ఎండిపోతే పండు, నీటి తడి లేకపోతే పంట రసవిహీనమవుతాయి. అలాగే మార్దవం కరవైపోతే మనుషులు సున్నితత్వాన్ని కోల్పోతారు. కరోనా వైరస్ సృష్టించిన భయోత్పాతం మానవాళి మనఃస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భయం, ఆందోళన, దుఃఖం వంటి ఉద్వేగాలు.. ఎందరో మనోనిబ్బరం కోల్పోయేలా చేస్తున్నాయి. ఆర్థిక స్థితి క్షీణించడం, జీవనం కష్టమైపోవడంవంటివి మానసికంగా బలహీనపరుస్తున్నాయి. ఈ పరిస్థితులతో మానవ సంబంధాలు దెబ్బ తింటున్నాయి. ఎవరికి వారే జాగ్రత్త పడాల్సిన తరుణమిది.
అర్థం లేని ఆందోళన..
కరోనా మహమ్మారి పిల్లలు, పెద్దలు, పేదలు, ధనికులు అనే తేడా లేకుండా అందరినీ పీడిస్తోంది. కొందరిని కబళిస్తోంది. కొన్ని కుటుంబాలే విచ్ఛిన్నమయ్యే దుస్థితి దాపురించింది. ఆ మహమ్మారి బారిన పడకుండా అందరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. బాధలు కష్టాలను మరొకరికి చెప్పుకొంటే మనసు తేలిక అవుతుందంటారు. ప్రస్తుతం అందరిదీ ఒకే సమస్య కావడం వల్ల- చెప్పుకొనేందుకూ ఎవరూ లేని దుర్భర పరిస్థితి నెలకొంది. ఫలితంగా చాలామంది లోలోపలే మథనపడుతూ కుంగుబాటుకు లోనవుతున్నారు. కరోనా మహమ్మారి వ్యాపించేవరకు దానిపై ఎవరికీ ఎలాంటి అవగాహనా లేదు. ఇప్పటికీ వైరస్‌కు కచ్చితమైన మందు కనిపెట్టలేదు. దాన్ని నిరోధించడానికి కేవలం టీకా ఒక్కటే మనముందున్న ఆశాకిరణం. ఆ కార్యక్రమంలో తీవ్రంగా జాప్యం నెలకొంది. మరోవైపు చాలామంది వైరస్ గురించిన ఆధార రహిత భయాలకూ గురవుతున్నారు. ఇది మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
పెరిగిన అభద్రతాభావం
చాలామంది నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి చిరుద్యోగం, వ్యాపారం, ఏదో ఒక వృత్తి, స్వయం ఉపాధి లాంటి అనేక మార్గాల్లో వారి వారి తెలివి, సామర్థ్యాలకు తగినవిధంగా జీవనోపాధి కల్పించుకొంటున్నారు. నాలుగు రాళ్లు వెనకేసుకోలేకపోయినా, నాలుగు వేళ్లూ నోట్లోకి వెళతాయనే భరోసాతో ఉండేవారు. ఎవరిమీదా ఆధారపడకుండా బతకగలమనే ధీమా ఉండేది. కొద్దిగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే జీవితం పెద్దగా కష్టాలు లేకుండా సాగిపోయేది. కానీ ఏడాదిన్నరగా అన్ని రంగాలకూ వెన్నువిరిచి, దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసిన కరోనా వల్ల దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఉపాధి సాధించడం మాట అటుంచితే, రోజు గడవటమే గగనమవుతోంది. దాంతో జీవనానికే భరోసా లేని నిస్సహాయ స్థితిలోకి జారిపోతున్నారు. ప్రభుత్వోద్యోగుల నుంచి చిరుద్యోగుల వరకు, కార్మికుల నుంచి కర్షకుల వరకు ప్రతి ఒక్కరూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. పైకి వ్యక్తం చేయకపోయినా చాలామంది మనసుల్లో గుబులు, నైరాశ్యం లాంటివి గూడు కట్టుకొని ఉన్నాయి. ఇప్పటికే అభద్రతాభావం చాలా వరకు పెచ్చరిల్లింది. అది జీవితాలనే అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉంది.