స్వదేశంలోనూ, విదేశాల్లోనూ చిన్న పిల్లలకు ఆరోగ్యవంతమైన బాల్యం అందించడానికి నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి చిరకాలంగా పాటుపడుతున్నారు. సత్యార్థి పోరాటం వల్లనే భారత్‌లో 90,000 మంది బాలలకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి లభించింది. 2015లో ప్రపంచంలోని గొప్ప నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సత్యార్థి.. 2025కల్లా అన్ని దేశాల్లో బాల కార్మిక దురాచారాన్ని రూపుమాపడానికి కట్టుబడి ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో కీలక ప్రసంగం చేసిన వారిలో ఆయన కూడా ఒకరు. కొవిడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా బాలలు ఎదుర్కొంటున్న కడగండ్ల గురించి కైలాస్ సత్యార్థి 'ఈటీవీ భారత్'తో మాట్లాడారు.
ప్ర. డబ్ల్యూహెచ్‌ఓ ఆరోగ్య సదస్సులో చేసిన ప్రసంగంలో బాలల హక్కుల సంరక్షణకు మీరు ఎలాంటి ప్రతిపాదనలు చేశారు?
జ. ఈ సదస్సులో దేశాధినేతల బదులు- సామాజిక కార్యకర్త, భారతీయుడినైన నాకు కీలక ప్రసంగం చేసే అవకాశం ఇవ్వడం అపూర్వ గౌరవం. అణచివేతకు, దోపిడీకి గురవుతున్న నిస్సహాయ బాలల దుస్థితి గురించి ఆలకించడానికి ప్రపంచం సిద్ధం కావడం నిజంగా గణనీయ పరిణామం. దీన బాలల వాణిగా వారి సమస్యలు, పరిష్కారాల గురించి మాట్లాడే అవకాశం నాకు లభించింది. పేద బాలలకు మామూలు రోజుల్లోనే చదువు గగనకుసుమం. ఈ కొవిడ్ కాలంలో ప్రపంచమంతటా కోట్లమంది చిన్నారులు చదువుకు దూరమైపోతున్నారు. పేద పిల్లలతో వెట్టిచాకిరీ చేయించడం, వారిపై లైంగిక అకృత్యాలకు పాల్పడటం, వ్యభిచారంలోకి దించడం ఈ ఉపద్రవ కాలంలో ఎక్కువైపోతోంది. వారికి పోషకాహారమూ అందడం లేదు. బాలల చదువును, వారి ఆరోగ్యాన్ని వేర్వేరు అంశాలుగా పరిగణించలేం. ప్రపంచ దేశాలు ఈ వాస్తవాన్ని గ్రహించి, బాలలు మరిన్ని కష్టాల పాలబడకుండా శీఘ్రమే కార్యాచరణ ప్రారంభించాలి. బాలల సంక్షేమం కోసం పనిచేస్తున్న యునిసెఫ్, డబ్ల్యూహెచ్‌ఓ, యునెస్కో తదితర ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలన్నీ ఒక్కటై ఈ కొవిడ్ కష్టకాలంలో బాలలను ఆదుకోవాలి. దీనికోసం సమితి ఓ ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటుచేయాలి. బాలలను కొవిడ్ కష్టాల నుంచి గట్టెక్కించి మెరుగైన భవిష్యత్తు చూపడమనేది ఏదో ఒక్క ప్రభుత్వ శాఖ వల్లనే సాధ్యమయ్యే విషయం కాదు. అన్ని దేశాల ఆరోగ్య, విద్యా శాఖలు చేయీచేయీ కలిపి పనిచేస్తేనే అది సుసాధ్యమవుతుంది. దీనితోపాటు ప్రతి దేశంలో బాలల బాగోగుల కోసం ప్రత్యేక కార్యబృందాన్ని ఏర్పాటు చేయాలి. ఆ బృందాలు బాలల మేలుకు చేసే సిఫార్సులను ప్రభుత్వాలు శ్రద్ధగా అమలు చేయాలి.
ప్ర. వివిధ దేశాల ప్రభుత్వాలు కరోనా వైరస్‌పై పోరుకు పెద్దయెత్తున కదిలినా, బాలల కోసం ఎక్కడా ప్రత్యేక ప్రణాళికలను చేపట్టలేదు. కారణాలు ఏమిటి?
జ. బాలలకు ముఖ్యంగా బడుగు వర్గాల పిల్లలకు ప్రభుత్వాల రాజకీయ, ఆర్థిక, సామాజిక, ప్రాధాన్యాలలో మొదటి నుంచీ సముచిత స్థానం లభించడం లేదు. అందుకే, పేదింటి బాలల్లో చాలామందికి చదువుకునే అవకాశాలు చిక్కడం లేదు. ఆరోగ్య, విద్యా బడ్జెట్లలో, సంక్షేమ, సంరక్షణ బడ్జెట్లలో పేద బాలల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనిపించడం లేదు. చట్టాల్లోనూ ఇదే పరిస్థితి. అంతర్జాతీయ అభివృద్ధి గ్రాంట్లలో బాలలకు ప్రత్యేక కేటాయింపులూ లేవు. ఈ లోపాలను సరిదిద్దినట్లయితే, బాలలకు జాతీయ, అంతర్జాతీయ వనరుల్లో సముచిత వాటా దక్కుతుంది. ఈ లక్ష్య సాధనకు గతేడాది మార్చి నుంచి దాదాపు 80 మంది దేశాధినేతలు, నోబెల్ గ్రహీతలు, ఐక్యరాజ్యసమితి విభాగాధిపతులను కలుపుకొని వెళ్లడానికి కృషి చేస్తున్నాను.
ప్ర. భారత్‌లో బాలలపై కరోనా ఎలాంటి ప్రభావం చూపుతోంది?
జ.మన దేశంలో అనేకానేక బడుగు వర్గాల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం పెద్ద వరం. ఈ పథకం వారిని విద్యాలయాలకు రప్పించడంతోపాటు వారికి పోషణ కూడా అందిస్తోంది. కరోనా వల్ల విద్యా సంస్థలు మూతపడటం పేద పిల్లలపాలిట శాపమైంది.