Himachal Pradesh Elections : శీతల వాతావరణానికి నెలవైన హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నవంబర్ 12న అక్కడ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపడతారు. మొత్తం 68 స్థానాలున్న ఆ రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. హిమాచల్‌లో ప్రధానంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (భాజపా) మధ్యనే పోటీ నెలకొంది. 1971 జనవరి 25న ప్రత్యేక రాష్ట్రంగా హిమాచల్‌ప్రదేశ్ ఆవిర్భవించింది. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్, భాజపాలు ఒక దాని తరవాత ఒకటి అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. ఈసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బరిలో నిలవనుంది. హిమాచల్‌లో వరసగా రెండోసారి అధికారం చేపట్టాలని భాజపా ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం ఆ పార్టీ జాతీయ స్థాయి నేతలను ప్రచారంలోకి దింపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో ఇప్పటికే పర్యటనలు జరిపారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంతో పాటు ఓటర్లపై మరిన్ని హామీలు గుప్పించారు.
హిమాచల్‌ప్రదేశ్ మొత్తం ఓటర్లు 55.74 లక్షలు. మహిళా ఓటర్లతో పోలిస్తే పురుష ఓటర్లే అధికం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ అక్కడ 44 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 21 సీట్లకే పరిమితమైంది. భాజపా దాదాపు 49 శాతం ఓట్లను సాధించింది. హస్తం పార్టీ సుమారు 42 శాతం ఓట్లు రాబట్టింది. హిమాచల్‌లో ఈ దఫా కూడా భాజపాయే విజయ దుందుభి మోగిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ నమ్మకంగా చెబుతున్నారు. ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల మాదిరిగా ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చకుండా హిమాచల్‌లో ఈసారీ జైరామ్‌నే సీఎం అభ్యర్థిగా భాజపా కొనసాగిస్తోంది.
అరణ్యాలతో నిండిన హిమాచల్‌లోని పర్వత ప్రాంతాల్లో దాదాపు ఇరవై వేలకు పైగా గ్రామాలు చెల్లాచెదురుగా విస్తరించి ఉంటాయి. జాతీయ భావం మెండుగా నిండిన ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, భాజపాలు మినహా ఇతర ప్రాంతీయ పార్టీల ఎదుగుదలకు మొదటి నుంచి అవకాశం తక్కువగా ఉంటోంది. చాలా రాష్ట్రాల్లో మాదిరిగా స్థానిక సమస్యలతో ఏదైనా ప్రాంతీయ పార్టీ హిమాచల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆస్కారం లభించడంలేదు. ఆ విషయం తెలిసీ, ఈసారి ఆమ్‌ఆద్మీ పార్టీ తన అదృష్టాన్ని అక్కడ పరీక్షించుకోవాలని చూస్తోంది. గెలుపు కోసం పంజాబ్‌లో మాదిరిగా హిమాచల్‌లోనూ కేజ్రీవాల్ భారీ ప్రచారానికి తెరతీశారు. పంజాబ్‌లో ఆయన వ్యూహాలు ఫలించి ఆప్ ఘన విజయం సాధించింది. హిమాచల్‌లో అవి ఎంతమేరకు అక్కరకొస్తాయో వేచి చూడాలి.