కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇటీవల సమర్పించిన నివేదికపై చర్చించేందుకు ప్రజా పద్దుల కమిటీ సోమవారం సమావేశమైంది. అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో(హెచ్ఏఏ) సైనికుల జీవన విధానం మెరుగుపర్చే ప్రణాళికలపై తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఒప్పందాలపై కాగ్ తన నివేదిక అందించింది. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
సరైన స్థావరం ఉంటేనే కదా!
భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా సమసిపోకపోవడం, శీతాకాలంలోనూ ఈ ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో సైనికులకు ప్రకృతిని తట్టుకునే విధంగా మౌలిక వసతులు, లాజిస్టిక్ సదుపాయాలు ఏర్పాటు చేయడం ప్రస్తుతం సవాల్‌గా మారింది. సరైన ఆశ్రయాలు ఏర్పాటు చేస్తే భారత సైన్యం ఎలాంటి పోరాటానికైనా సంసిద్ధంగా ఉంటుంది. బలగాల మనోస్థైన్యం కూడా దృఢంగా ఉంటుంది.
పైలట్ ప్రాజెక్టులకు బ్రేకులు
ఇక్కడ స్థావరాలు నిర్మించాలన్న రూ.274.11 కోట్ల మూడు పైలట్ ప్రాజెక్టులను 13 ఏళ్ల తర్జనభర్జన తర్వాత నిలిపివేశారు. 2017 నవంబర్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మూతపడిన తర్వాత ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే దీనికి కారణాలేంటన్నది తెలియదు. సెంట్రల్ ఆర్డ్‌నెన్స్ ఫాక్టరీకి చెందిన ఈ ప్రాజెక్టు రూపకర్త సైతం కాగ్ నివేదికలో కారణాలు పొందుపర్చలేదు.
అధ్యయనం కోసం...
అత్యంత ఎత్తులో ఉన్న ఇలాంటి ప్రాంతాల్లో వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సాధారణంగా ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ ప్లాస్టిక్(ఎఫ్ఆర్పీ), ఫైబర్ గ్లాస్ కుటీరాల(ఎఫ్జీహెచ్)ను... స్థావరాల కోసం ఉపయోగిస్తారు.
ఈ ప్రాంతంలో నివాస సౌకర్యాలు మెరుగుపర్చేందుకు భారత సైన్యం 2007లో నార్తర్న్ కమాండ్ చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించింది. శిబిరాలు ఏర్పాటు చేసేందుకు అవసరమయ్యే ప్రామాణిక నమూనా, నిధులు, సమయంపై పరిశీలన చేసింది.
2008 ఏప్రిల్‌లో ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదిక సైన్యానికి సమర్పించింది. ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా రూ. 3,180 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని అంచనా వేసింది.