దేశీయంగా బ్యాంకుల్లో ఎన్నాళ్లుగానో పారుబాకీలు కొండల్లా పేరుకుపోతున్నాయి. నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా వ్యవహరించే మొండి బకాయిల పద్దు వచ్చే మార్చి నాటికి తగ్గనుందని రేటింగ్ ఏజెన్సీ 'ఇక్రా' చెబుతున్నా- ఇతర విశ్లేషణలు ఆందోళనకర దృశ్యాన్నే ఆవిష్కరిస్తున్నాయి. అయిదేళ్లక్రితం ప్రవేశపెట్టిన దివాలా పరిష్కార స్మృతి (ఐబీసీ) పనితీరు, వికటించిన చికిత్సకు దాఖలాగా పరువు మాస్తోంది. ఇన్నేళ్లలో దాని ద్వారా బ్యాంకుల బాకీల్లో వసూళ్లు ఏపాటి అన్న ప్రశ్నకు దిగ్భ్రాంతి కలిగించే సమాధానం దూసుకొస్తుంది. వివిధ వ్యాపార సంస్థల నుంచి రావాల్సిన బకాయిల్లో దివాలా పరిష్కారం కింద బ్యాంకులు కొన్ని సందర్భాల్లో 98 శాతం వరకు వదులుకోవాల్సి వస్తున్నదంటే, ఎవరైనా దిమ్మెరపోవాల్సిందే. తీసుకున్న అప్పుల్ని తిరిగి చెల్లించని సంస్థల నుంచి వీలైనంత రాబట్టుకోవడం, రుణాలు ఎగవేసిన సంస్థల్ని వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నవారికి బదలాయించి తద్వారా మొండిబాకీల పరిమాణాన్ని సాధ్యమైనంతగా కుదించడం- దివాలా స్మృతి ప్రధాన లక్ష్యాలు.
వీడియోకాన్, శివ ఇండస్ట్రీస్ అండ్ హోల్డింగ్స్, జెట్ ఎయిర్‌వేస్ ప్రభృత సంస్థల దివాలా పరిష్కారాల తీరుతెన్నులు పరికిస్తే, సుమారు 95శాతం మేర అప్పులూ వడ్డీల్ని తెగ్గోస్తేనే గాని కొనుగోలుదారులు ముందుకు రాని వైనం- ఐబీసీ రూపేణా అహేతుక చికిత్సను కళ్లకు కడుతుంది. దివాలా స్మృతికింద పునర్ వ్యవస్థీకరణ లేదా ఆస్తుల విక్రయానికి విధించిన గరిష్ఠ గడువు 270 రోజులు. మూడు వందలకు పైగా కార్పొరేట్ రుణ గ్రహీతల కేసుల్ని విశ్లేషిస్తే పరిష్కార ప్రక్రియ ఒక కొలిక్కి రావడానికి పట్టిన సగటు వ్యవధి 441 రోజులుగా లెక్క తేలుతుంది. నిర్దేశించిన గడువును తుంగలో తొక్కి, దివాలా స్థితిలోని కంపెనీల్ని సొంతం చేసుకోవడానికి బడా సంస్థలు విదిపే స్వల్ప మొత్తాన్నే బ్యాంకులు విధిలేక తీసుకోవాల్సి రావడం- అదెంతటి లోపభూయిష్ఠ చికిత్సో ప్రస్ఫుటీకరిస్తోంది!
ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడ?