తెలంగాణ

telangana

ETV Bharat / opinion

దడ పుట్టిస్తున్న వడగాడ్పు- భూతాపమే కారణం - వడగాల్పులు

దేశంలో వడగాల్పుల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ఈ తీవ్రతకు ఆర్కిటిక్‌ ప్రాంతంలోని భూతాపమే కారణమని 'రాయల్‌ మెటీరియలాజికల్‌ సొసైటీ'కి చెందిన జర్నల్‌లో తాజాగా ప్రచురించిన అధ్యయనం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏటా సగటున 45 డిగ్రీలు దాటుతున్నాయి. దేశంలో వడగాల్పుల కారణంగా ఏటా అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నా.. ప్రభుత్వం మాత్రం వడగాడ్పులను విపత్తుల జాబితాలో చేర్చటం లేదు.

heat waves are continuesly increasing in india says royal meteriological society
దడ పుట్టిస్తున్న వడగాడ్పు- భూతాపమే కారణం

By

Published : Apr 3, 2021, 6:45 AM IST

దేశంలో వేసవి వడగాడ్పులవల్ల ఏటా వేలాది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈసారి ఏప్రిల్‌ కన్నా ముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటాయి. వాతావరణ శాఖ సైతం ఈ ఏడాది సాధారణం కన్నా 0.5 నుంచి ఒక డిగ్రీ వరకు అధికంగా సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సూచించడంతో వడగాడ్పుల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో ఏటా ఏప్రిల్‌, మే నెలల్లో సాధారణంగా వడగాడ్పులు వీస్తున్నా- ఈ మధ్య కాలంలో వీటి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 1998 నుంచి 2017 వరకు 1.6 లక్షల మంది వడగాడ్పుల వల్ల మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. భారత్‌లో ఇటీవలి వడగాడ్పుల తీవ్రతకు ఆర్కిటిక్‌ ప్రాంతంలోని భూతాపమే కారణమని 'రాయల్‌ మెటీరియలాజికల్‌ సొసైటీ'కి చెందిన జర్నల్‌లో తాజాగా ప్రచురించిన అధ్యయనం వెల్లడించింది.

భూతాపంవల్ల ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు వేగంగా పెరుగుతున్నాయని, దీనివల్లే ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా హెచ్చి వేడిగాలులు వీస్తున్నాయని ఆ అధ్యయనం చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏటా సగటున 45 డిగ్రీలు దాటుతున్నాయి. వడగాడ్పులకు ప్రతి సంవత్సరం వందలాది ప్రజలు బలవుతున్నారు. దేశంలో ఏటా ఈ ప్రకృతి వైపరీత్యం వేసవిలో చండప్రచండంగా మారి ప్రజల ప్రాణాలను కబళిస్తున్నా- ప్రభుత్వం మాత్రం వడగాడ్పులను విపత్తుల జాబితాలో చేర్చకపోవడం విడ్డూరం.


భూతాపమే కారణమా?


ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రాతిపదిక ప్రకారం మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకు మించి; కొండ, పర్వత ప్రాంతాల్లోనైతే 30 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకు మించి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులుగా పరిగణిస్తున్నారు. సాధారణంగా మానవుడి శరీరం 37 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వరకే తట్టుకోలుగుతుంది. అంతకు మించి పెరిగినప్పుడు మన శరీరం గాలిలో ఉండే వేడిని గ్రహించడం మొదలవుతుంది. ఈ పరిస్థితుల్లో గాలిలో తేమ శాతం పెరిగితే వడదెబ్బకు గురై అనారోగ్యం పాలవుతారు.

ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ- గాలిలో తేమ శాతం అసాధారణంగా పెరగడంవల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో సాధారణం కన్నా అధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చునంటూ భారత వాతావరణ శాఖ సూచించడం- పొంచి ఉన్న వడగాడ్పుల ముప్పునకు సంకేతంగా భావించాలి. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు కట్టడి చేయడం ద్వారా భూతాప ప్రజ్వలనాన్ని వడగాడ్పుల తీవ్రతను తగ్గించవచ్చేమో కానీ- పూర్తిగా అడ్డుకోలేం. దక్షిణాసియా ప్రాంతంలో ప్రత్యేకించి భారత్‌లో ప్రధానంగా సేద్యానికి ప్రసిద్ధి చెందిన పశ్చిమ్‌ బంగ, ఉత్తర్‌ ప్రదేశ్‌లలో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండవచ్చని, తాజాగా 'జియోఫిజికల్‌ లెటర్స్‌' జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. భూతాప వృద్ధిని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా కట్టడి చేసినా- 21వ శతాబ్దాంతానికి దక్షిణాసియా ప్రాంతంలో భీకర వడగాడ్పులు విరుచుకు పడతాయంటూ గతంలోనూ కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఆ పరిస్థితులు ఇప్పటికే ఉత్పన్నమైనట్లు వాతావరణ శాఖ ప్రకటనలు తేటతెల్లం చేస్తున్నాయి. 2015 సంవత్సరంలోనే భారత్‌లోని అనేక ప్రాంతాల్లో, పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో- చరిత్రలోనే అయిదో భీతావహమైన వడగాలులు సంభవించగా, దాదాపు 3,500 మంది మరణించారు. ప్రపంచ జనాభాలో సింహభాగం దక్షిణాసియాలోనే కేంద్రీకృతమై ఉండటం వల్ల భారీ సంఖ్యలో ప్రజలు వడగాడ్పులకు గురయ్యే ప్రమాదం ఉందన్నది కఠోర వాస్తవం.


జాగ్రత్తలే శ్రీరామరక్ష


వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్య మార్పుల ఫలితంగా భూఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంవల్లే వడగాడ్పుల తీవ్రత అధికమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషిస్తోంది. పగటి ఉష్ణోగ్రతల నిడివి ఎక్కువగా ఉండటం, రాత్రిపూట సైతం వాతావరణం చల్లబడక పోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఒత్తిడి పెరుగుతోంది. వడగాడ్పుల మూలాన మరణాలకు అదే ప్రధాన కారణమవుతోంది. శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారిపై వడగాలులు ఎక్కువగా ప్రభావాన్ని కనబరుస్తున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా సామాజికంగా, ఆర్థికంగానూ ప్రభావం చూపుతున్నాయి. మండుతున్న ఎండల్లో సహజంగానే కార్మికుల పనిసామర్థ్యం సన్నగిల్లుతుంది. ఉత్పాదకత పడిపోతుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. వడగాడ్పులకు కారణమవుతున్న భూతాపాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

వైద్య- ఆరోగ్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖతో సహా పలు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే వడగాడ్పుల వల్ల సంభవించే మరణాలను తగ్గించగలుగుతారు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, సలహాలు పాటించడం పౌరసమాజం బాధ్యత. వరదలు, తుపానులు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల జాబితాలో వడగాడ్పులను చేర్చాల్సిన అవసరం ఉంది. వడగాడ్పుల ప్రభావానికి గురి కాకుండా ప్రజలను చైతన్యవంతం చేయడానికి సమగ్ర కార్యాచరణను రూపొందించి అమలు పరచడం ప్రభుత్వాల బాధ్యత.

నిరుపేదలకు శాపం

సాధారణంగా భూఉపరితల ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలు దాటడమన్నది- పొలాల్లో వ్యవసాయం చేసుకునే రైతులకు, ఆరు బయట ఇతర పనులు చేసుకునే కార్మికులకు ఆరోగ్యరీత్యా అంత శ్రేయస్కరం కాదు. వడదెబ్బకు, అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. 60శాతం పైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడిన భారత్‌వంటి దేశాల్లోని ప్రజలు ఇంటి బయటకు వెళ్ళకుండా పనిచేసే పరిస్థితులు లేవన్నది యథార్థం. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులకూ వేసవినే అనుకూలమైన సమయంగా భావించడం- కార్మికుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరగడంవల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఉపాధి హామీ కూలీల ఆరోగ్యాన్ని కాపాడేందుకూ చర్యలు తీసుకోవడం అత్యంత ఆవశ్యకం.

- డాక్టర్ జీవీఎల్ విజయ్​ కుమార్​

రచయిత- భూ విజ్ఞాన శాస్త్ర నిపుణులు

ABOUT THE AUTHOR

...view details