How Covid Changed Our Lives: ప్రపంచం కొవిడ్ మహమ్మారి పడగ నీడలో మూడో సంవత్సరంలోకి అడుగిడుతోంది. కొవిడ్ కారణంగా పని, రాజకీయాలు, ప్రజారోగ్యం, ఆర్థిక విధానం అన్నీ అతలాకుతలమయ్యాయి. 2022లో ఒకవేళ కొవిడ్ పీడ విరగడ అయినా ప్రజలకు పాత రోజులు పునరావృతమయ్యే అవకాశం కనిపించడం లేదు. కొవిడ్ దెబ్బకు అన్ని రంగాలూ సమూల మార్పులకు లోనవ్వడమే దీనికి కారణం. వరస లాక్‌డౌన్లతో దేశదేశాల్లో అసంఘటిత కార్మికులు, వలస కూలీలు ఉపాధి కోల్పోయారు. ఆదాయాలు హరించుకుపోయి, ఆహార ధరలు పెరిగి పేదల క్షుద్బాధ మిన్నంటింది. 2020లో ప్రపంచమంతటా 81.1 కోట్లమంది నిరంతర ఆకలి బాధను అనుభవించారని, అది అంతకుముందు సంవత్సరంకన్నా 11.8 కోట్లు హెచ్చు అని ఐక్యరాజ్యసమితి అంచనా. 2022లో కూడా ఎరువుల ధరలు పెరిగి, కరెన్సీ విలువలు తరిగి అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో ఆహారోత్పత్తి దెబ్బతినబోతోంది. పేద దేశాల పిల్లలు, పెద్దలలో పోషకాహార లోపం పెరుగుతూ ఆరోగ్యం దెబ్బతింటోంది. అసంఘటిత కార్మికులు, స్త్రీలు, పిల్లలు, యువత అగచాట్లను చూస్తే, వారి మీద కొవిడ్ పగబట్టిందా అనిపిస్తుంది. కొవిడ్ కాలంలో అందరూ ఇంటిపట్టునే ఉండాల్సి రావడంతో ప్రతి ముగ్గురు మహిళలు, బాలికల్లో ఒకరు ఇంటాబయటా హింసను ఎదుర్కోవలసి వచ్చిందని ఐరాస మహిళా విభాగం తెలిపింది. మహిళల భద్రతకు, ఉద్యోగాలు, ఆదాయాలకు వైరస్ ఎసరు పెట్టింది. కొవిడ్ కాలంలో పలు దేశాల్లో స్త్రీల ఆత్మహత్యలు పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ధనిక దేశాల్లో బూస్టర్ డోసులు
కొవిడ్ కాలంలో పేద, సంపన్న దేశాల మధ్య అంతరాలు మరింత విజృంభించాయి. ప్రపంచ కొవిడ్ టీకా సరఫరాల్లో 82 శాతాన్ని సంపన్న దేశాలు దొరకబుచ్చుకుంటే, పేద దేశాలకు కనీసం ఒక శాతం టీకాలైనా లభ్యం కాలేదు. అయినా, ధనిక దేశాలు తమ పౌరులకు బూస్టర్ డోసులు అందిస్తున్నాయి. టీకాల్లో అసమానత అభివృద్ధిలోనూ అంతరాలకు దారితీస్తుంది. 2021 ద్వితీయ త్రైమాసికంలో 14మందికి టీకాలు పడితే ఒక పూర్తికాల ఉద్యోగం చొప్పున అందుబాటులోకి వచ్చిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) లెక్కగట్టింది. కాబట్టి జనాభాలో అత్యధికులకు టీకాలు వేసిన దేశాలు వేగంగా ఆర్థికాభివృద్ది బాట పడతాయని, టీకాలు దొరకని పేదదేశాలు అభివృద్ధిలో వెనకబడతాయని నిర్ధారణ అవుతోంది. కొవిడ్ రోజుల్లో దేశాల మధ్యనే కాకుండా వ్యక్తుల మధ్య కూడా అసమానతలు పెచ్చరిల్లాయి. 2019-21 మధ్య ప్రపంచ కుబేరుల సంపద 50 శాతానికిపైగా పెరగ్గా- పేద, మధ్యతరగతివారు ఉన్నది కాస్తా ఊడ్చుకుపోయి ఆర్థికంగా తీవ్ర కడగండ్ల పాలవుతున్నారని ప్యారిస్‌కు చెందిన వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ తాజా నివేదిక వెల్లడించింది.
కొవిడ్ వల్ల పని పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, పెరిగిన ఒత్తిడి కొన్ని దేశాల్లో సామూహిక రాజీనామాలకు కారణమయ్యాయి. అమెరికాలో 2021 జులై-అక్టోబరు మధ్య భారీ సంఖ్యలో రాజీనామాలు చేశారు. చైనా యువత వారంలో ఆరు రోజులూ ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు పని చేయడానికి ససేమిరా అంటున్నారు. తమ అవసరాలు తీర్చుకోవడానికి సరిపడినంత పని మాత్రమే చేస్తామంటున్నారు. కొవిడ్ కాలంలో విపరీతంగా గిరాకీ పెరిగిన టెక్నాలజీ, ఆరోగ్య సేవల రంగాల్లో రాజీనామాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఇంటి నుంచి పని చేయగలవారికి కొత్త ప్రత్యామ్నాయాలు దొరుకుతున్నాయి. కొవిడ్ లాక్‌డౌన్లు అసంఘటిత రంగాన్ని దారుణంగా దెబ్బతీశాయి. భారతదేశ శ్రామిక బలగంలో 93 శాతం అసంఘటిత కార్మికులేనని జాతీయ నమూనా సర్వే 2014లో నిర్ధారించింది. 2017-18లో భారత ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగ వాటా 52.4 శాతం; 2020-21లో అది 15-20 శాతానికి పడిపోయిందని ఎస్‌బీఐ రీసెర్చి సంస్థ వెల్లడించింది. కొవిడ్ వేళ డిజిటలీకరణ విస్తరించడం, కాంట్రాక్టు పద్ధతిలో చేసే తాత్కాలిక ఉద్యోగాలు పెరగడమే అసంఘటిత రంగ వాటా తగ్గడానికి మూలకారణం.
విద్యా ఉపాధులపైనా...
కొవిడ్ తాకిడికి 180 దేశాల్లో విద్యా సంస్థలు మూతపడి 160 కోట్లమంది చదువు అటకెక్కింది. పేద విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, అంతర్జాల సౌకర్యాలు లేక చదువులో, జీవితంలో వెనకబడిపోతున్నారు. కొవిడ్ దాపురించకపోయి ఉంటే వారంతా చదువులు పూర్తి చేసుకుని వృత్తి, ఉద్యోగాల్లో చేరి తమ జీవిత కాలమంతా 17 లక్షల కోట్ల డాలర్లు ఆర్జించగలిగేవారని, ఇప్పుడది అసాధ్యం కానున్నదని ప్రపంచబ్యాంకు, యునిసెఫ్, యునెస్కోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొవిడ్ కాలంలో బాల కార్మికుల సంఖ్య పెరిగిపోతోంది. నాలుగేళ్ల క్రితంకన్నా ఇప్పుడు వీరి సంఖ్య 84 లక్షలు అధికం. కుటుంబ పేదరికమే వారికి ఆ దుస్థితిని తెచ్చిపెడుతోంది.