తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఉన్నత విద్యారంగం విస్తరిస్తున్నా.. నాణ్యతా ప్రమాణాలు ఏవి? - education in india

దేశంలో ఉన్నత విద్యారంగం విస్తరిస్తున్నా, నాణ్యతా ప్రమాణాల సాధనలో వెనకంజలోనే ఉంది. ఇటీవల ప్రకటించిన ప్రపంచంలోని అత్యుత్తమ రెండు వందల యూనివర్సిటీల జాబితాలో మనదేశంలో మూడు విద్యాసంస్థలకు మాత్రమే చోటు దక్కడం ఇందుకు తార్కాణం. సమాచార ప్రసార రంగంలోని విజ్ఞాన ఆధారిత వ్యాపార సర్వీసులలో చైనా యువత 10 శాతం పని చేస్తుంటే, మన దేశ యువత కేవలం రెండు శాతమే ఉన్నారు. ఈ రంగాల్లో కిందిస్థాయి ఉద్యోగాలకు మాత్రమే మనవాళ్లు పరిమితమవుతున్నారు.

higher education
నాణ్యతే గీటురాయి

By

Published : Jul 21, 2021, 7:00 AM IST

మన దేశంలో ఉన్నత విద్యా రంగం రెండు దశాబ్దాలుగా విస్తరిస్తోంది. స్వాతంత్య్రం వచ్చేటప్పటికి 20 విశ్వవిద్యాలయాలు, 500 కళాశాలలు ఉండగా- ప్రస్తుతం 1,043 వర్సిటీలు, 135 జాతీయ ఉన్నత విద్యాసంస్థలు, 16 సార్వత్రిక వర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలో పనిచేసే 52,627 కళాశాలలు సేవలు అందిస్తున్నాయి. ఉన్నత విద్యారంగం విస్తరిస్తున్నా, నాణ్యతా ప్రమాణాల సాధనలో వెనకంజలోనే ఉంది. ఇటీవల ప్రకటించిన ప్రపంచంలోని అత్యుత్తమ రెండు వందల యూనివర్సిటీల జాబితాలో- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు, ఐఐటీ ముంబై, ఐఐటీ దిల్లీ వంటి మూడు విద్యాసంస్థలకు మాత్రమే చోటు దక్కడం ఇందుకు తార్కాణం.

సమాచార ప్రసార రంగంలోని విజ్ఞాన ఆధారిత వ్యాపార సర్వీసులలో చైనా యువత 10 శాతం పని చేస్తుంటే, మన దేశ యువత కేవలం రెండు శాతమే ఉన్నారు. ఈ రంగాల్లో కిందిస్థాయి ఉద్యోగాలకు మాత్రమే మనవాళ్లు పరిమితమవుతున్నారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఉన్నత విద్య దక్కకపోవడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో సమూల మార్పులు తీసుకొని రావడానికి నూతన విద్యా విధానం శ్రీకారం చుట్టింది.

మార్పు వైపు పయనం

గత అయిదేళ్లలో ఉన్నత విద్యా రంగంలో చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తూ కేంద్ర విద్యా శాఖ పదో అఖిల భారత సర్వే-2019-20 నివేదికను గత నెలలో విడుదల చేసింది. దీని ప్రకారం ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు 11.40 శాతం పెరిగింది. జాతీయ స్థూల నమోదు నిష్పత్తిలో వివిధ వర్గాల నమోదుకు సంబంధించిన అసమానతలు నెలకొనడంతో పాటు, కేవలం 30 శాతంలోపే ఉన్నత విద్యా రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఉన్నత విద్య చదివే వారిలో దాదాపు 80 శాతం అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో సంప్రదాయ కోర్సులలో ప్రవేశం పొందుతున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం దన్ను, నాణ్యత లేని కోర్సుల కారణంగా యువత ఉపాధి అవకాశాలకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దే ఉద్దేశంతో నూతన విద్యా విధానం నాలుగేళ్ల కాలవ్యవధిగల బహుళ అంశాల కోర్సులను ప్రతిపాదించింది. వీటిలో చేరిన విద్యార్థులు అధ్యయనం చేసిన కాలవ్యవధి ఆధారంగా తగిన ధ్రువపత్రాలను జారీ చేస్తారు. ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఈ తరహా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను విస్తృతంగా రూపొందించి అందించాలి. ఇవి అన్ని స్థాయుల్లో అందుబాటులో ఉండేలా చూడాలి. పోస్టుగ్రాడ్యుయేట్‌ స్థాయిలో ఎక్కువ మంది విద్యార్థులు సాంఘిక శాస్త్రాల అధ్యయనం వైపే మొగ్గు చూపుతున్నారు.

0.5 శాతం విద్యార్థులే..

ఇప్పటికీ మొత్తంగా కేవలం 0.5 శాతం విద్యార్థులే పీహెచ్‌డీ కోర్సుల్లో చేరుతున్నట్లు నివేదిక వెల్లడించింది. మరోవైపు, నైపుణ్యాభివృద్ధి కోర్సులు, ఆవిష్కరణలకు దారితీసే పరిశోధనల కొరత ఉన్నత విద్యారంగంలో స్పష్టంగా గోచరిస్తోంది. ఈ క్రమంలో సామాజిక, ఆర్థిక సమస్యల సత్వర పరిష్కారానికి, నూతన ఆవిష్కరణలకు ఉద్దేశించిన పరిశోధనలను మాత్రమే విశ్వవిద్యాలయాలు ప్రోత్సహించాలి.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కోర్సుల రూపకల్పన, పాఠ్యాంశాలలో మార్పులు, పరిశోధన లక్ష్యాలను విశ్వవిద్యాలయాలు నిర్దేశించుకోవాలి. ఉన్నత విద్యా వ్యాప్తిలో ప్రాంతీయ, సామాజిక అసమానతలను తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా దూరవిద్యనూ తీర్చిదిద్దాలి. నాణ్యతా ప్రమాణాలను మెరుగు పరచడం ద్వారా ఈ వ్యవస్థను ఆకర్షణీయంగా మార్చాలి. ఉన్నత విద్యలో నాణ్యత మెరుగుదలకు ప్రభుత్వం పలురకాల కార్యక్రమాలను చేపట్టింది. విద్యా నాణ్యత ఉన్నతీకరణ, సమ్మిళిత కార్యక్రమం ద్వారా 2019-2024 మధ్య మెరుగైన ఉన్నత విద్యను అందించేందుకు ప్రణాళికను రూపొందించింది. స్థూల నమోదు నిష్పత్తిని రెట్టింపు చేసి సామాజిక, ప్రాంతీయ అసమానతలను సరిదిద్దడమే ఈ ప్రణాళిక లక్ష్యం. ప్రపంచ స్థాయి 1000 విశ్వవిద్యాలయాలలో కనీసం 50దాకా మనదేశానికి చెందిన ఉన్నత విద్యాసంస్థలు ఉండేలా ప్రమాణాలను సాధించడమూ ప్రణాళికలో భాగం.

ప్రణాళికల అమలే కీలకం

ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిగ్రీ చదివే విద్యార్థులకు సరైన అవగాహన కల్పించేందుకు, చదువు పూర్తయిన తరవాత ఏం చేయాలనే విషయంలో మార్గనిర్దేశనం చేసి, చురుకైన అభ్యాసకులుగా తీర్చిదిద్దేందుకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులకు అంతర్జాతీయ అవగాహనను పెంపొందించేందుకు, ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, విఖ్యాత సంస్థల అధిపతులను ఆహ్వానించి బోధనలో భాగస్వాములుగా చేసేందుకు 'గ్లోబల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ అకడమిక్‌ నెట్‌వర్క్‌' అనే కార్యక్రమం అమలులో ఉంది. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల ప్రమాణాలను మదింపు వేసి ర్యాంకులను కేటాయించేందుకు జాతీయ విద్యాసంస్థల ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌నూ ఏర్పాటు చేశారు.

అయితే, ఇలాంటి రకరకాల కార్యక్రమాలను ప్రవేశ పెట్టడంతోనే ప్రభుత్వాలు చేతులు దులుపుకోకూడదు. వాటిని పటిష్ఠంగా అమలు చేస్తూ, వర్సిటీల్లో నెలకొన్న బోధన, బోధనేతర సిబ్బంది, నిధుల కొరతను తీర్చడం, మౌలిక వసతులు సమకూర్చడం వంటి చర్యలు తీసుకుంటేనే ఉన్నత విద్యా లక్ష్యాలు సాకారమవుతాయి.

- డాక్టర్‌ సిహెచ్‌.సి. ప్రసాద్‌

ABOUT THE AUTHOR

...view details