తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మొక్కుబడి సాయం... మోయలేని భారం - మసకబారుతున్న చేనేత కార్మికుల జీవితాలు

చేనేత పరిశ్రమ ప్రాభవం ఏళ్లు గడుస్తున్న కొద్దీ మరింత మసకబారుతోంది. ఎన్నో ప్రతికూలతలు, కరోనా వంటి విపత్తుల మధ్య జీవితాలు దుర్భరంగా మారి ఆ వృత్తినే నమ్ముకున్నవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. కొత్తతరం చేనేత రంగంలోకి అడుగు పెట్టడం లేదు. ఉత్పత్తులు, ఎగుమతుల్లో తిరోగమనం చోటు చేసుకుంది. మార్కెటింగ్‌ కష్టతరమవుతోంది. చేనేత రంగం క్రమేపీ మరమగ్గాల వైపు రూపాంతరం చెందుతోంది.

handloom industry
చేనేత పరిశ్రమ

By

Published : Aug 7, 2021, 6:42 AM IST

Updated : Aug 7, 2021, 2:31 PM IST

భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన చేనేత పరిశ్రమ ప్రాభవం ఏళ్లు గడుస్తున్న కొద్దీ మరింత మసకబారుతోంది. ఎన్నో ప్రతికూలతలు, కరోనా వంటి విపత్తుల మధ్య జీవితాలు దుర్భరంగా మారి ఆ వృత్తినే నమ్ముకున్నవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. కొత్తతరం చేనేత రంగంలోకి అడుగు పెట్టడం లేదు. ఉత్పత్తులు, ఎగుమతుల్లో తిరోగమనం చోటు చేసుకుంది. మార్కెటింగ్‌ కష్టతరమవుతోంది. చేనేత రంగం క్రమేపీ మరమగ్గాల వైపు రూపాంతరం చెందుతోంది. ఏది చేతితో నేసిందో, ఏది మిల్లు వస్త్రమో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం చేనేత సంరక్షణకు ఏమీ చేయలేక చేతులెత్తేస్తుండటం దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు మొక్కుబడిగా సాయం చేస్తున్నాయి. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న నేతన్నలు తమ పనికి జీవకళ తెచ్చే దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమయింది.

కదలని మగ్గాలు

చేనేత రంగంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన కష్టాలు తొలగిపోవడంలేదు. ఈ పరిశ్రమ ప్రస్తుతం కార్మికులకు కూడుపెట్టలేని స్థితికి చేరుతోంది. 2011లో దేశంలో చేనేత వృత్తిలో పనిచేసే వారు 45 లక్షల మంది. ఇప్పుడు వారి సంఖ్య 32 లక్షలకు చేరింది. మగ్గాల సంఖ్య 39 లక్షల నుంచి 23.77 లక్షలకు కుదించుకుపోయింది. భారత చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌ 2018-19లో రూ.2,500 కోట్లకు పైమాటే. 2019-20లో అది సుమారు 2,300 కోట్ల రూపాయలకు, 2020-21లో 1,631 కోట్ల రూపాయలకు తగ్గింది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు కేవలం రూ.170 కోట్ల విలువైన ఉత్పత్తుల విక్రయాలే జరిగాయి. ఎగుమతులపైనా ఈ ప్రభావం పడింది. మరోవైపు జౌళి ఉత్పత్తులు ఏటా గణనీయంగా పుంజుకొంటున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాడే వస్త్రాల్లో 15శాతమే చేనేత రంగానికి చెందినవి. ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్రాల ఉత్పత్తిలో భారత్‌ వాటా 95శాతం. మిగతా అయిదు శాతం నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక తదితర దేశాలది. ఈ రంగంలో పురుషుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. ప్రస్తుతం చేనేత పరిశ్రమలో ఉన్నవారిలో 77శాతం మహిళలే.

మగ్గం

చేతి కష్టంతో పనిచేసే నేతన్నలను ఆధునికత దిశగా మళ్ళించే ప్రయత్నాలు జరగడంలేదు. మరోవైపు జౌళి రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. సాంకేతికత పెంపు (టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌), నైపుణ్య శిక్షణ, డిజైన్‌లు అన్నీ జౌళికే పరిమితమవుతున్నాయి. చేనేత రంగంలో కొత్త మగ్గాలు పెద్దగా రావడం లేదు. ఆసు యంత్రాలు కొత్తగా వచ్చినా వాటి ఉత్పత్తి పెరగకపోవడం, చేనేత కార్మికులకు అందుబాటులోకి రాకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. దేశవ్యాప్తంగా 23 ఇ-కామర్స్‌ సంస్థల ద్వారా చేనేత ఉత్పత్తుల ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ జరుగుతున్నా గత మూడేళ్లలో వచ్చిన మొత్తం రూ.34.72 కోట్లు మాత్రమే. ప్రభుత్వపరంగా కొనుగోళ్లు తగ్గుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నూలు సబ్సిడీని 20శాతం నుంచి పదిశాతానికి కుదించింది. అదీ అందుబాటులో లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జౌళికే పెద్దపీట వేస్తున్నాయి. జౌళిరంగంకోసం 27 పథకాలు అమలవుతున్నాయి. చేనేతకు అమలయ్యే పథకాల సంఖ్య 12కు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ చేనేత అభివృద్ధి మండలిని రద్దు చేసింది. కేంద్రబడ్జెట్‌లో జౌళితో పోలిస్తే చేనేత వాటా తగ్గుతోంది. 2021-22 బడ్జెట్‌లో చేనేతకు కేటాయింపులు ఒక శాతం కంటే తక్కువే కావడం గమనార్హం. చేనేత పేరిట జౌళి వస్త్రాలకు పన్ను రాయితీలను వర్తింపజేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే 16 వేల మంది, ఏపీలో 29 వేల మంది కార్మికులు చేనేత నుంచి మరమగ్గాల రంగంలోకి మారారు.

కేంద్రం కేటాయింపులు

ఏం చేయాలి?

చేనేత పరిశ్రమను గట్టెక్కించేందుకు ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. తమిళనాడులో చేనేత, జౌళి పథకాలను, వస్త్రాలను మిళితం చేశారు. దీంతో ఎవరు ఏ విభాగంపై ఆధారపడి జీవించాలనుకుంటే అటువైపు మళ్ళే వెసులుబాటు లభించింది. తెలంగాణ ప్రభుత్వం సైతం చేనేత నుంచి జౌళి వైపు మళ్ళిన కార్మికుల కోసం సంక్షేమ పథకాలను వర్తింపజేస్తోంది. నేతన్నకు చేయూత పథకాన్ని చేనేతతో పాటు మరమగ్గాల కార్మికులకు వర్తింపజేసింది. త్వరలో చేనేత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేతన్నకు నేస్తం పథకం కింద ఒక్కో కార్మికుడి కుటుంబానికి ఏటా రూ.24 వేల గ్రాంటు ఇస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతో వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కావడం లేదు. చేనేత కార్మికుల పనులు సులువయ్యేందుకు యంత్రాల వాడకాన్ని ప్రోత్సహించాలా వద్దా అనే చర్చ నడుస్తోంది. దీనిపై అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చేనేత కార్మికులకు ఆర్థికసాయం కీలకం. వారికి ప్రత్యేక ప్యాకేజీలు, ముద్ర యోజన ద్వారా రుణసాయం అందించడం వంటి చర్యలు తీసుకోవాలి. చేనేతకు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల హోదా కల్పించి, రాయితీలు, ప్రోత్సాహకాలివ్వాలి. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతను ప్రోత్సహించడం ద్వారా వారికి ఉపాధితో పాటు కుటుంబాలకు ఆసరా దొరుకుతుంది. చేనేతకు సంపూర్ణ భరోసా కల్పిస్తేనే వారు నేత కళను కాపాడటానికి, నిశ్చింతగా జీవించడానికి అవకాశం ఉంటుంది. మూస పంథాలో కొనసాగితే వారి కష్టాలు తీరవని ప్రభుత్వాలు గుర్తించి, తగిన నిర్మాణాత్మక కార్యాచరణతో ముందుకురావాలి.

కాటు వేసిన కరోనా

కరోనా వైరస్‌ చేనేతకు మరణశాసనం లిఖించింది. ఇబ్బందుల్లో ఉన్న ఈ రంగాన్ని మరింత దెబ్బతీసింది. గత రెండేళ్లలో కార్మికుల్లో 60శాతం ఉపాధి కోల్పోయారు. మగ్గాలు నడవలేదు. క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఎక్కువ రోజులు వస్త్రాలను నిల్వచేయడం వల్ల పనికిరాకుండా పోయాయి. కరోనా కారణంగా దుస్తులు, దుప్పట్లు, చీర, ధోవతుల పథకాల అమలు ఆగిపోయింది. చేనేత కార్మికులు కరోనా సంక్షోభం నుంచి కోలుకునేందుకు కేంద్రం నుంచి సాయం అందలేదు. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ద్వారా చేనేతకు ఏ మాత్రం లబ్ధి చేకూరలేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. ప్రభుత్వరంగ సంస్థలైన ఆప్కో, టెస్కో దుకాణాలు మూతపడటంతో కొనుగోళ్లు ఆగిపోయాయి. పాఠశాలల మూసివేత దృష్ట్యా గురుకులాలు, పాఠశాలలకు ఏకరూప దుస్తుల పంపిణీ జరగలేదు.

- ఆకారపు మల్లేశం

Last Updated : Aug 7, 2021, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details