దేశంలో కరోనా వైరస్ కసిగా కోరసాచకముందే, సంక్షోభ స్థాయికి చేరిన తీవ్ర సమస్య- వాయు కాలుష్యం. గాలి నాణ్యతకు తూట్లు పడుతున్న పర్యవసానంగా భారత్‌లో వ్యాపార కార్యకలాపాలకు ఏటా వాటిల్లుతున్న నష్టం, ఎకాయెకి ఏడు లక్షల కోట్ల రూపాయలన్నది తాజా అధ్యయన సారాంశం. డాల్బర్గ్ అడ్వైజర్స్, శుద్ధవాయు నిధి (సీఏఎఫ్), భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)ల ఉమ్మడి విశ్లేషణలో నిగ్గుతేలిన 'వ్యాపార నష్టం'- స్థూల దేశీయోత్పత్తిలో మూడు శాతానికి, మొత్తం వార్షిక పన్ను వసూళ్లలో 50 శాతానికి, దేశ స్వస్థ సంరక్షణ బడ్జెట్‌లో 150 శాతానికి సమానమనడం దిగ్భ్రాంతపరుస్తోంది. వాయుకాలుష్యం వల్ల ఆరోగ్యం గుల్లబారి దేశ కార్మిక శ్రేణి ఏటా 130 కోట్ల పనిదినాలకు దూరమై కోల్పోతున్న రాబడే సుమారు రూ.44 వేల కోట్లుగా అధ్యయన నివేదిక లెక్కకట్టింది.
గాలికాలుష్యానికి 30శాతం మంది బలి
సిబ్బందిలో చురుకుతనం తగ్గి ఉత్పాదకత మందగించి వాణిజ్య సంస్థలు నష్టపోతున్నది అంతకు నాలుగింతలు! ఐటీ రంగం వంటివీ వాయు కాలుష్య దుష్ప్రభావాల బారినుంచి తప్పించుకోలేకపోతున్నాయి! విషకలుషితమైన గాలి సంవత్సరం వ్యవధిలోనే 17 లక్షల నిండుప్రాణాల్ని తోడేస్తున్న దేశం మనది. విపరీత ప్రాణనష్టాన్ని నివారించేందుకంటూ వారంక్రితమే జాతీయ కార్యాచరణ దళాన్ని హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) కొలువు తీర్చింది. వాయుకాలుష్యం ముమ్మరించిన ఇండియాలో గర్భస్రావాల ముప్పు అధికమని లాన్సెట్ అధ్యయనం ఇటీవలే ధ్రువీకరించింది. దేశంలో అర్ధాంతర మరణాల్లో 30శాతం దాకా వాయుకాలుష్యం మూలాన దాపురిస్తున్నవేనని లోగడే వెల్లడైంది. ఇంతలా ఆర్థికంగా పెనుభారం మోపుతూ, ప్రజారోగ్యాన్నీ ఖర్చు రాసేస్తున్న వాయుకశ్మలాన్ని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం- ఇటీవలి కేంద్ర బడ్జెట్లో గాలి నాణ్యత మెరుగుదల కోసం నిధుల కేటాయింపుల్ని తగ్గించింది. బతుకుల్ని, వ్యాపారాల్ని, ఉత్పాదకతను, దేశార్థికాన్ని కుంగదీస్తున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి దిద్దుబాటు చర్యలు ఇకనైనా సత్వరం పట్టాలకు ఎక్కాలి!