హరియాణా ప్రభుత్వం ప్రైవేటు రంగంలో స్థానికులకు 75శాతం కోటా కల్పించాలంటూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీని ప్రకారం హరియాణాలో నెలకు యాభైవేల రూపాయలకన్నా తక్కువ ఆదాయం సంపాదించే ఎవరైనా 75శాతం స్థానిక కోటా కింద ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు అర్హులవుతారు! దీనివల్ల స్థానికులకు ఉద్యోగాలు రావడం మాట అటుంచి ఉన్న పరిశ్రమలు వెనక్కిపోయి రాష్ట్ర యువత భవిష్యత్తు అగమ్యగోచరమవుతుంది. ఒకవేళ ఇదే విధానాన్ని ఇతర రాష్ట్రాలూ అందిపుచ్చుకొంటే పారిశ్రామికంగా దేశం కుదేలవుతుంది. యువతకు ఉద్యోగాలు దొరకని పరిస్థితులు దాపురిస్తాయి. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకొని హరియాణా ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేస్తుందన్న ఆశే ఇప్పుడు అందరిలోనూ మిణుకుమిణుకుమంటోంది!
పెట్టుబడులు ఎగిరిపోతాయి...
హరియాణాలో ఐటీ పరిశ్రమ కొత్త రెక్కలతో విస్తరించి, యావత్తు రాష్ట్రానికి వరప్రదాయినిగా మారిందంటే అందుకు కారణం... గురుగ్రామ్! ఐటీ పరిశ్రమ వికసించడంతో ఆ రాష్ట్రంలో ఎంతోమంది లబ్ధిపొందారు. హరియాణా ప్రభుత్వం స్థానికులకు 75శాతం కోటా ప్రకటించగానే గురుగ్రామ్ ఐటీ పరిశ్రమలో కలకలం రేగింది. అక్కడి ఐటీ సూత్రధారులు ఇతర ప్రాంతాలకు తరలిపోయే అవకాశాలు వెదకడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే హరియాణా ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త చట్టంవల్ల ఐటీ పరిశ్రమకు ఎలాంటి ఇబ్బందీ కలగదని ప్రకటించింది. అదెంతవరకు సాధ్యమన్న మాట పక్కనపెడితే- ఐటీయేతర పరిశ్రమల్లో అంతర్మథనం మొదలైందన్నది మాత్రం నిజం.
గురుగ్రామ్‌లో డిజైన్లు రూపొందించే ఓ కంపెనీ... తన ప్రత్యేక అవసరాలకోసం దేశంలోని పలు ప్రాంతాలనుంచి నిపుణులను నియమించుకుంటుంది. కొత్త చట్టం అమలులోకి వస్తే ఆ దారులు మూసుకుపోతాయి. ప్రత్యేక అవసరాల రీత్యా కోటాకు మినహాయింపులు ఇవ్వాలని అభ్యర్థించేందుకు చట్టంలో వెసులుబాట్లు లేవు. ఒకవేళ మునుముందు ఆ మేరకు చట్టం అవకాశం కల్పించినా.. ప్రతిసారీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిరావడంవల్ల తీవ్ర జాప్యం జరుగుతుంది.
దస్త్రాలపై సంతకాలకోసం వివిధ స్థాయుల్లో ప్రభుత్వ యంత్రాంగానికి లంచాలు ముట్టజెప్పడం వంటివి మరోరూపంలో ఒకప్పటి 'లైసెన్స్‌రాజ్'ను దేశం నెత్తిన రుద్దే ప్రమాదం ఉంది. నిపుణ కార్మికులపై ఆధారపడిన అనేక పరిశ్రమలకు ఈ చట్టం ఓ గుదిబండ! దీనివల్ల పరిశ్రమలు, పెట్టుబడులు, ఆ వెన్వెంటే ఉద్యోగాలూ హరియాణానుంచి ఇతర రాష్ట్రాలకు ఎగిరిపోయే ప్రమాదం ఉంది. అవినీతికి ముకుతాడు వేసి, రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణలో హరియాణా ప్రభుత్వం ఎన్నో సానుకూల నిర్ణయాలు తీసుకొంది. కోటా నిర్ణయం మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధమైనది. ఇంతకీ ఎవరు హరియాణాకు చెందినవారో, ఎవరు కాదో నిర్ణయించడమెలా? ఆ విషయాన్ని నిగ్గు తేల్చేది ఎవరు?
వలస కార్మికులపై వేటు..
'ఒకే దేశం, ఒకే పన్ను' నినాదంతో జీఎస్‌టీని పట్టాలకు ఎక్కించిన ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ చట్టం వ్యతిరేకమైందనే చెప్పాలి. భాజపా పాలిత రాష్ట్రమైన హరియాణాలో కోటా చట్టం రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ చట్టం వలస కార్మికుల పాలిట పిడుగు! ఒకప్పుడు స్థానికులకే అవకాశాలు అంటూ రెచ్చిపోయిన శివసేన- తన చేష్టలతో ముంబయిలోని బహుళత్వ సంస్కృతిని ఎలా దెబ్బతీసిందో చూశాం! ఏడో దశకంలో మతుంగ, దాదర్‌లలో తమిళులపై వరస దాడులు జరిగాయి. 1980లలో శివసైనికులు ముంబయిలో ట్యాక్సీ నడుపుకొనే సిక్కు డ్రైవర్లపై విరుచుకుపడ్డారు. 1990లలో ముంబయిలో పొట్టపోసుకొంటున్న బిహారీలు, యూపీ వాసులపై దాడులు కొనసాగాయి. స్థానిక అస్తిత్వాల పేరిట జాతీయ భావనను బలిపెట్టే ధోరణులివి. దీనివల్ల పొట్టపోసుకోవడానికి ఏదైనా రాష్ట్రానికి వెళ్ళిన వలస కార్మికులను పరాయిదేశీయులుగా అనుమానంగా చూసే దుష్ట సంస్కృతి ప్రబలుతుంది. హరియాణా చట్టం అమలులోకి వస్తే- ఆర్థిక నష్టంతోపాటు సామాజిక సంక్షోభమూ కమ్ముకొంటుంది!