తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కష్టకాలంలో ఏ దేశమైనా ఎంతకాలం ఆదుకోగలదు? - కొవిడ్‌ నియంత్రణ

విశ్వవ్యాప్తంగా ప్రతి నాలుగు కొవిడ్‌ మరణాల్లో ఒకటి భారత్‌లోనే నమోదవుతున్నవేళ, చేతనైన సాయం అందించడానికి సుమారు 40 దేశాలు ముందుకు రావడం వాటి మానవీయ స్పందనకు నిదర్శనం. 139 కోట్ల జనాభాకు నెలవైన ఇండియాను ఏ దేశమైనా ఎంతవరకు ఆదుకోగలదు? మొత్తం టీకాలను కొనుగోలు చేసి కేంద్రమే ఎందుకు పంపిణీ చేయడం లేదన్న సర్వోన్నత న్యాయస్థానం సూటిప్రశ్నకు జవాబేది? బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక తోడ్పాటు అందించడానికి వ్యూహకర్తలు సంకోచించరుగాని- కొవిడ్‌ బాధార్తుల్ని సాంత్వనపరచడానికి చేతులు రావడం లేదు.

india
భారత్

By

Published : May 1, 2021, 8:31 AM IST

'కొవిడ్‌ మలిదశ విజృంభణ రూపేణా కమ్ముకొచ్చిన తుపాను దేశాన్నిప్పుడు అల్లకల్లోలం చేస్తోంది..' అని ప్రధాని మోదీ 'మన్‌ కీ బాత్‌' వినిపించిన మూన్నాళ్లకు- కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ నూతన మార్గదర్శకాలు వెలువరించింది. అవన్నీ 'గృహ ఏకాంతవాసం' (హోమ్‌ ఐసొలేషన్‌)లో ఉండాల్సిన బాధితులకు, వారి సంరక్షకులకు ఉద్దేశించినవి. ఇంట్లో ఏకాంతంగా ఉండటానికి తగినంత స్థలం, రోజంతా కంటికి రెప్పలా కాచుకునే సంరక్షకులు ఉన్నవారినే తప్ప సాధారణ ప్రజానీకాన్ని, నిరుపేదల్ని లక్షించి రూపొందించినవి కావవి.

మార్గదర్శకాలు.. హాస్యాస్పదం

దేశవ్యాప్తంగా మొత్తం పాతిక కోట్ల వరకు కుటుంబాల్లో పదికోట్లకుపైగా ఒక్కగదిలోనే ముగ్గురు నలుగురు ఇరుకిరుగ్గా బతుకీడుస్తున్నట్లు జనాభా గణాంకాలు లోగడ నిగ్గుతేల్చాయి. నిరుటి లాక్‌డౌన్ల కారణంగా పట్టణాల్లో 12 కోట్లమంది, పల్లెల్లో 28 కోట్లమంది కొత్తగా పేదరికంలోకి జారిపోయారన్న గణాంకాలు- ఇటీవలి వైపరీత్యం దృష్ట్యా కచ్చితంగా మరింత విస్తరించి ఉండాలి. కోట్ల మంది వలస కూలీలు, అసంఖ్యాక విద్యావంతుల బతుకుల్లో నిప్పులు పోసిన కొవిడ్‌ ఇంకా ప్రకోపిస్తుండగా- క్షేత్రస్థాయి స్థితిగతుల్ని పట్టించుకోకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇలా మార్గదర్శకాలు సూచించడం హాస్యాస్పదంగా ఉంది.

ఊసురూ మంటుంటే.. ఉచిత సలహాలేలా?

రోగ లక్షణాలకు తగ్గట్లు నిర్ణీత కాలావధిలో మాత్రలు వాడి, మూడు పొరల మాస్కులు ధరిస్తూ, ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లతో తరచూ చేతులు శుభ్రపరచుకునే ఆర్థికస్థోమత ఎంతమందికి ఉందిక్కడ? పొట్ట చేతపట్టుకుని సొంతూళ్లు వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలకు చేరి కాయకష్టంతో రోజులు నెట్టుకొస్తున్న కోట్లాది వలస కూలీలెందరికో- పనిలేదు, తిండి లేదు, స్వస్థలాలకు భద్రంగా చేర్చే ఏర్పాట్లూ కరవు. ఊరూవాడా పోషకాహార లోపాల తీవ్రత చెప్పనలవి కాదు. తక్షణం మానవీయంగా స్పందించాల్సిన బాధ్యతను ఉపేక్షించి- కొవిడ్‌ బాధితులు, వారి సంరక్షకులు ఎలా మెలగాలో కేంద్రం ఉచిత సలహాలు క్రోడీకరించడం.. విధ్యుక్తధర్మాన్ని గాలికొదిలేయడం కాక మరేమిటి?

జాతీయ సంక్షోభం

ఇంట్లోనే ఉండి ప్రజానీకం సొంతంగా పాటించాల్సిన జాగ్రత్తల్ని మార్గదర్శకాల పేరిట గుదిగుచ్చడం సరే- తన వంతుగా పాలన యంత్రాంగం ఏం చేసింది, మరేం చేస్తోందన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నం కాకమానవు. కొవిడ్‌ కేసులు అమాంతం పెరిగిపోతుండటాన్ని 'జాతీయ సంక్షోభం'గా అభివర్ణించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశంపై 'సుమోటో' విచారణకు సిద్ధపడటం- పరిస్థితి ఎంతగా వికటించిందనడానికి గట్టి రుజువు. ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించాల్సిన అగత్యమేమిటని ఈసీకి తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తలంటేయగా- 'కొవిడ్‌ నియంత్రణ కోసం 15 నెలలుగా ఏం చేస్తున్నా'రంటూ కేంద్రాన్ని మద్రాస్‌ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.

శవదహనాలకు 'క్యూ'లు

ముందస్తు వ్యూహం కొరవడ్డ పర్యవసానంగా ఇండియాను నేడు పెద్దఎత్తున టీకాల కొరత వెంటాడుతోంది. ఆస్పత్రుల్లో రోగులకు చాలినన్ని పడకలు లేవు. బెడ్స్‌కోసం, అత్యవసర చికిత్సకోసం, కడకు శవదహనాలకు సైతం 'క్యూ'లు దిగ్భ్రాంతపరుస్తున్నాయి.

బ్యాంకులకు సాయం కానీ.. కొవిడ్​ బాధితులకు..?

రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు నల్లబజారుకు తరలుతున్నాయి. కేసుల తాకిడి అధికంగా ఉన్న 12 రాష్ట్రాల ఆక్సిజన్‌ అవసరాలకు మూడింతల ట్యాంకుల నిల్వలున్నట్లు సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం ఇటీవల నివేదించింది. అదే నిజమైతే, ఆక్సిజన్‌ సరఫరాల కొరతపై రాష్ట్రాలవారీగా గగ్గోలు- నిస్సంశయంగా ప్రణాళికా లోపాల పర్యవసానమే. విశ్వవ్యాప్తంగా ప్రతి నాలుగు కొవిడ్‌ మరణాల్లో ఒకటి భారత్‌లోనే నమోదవుతున్నవేళ, చేతనైన సాయం అందించడానికి సుమారు 40 దేశాలు ముందుకు రావడం వాటి మానవీయ స్పందనకు నిదర్శనం. 139 కోట్ల జనాభాకు నెలవైన ఇండియాను ఏ దేశమైనా ఎంతవరకు ఆదుకోగలదు? మొత్తం టీకాలను కొనుగోలు చేసి కేంద్రమే ఎందుకు పంపిణీ చేయడం లేదన్న సర్వోన్నత న్యాయస్థానం సూటిప్రశ్నకు జవాబేది?

బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక తోడ్పాటు అందించడానికి వ్యూహకర్తలు సంకోచించరుగాని- కొవిడ్‌ బాధార్తుల్ని సాంత్వనపరచడానికి చేతులు రావడం లేదు. విధానపరమైన తప్పటడుగుల్ని సరిదిద్దుకుని ఆరోగ్యవ్యవస్థను పరిపుష్టీకరించి- కొవిడ్‌ నియంత్రణకు, సత్వర వ్యాక్సినేషన్‌కు సమర్థ ప్రణాళికల అమలుతో సొంతకాళ్లపై నిలదొక్కుకోవడమే.. సంక్షుభిత జాతిని గట్టెక్కించగలదు!

ఇదీ చదవండి:'మరో 4 వారాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం'

ABOUT THE AUTHOR

...view details