History of Parliament House of India :ఎన్నో చట్టాలకు, చర్చలకు, నిర్ణయాలకు, భావోద్వేగాలకు నిలువెత్తు సాక్ష్యం.. భారత పార్లమెంటు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు ఇది వేదికైంది. తన అమృతోత్సవ ప్రస్థానాన్ని సమీక్షించుకోవడానికి సోమవారం నుంచి ప్రత్యేకంగా సమావేశమవుతోంది పార్లమెంట్. ఈ సమావేశంలో రాజ్యాంగ సభ నుంచి ఇప్పటిదాకా 75 ఏళ్ల అనుభవాలెన్నింటినో నెమరు వేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ప్రస్థానంపై ప్రత్యేక కథనమిదీ..
యువతరం ఆనాడే ఎక్కువ..
ప్రపంచంలో అత్యంత యువశక్తి ఉన్న దేశంగా ప్రస్తుతం భారత్ ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 66% జనాభా 35 ఏళ్లలోపు వారే ఉన్నారు. లోక్‌సభలో ఈ యువతరం శాతాన్ని చూస్తే నిరాశే కలుగుతుంది. మొత్తం 545 మంది సభ్యులున్న ప్రస్తుత 17వ లోక్‌సభలో 35 ఏళ్లలోపు వారి సంఖ్య కేవలం 21 మాత్రమే. పేదరికం విలయ తాండవం చేస్తున్న.. అక్షరాస్యత అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ఏర్పడ్డ తొలి లోక్‌సభలో (1952) యువ సభ్యుల సంఖ్య 82. ఇప్పటి వరకు ఆ రికార్డు బద్దలు కాకపోవడం గమనార్హం. భారత్ ప్రపంచ యువ దేశంగా ఆవిర్భవించిన ఈ సమయంలోనే.. 35 ఏళ్లలోపు సభ్యుల సంఖ్య ఎన్నడూ లేనంతగా 21కి పడిపోయింది. తొలి లోక్‌సభలో సభ్యుల సగటు వయసు 46.5 కాగా... ప్రస్తుత లోక్‌సభలో సగటు వయసు 55 ఏళ్లు.
మహిళల వాటా పెరిగింది..
యువతరం పెరగకున్నా సభలో మహిళల వాటా పెరగడం సంతోషించాల్సిన అంశం. తొలి సభలో 22 మంది (4.41%) మహిళా ఎంపీలుండగా.. ప్రస్తుత సభలో వారి సంఖ్య 78 (14.36%)గా ఉంది. ఇంత మంది మహిళలు లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఏ సభలోనూ లేరు. మహిళలకు ఇవ్వాలనుకుంటున్న 33% రిజర్వేషన్లకు ఇదింకా ఎంతో దూరంలోనే ఉన్నట్లు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. తొలి లోక్‌సభలో 45 మంది మహిళలు ఎన్నికల బరిలో నిలవగా 2019లో 726 మంది పోటీపడ్డారు.
డిప్యూటీ స్పీకర్ లేని సభ ఇదే..
లోక్‌సభలో స్పీకర్‌తో పాటు డిప్యూటీ స్పీకర్ ఉండటం ఆనవాయితీగా వస్తుంది. కానీ చరిత్రలో తొలిసారిగా 17వ లోక్‌సభలో ఆ పదవి ఇప్పటి వరకు ఖాళీగానే ఉంది. డిప్యూటీ స్పీకర్‌గా ఎవ్వరినీ ఎన్నుకోలేదు.
పని దినాలు పడిపోయాయి..
దేశ ప్రజల సమస్యల పరిష్కారాల కోసం చర్చించాల్సిన ఉభయ సభలు ఆ పనిని క్రమంగా తగ్గించుకుంటున్నాయి. 1974 దాకా లోక్‌సభ ఏటా వంద రోజులకు తక్కువ కాకుండా సమావేశమయ్యేది. 1956లో అత్యధికంగా 151 రోజులు పని చేసింది లోక్‌సభ. ఇప్పటికీ అదే రికార్డుగా నిలిచింది. 2020లో (కొవిడ్) అత్యల్పంగా 33 రోజులే పని చేశాయి లోక్‌సభ, రాజ్యసభ. 1956లో అత్యధికంగా 113 రోజులు భేటీ అయింది రాజ్యసభ. ప్రస్తుత లోక్‌సభ ఏటా సగటున 58 రోజులు మాత్రమే సమావేశమవుతోంది. తొలి లోక్‌సభ తన గడువు పూర్తయ్యేలోగా 677 సార్లు భేటీ కాగా.. 16వ లోక్‌సభ (2014-19) అత్యల్పంగా (ఐదేళ్ల కంటే తక్కువ పని చేసిన సభలను తప్పిస్తే) 331 రోజులే భేటీ అయింది. వచ్చే మేతో గడువు ముగియనున్న ప్రస్తుత 17వ లోక్‌సభ ఆ 331 మార్కునూ దాటేలా కనిపించడం లేదు. అదే జరిగితే 1952 తర్వాత అత్యంత తక్కువ కాలం భేటీ అయిన సభగా ఇది రికార్డుల్లో నిలువనుంది.
చర్చలు తగ్గాయి..
పని దినాలు తగ్గడం వల్ల చర్చలు కూడా తగ్గాయి. బిల్లుల ఆమోదం సైతం తగ్గింది. గవర్నమెంట్ ఆర్డినెన్సుల జారీ పెరిగింది. 1952 నుంచి 1965 దాకా ప్రభుత్వ ఆర్డినెన్సులు ఏ సంవత్సరంలోనూ రెండంకెలను దాటలేదు. రాజకీయ సంక్షోభాలను చూసిన 1966 నుంచి 1980 మధ్య రెండంకెలను దాటాయి. సంకీర్ణాల శకమైన 1990లలో ఈ సంఖ్య మరితం పెరిగినా... 2002-2012 మధ్య తగ్గింది. మోదీ ప్రభుత్వం వచ్చిన అనంతరం సభ నిర్వహణలో అంతరాయంతో ఆర్డినెన్సులు పెరిగాయి.
ప్రశ్నలదీ అదేబాట..
చట్ట సభల్లో ప్రశ్నోత్తరాలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, అనేక అంశాలపై సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీసేది, అప్రమత్తం చేసేది, సమాధానాలు తెలుసుకునేది ఈ ప్రశ్నోత్తరాల సమయం నుంచే. అలాంటి కీలకమైన ప్రశ్నోత్తరాలపై లోక్‌సభ వెచ్చిస్తున్న సమయం క్రమంగా తగ్గుతోంది. తొలి లోక్‌సభ తన మొత్తం సమయంలో 15% (551 గంటల 51 నిమిషాలు) ప్రశ్నోత్తరాలకు కేటాయించింది. కానీ 14వ లోక్‌సభ నాటికి ఆ సమయం 11.4శాతానికి పడిపోయింది.
Editorial on Indian Democracy : 'వందేళ్ల దిశగా స్వతంత్ర భారత్'.. అమృత కాలంలో దేశ ప్రజాస్వామ్య తీరుతెన్నులు..
Vishwakarma Scheme 2023 : 'విశ్వకర్మ' స్కీమ్.. వారికి రూ.2లక్షల లోన్.. రోజుకు రూ.500తో శిక్షణ.. అర్హులెవరంటే?