రోజుల వ్యవధిలో రాలిపోతున్న ప్రాణాలు, కూలిపోతున్న కుటుంబాలతో ఊళ్లన్నీ కన్నీటి సంద్రాలవుతున్నాయి. 'గ్రామాల్లో వేగంగా విస్తరిస్తున్నCovid మహమ్మారిని అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నా'మని ప్రధాని మోదీ ఉద్ఘాటించినా- పట్టణాలను మించిన పాజిటివిటీ రేటుతో పల్లెపట్టులన్నీ మహమ్మారి భల్లూకంపట్టులోకి జారిపోతున్నాయి. మే నెలలో ప్రపంచవ్యాప్తంగా నిర్ధారితమైన ప్రతి నాలుగు కరోనా కేసుల్లో ఒకటి గ్రామీణ భారతంలోనే నమోదైందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్(సీఎస్‌ఈ) తాజాగా నివేదించింది.
ఆరోగ్య సౌకర్యాలు అధ్వానం..
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 53 శాతం, మరణాల్లో 52 శాతం గ్రామాల నుంచే వెలుగుచూస్తున్నాయి. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో జాతీయ సగటును దాటిపోయి 79 శాతం వరకు కొత్త కేసులకు పల్లెలే నెలవులవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, సీహెచ్‌సీల కన్నా 55365 తక్కువ ఉన్నాయని మొన్న మార్చిలో కేంద్రం పార్లమెంట్‌లోనే ప్రకటించింది. ప్రతి పదివేల మంది గ్రామీణులకు 3.2 ఆసుపత్రి పడకలే అందుబాటులో ఉన్నాయన్నది మరో చేదు నిజం! ఊపిరితిత్తులకు ఉరిబిగిస్తున్న కొవిడ్ రెండో దశలో బాధితులకు ప్రాణావసరంగా మారిన ఆక్సిజన్ పడకలు, ఐసీయూ పడకల సంఖ్యా వివరాలైతే మరీ అధ్వానం! మచ్చుకు మధ్యప్రదేశ్‌లో 55 వేల గ్రామాల్లోని 5.25 కోట్ల మందికి కేవలం 338 ఆక్సిజన్, 51 ఐసీయూ పడకలే దిక్కయ్యాయి. తరతమ భేదాలతో దాదాపు దేశమంతా అదే దుస్థితి నెలకొంది. 82 శాతం మంది స్పెషలిస్టు డాక్టర్ల కొరత నుంచి నర్సులు, రేడియోగ్రాఫర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల వరకు లెక్కకు మిక్కిలిగా మానవ వనరుల లేమితోనూ గ్రామీణ ప్రభుత్వాసుపత్రులు కునారిల్లుతున్నాయి. దశాబ్దాలుగా గ్రామీణ ఆరోగ్య రంగాన్ని గిడసబార్చిన పాలకుల నేరపూరిత నిర్లక్ష్యమే ఈ పెనువిపత్తు వేళ పల్లెలకు ప్రాణాంతకమవుతోంది! గ్రామసీమల్లోని సగానికి సగం ఆసుపత్రుల్లో చేతులు శుభ్రం చేసుకోవడానికి సైతం అవకాశం లేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. 'ఆయుష్మాన్ భారత్' కింద డిసెంబరు 2022 నాటికి దేశంలోని 1.5 లక్షల గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను 'ఆరోగ్య-శ్రేయో కేంద్రాలు'గా తీర్చిదిద్దుతామని మూడేళ్ల క్రితం కేంద్రం ఘనంగా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 75,532 కేంద్రాలనే అలా అభివృద్ధి చేయగలిగామంటున్నారు! పరీక్షల కిట్ల సరఫరాల్లో కోతల నుంచి బాధితులకు సత్వర చికిత్స అందించడం వరకు ఈ ఆపత్కాలంలో ప్రభుత్వాలు పల్లెలపై సవతితల్లి ప్రేమనే ఒలకబోస్తున్నాయి.