 108 కోట్ల మందికి టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 216 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉండగా- ఇప్పటివరకు ఇచ్చినది అందులో 15.5 శాతం వరకే ఉంది! ప్రస్తుత టీకా ఉత్పత్తి, సరఫరాల స్థాయిని చూస్తే నిర్దేశిత గడువులోగా లక్ష్యాన్ని అందుకోవడం క్లిష్టతరంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సగటున రోజుకు 40 లక్షల డోసులు ఇస్తున్నారు. ఇదీ జూన్‌ 21 నుంచి టీకాల విధానాన్ని కేంద్రం మార్చడం వల్లే సాధ్యపడుతోంది. అంతకుముందు రోజుకు గరిష్ఠంగా 26 లక్షల డోసుల పంపిణీ జరిగేది! డిసెంబరు నెలాఖరులోగా 216 కోట్ల డోసులు ఇవ్వాలంటే రోజుకు 70-80 లక్షల మోతాదుల చొప్పున పంపిణీ చేయాలన్నది ఐసీఎంఆర్‌ సూచన. గతంతో పోలిస్తే చాలావరకూ ప్రభుత్వ రంగంలోని టీకా కేంద్రాల సంఖ్య పెరిగింది. ఇంత చేస్తున్నా ఇంకా 18 ఏళ్లు దాటిన వారిలో 84 శాతానికి టీకాలు వేయాల్సి ఉంది. అమెరికా జనాభాలో దాదాపు సగం మందికి ఇప్పటికే టీకాలు అందాయి. యూకే సైతం తమ పౌరులకు టీకాలను అందించడంలో వేగంగా స్పందిస్తోంది. చాలా దేశాలు ఇప్పటికే 30శాతానికి పైగా జనాభాకు టీకాలు అందించాయి.

ఉచితంగా పంపణీ చేస్తేనే..

టీకా విధానంపై విమర్శలు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కేంద్రం ప్రభుత్వం పట్టువీడి- 18 ఏళ్లు దాటినవారందరికీ తామే ఉచితంగా టీకాలు అందిస్తామని చెప్పడం కొంతలో కొంత ఊరటనిచ్చింది. కానీ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్న డోసుల్లో ఎన్ని సద్వినియోగమవుతున్నాయన్న లెక్కలు విభ్రాంతికరంగా ఉన్నాయి. మే నెలలో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచిన 7.4 కోట్ల డోసుల టీకాల్లో 1.85 కోట్లను ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించారు. వాటిలో 1.29 కోట్ల డోసులను ఆ ఆసుపత్రులు కొనుగోలు చేశాయి. అయితే, వినియోగించింది మాత్రం 22 లక్షల డోసులనే! మరి మిగిలిన కోటికి పైగా టీకాలు ఏమయ్యాయో తెలియదు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం జులై 1వ తేదీ నుంచి ప్రైవేటు ఆసుపత్రులు నేరుగా టీకాలను కొనేందుకు వీల్లేదని, కొవిన్‌ పోర్టల్‌ ద్వారానే కొనుగోలు చేయాలని నిర్దేశించింది.

అందులోనూ అంతకుముందు నెలలోని ఒక వారంలో వేసిన గరిష్ఠ డోసుల ఆధారంగా ఎన్ని అవసరం ఉంటాయో లెక్కించి అన్నే ఇస్తామని స్పష్టంచేసింది. దేశీయంగా వివిధ సంస్థలు ఉత్పత్తి చేసే మొత్తం టీకాల్లో 75శాతం తాము కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తామని, మిగిలిన 25శాతం ప్రైౖవేటు ఆసుపత్రులకు అందుబాటులో ఉంటాయని ప్రధానమంత్రి గతంలో చెప్పారు. ప్రజలకు టీకాలను వేగంగా సమర్థంగా అందించడానికి తగిన వనరులు ప్రభుత్వ రంగంలోనే ఎక్కువ మేరకు ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటికే చాలా దేశాలు మొత్తం టీకాలను తామే సేకరించి, ప్రజలకు పూర్తి ఉచితంగా అందిస్తున్నాయి. భారత్‌లోనూ అదే విధానాన్ని అమలు చేస్తే, మెరుగైన ఫలితాలు వస్తాయి.

వ్యూహం సమర్థంగా అమలవుతుందా?

కరోనాను సమర్థంగా ఎదుర్కోవాలంటే పరీక్షించడం, గుర్తించడం, చికిత్స చేయడమనే మూడు దశల వ్యూహాన్ని అమలుచేయాలని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం వీటిలో ఎన్నింటిని సమర్థంగా అమలు చేస్తోందన్నది ప్రశ్నార్థకమే! తొలి దశలో కేసులను, వారి ప్రాథమిక కాంటాక్టులను పక్కాగా గుర్తించి, దూరప్రాంతాల నుంచి వచ్చినవారిని 14 రోజుల పాటు ఇళ్లకే పరిమితమయ్యేలా చూసిన రాష్ట్రాలు సైతం రెండోదశలో చేతులెత్తేశాయి. మరోవైపు ప్రైవేటు వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా ఖరారవుతున్నవారి వివరాలు ఎంతవరకు ప్రభుత్వ లెక్కల్లోకి వెళ్తున్నాయన్నదీ సందేహమే! క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా గందరగోళంగా ఉంటే, కరోనాతో యుద్ధంలో మనం కచ్చితంగా విజయం సాధిస్తామని ప్రభుత్వాలు ఢంకా బజాయిస్తుండటంపై వైద్యారోగ్యరంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఇకనైనా ఈ పరిస్థితులను చక్కదిద్ది, మహమ్మారిని మట్టుపెట్టేందుకు సమగ్ర విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉంది.

రచయిత- సంజనా రఘురామ్‌

ABOUT THE AUTHOR

...view details