Hamas Secret Weapon : గాజాపై ఇజ్రాయెల్ భారీ భూతల దాడులకు సిద్ధమవుతున్న తరుణంలో.. హమాస్ కూడా ఆ దాడులను ధీటుగా ఎదుర్కోవడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ భూతల దాడులు చేస్తే.. సొరంగాలు నిర్మించడంలో తమకున్న నైపుణ్యాన్ని ఉపయోగించుకుని.. ప్రత్యర్థి దాడులకు చెక్ పెట్టాలనుకుంటోంది హమాస్. అందులో భాగంగా తమ వద్దనున్న 'రహస్య ఆయుధం'తో తమ కన్నా శక్తిమంతమైన ఇజ్రాయెల్‌తో భీకర పోరుకు వినూత్న విధానం అవలంభించబోతోందని సమాచారం. హమాస్ ప్రయోగించే ఆ రహస్య ఆయుధం గురించి 'ఈటీవీ భారత్'కు ప్రత్యేకంగా వివరించారు దిల్లీకి చెందిన మేధోమథన సంస్థ 'ఇమాగ్ఇండియా' (ImagIndia) అధ్యక్షుడు రాబిందర్ సచ్దేవ్.
హమాస్ రహస్య ఆయుధం..
గత దశాబ్ద కాలంగా సొరంగాలు ఉపయోగించుకుని.. ఇజ్రాయెల్ సేనలను చిరాకు పెట్టిస్తోంది హమాస్. గాజాలో తవ్విన సొరంగాలు నిజానికి.. ఇజ్రాయెల్ దిగ్భందనాన్ని అధిగమించడానికి, ఈజిప్టు నుంచి వస్తువులను అక్రమంగా తరలించేందుకు ఉపయోగించేవారు. ఆ తర్వాత హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్‌కు చెందిన మిలిటెంట్లు కొత్త సొరంగాలు తవ్వి.. అందులో ఇజ్రాయెల్ ఉపగ్రహాలు, విమానాలు గుర్తించకుండా రాకెట్లు, రాకెట్ లాంఛర్లను భద్రపరిచేవారు. వాటితో ఇజ్రాయెల్‌పై దాడికి దిగేవారు. ఇప్పుడు ఈ సొరంగాలను ఉపయోగించుకునే ఇజ్రాయెల్ దాడులకు ఎదుర్కునేందుకు హమాస్ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఒక బాంబును సముద్రంలోకి ప్రయోగిస్తారు. ఆ విస్ఫోటనం వల్ల వచ్చిన నీటితో వరదలు సృష్టించేలా వ్యూహం సిద్ధం చేసినట్లు దిల్లీకి చెందిన మేధోమథన సంస్థ 'ఇమాగ్ఇండియా (ImagIndia)' ఓ నివేదికలో పేర్కొంది.
సముద్ర వరద సృష్టించే సొరంగాలు..
'ఈ సముద్ర వరద ఎలా సృష్టిస్తారో తెలుసుకోవాలంటే.. ముందు గాజా భౌగోళిక స్వరూపంపై అవగాహన ఉండాలి. గాజా స్ట్రిప్.. మధ్యదరా సముద్రం తూర్పు తీరంలో ఉన్న ఓ ఇరుకైన భూభాగం. తూర్పు, ఉత్తరాన ఇజ్రాయెల్.. నైరుతి వైపు ఈజిప్ట్ సరిహద్దులుగా కలిగి ఉంది. దాదాపు 365 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉన్న గాజాలో.. దాదాపు 25 శాతం భూభాగం సముద్ర మట్టం కన్నా దిగువన ఉంటుంది. గాజాలో సముద్ర మట్టానికి దిగువన ఉన్న నాలుగు ప్రాంతాలలో.. మూడు ప్రాంతాలు ఉత్తర, మధ్య గాజాలో ఉన్నాయి. మరో ప్రాంతం దక్షిణాన గాజా- ఈజిప్టు మధ్య ఉన్న రాఫా క్రాసింగ్. హమాస్‌లో.. సాధారణంగా 50 అడుగుల లోతులో సొరంగాలు నిర్మించింది. అయితే ఈ వరద సృష్టించడానికి మాత్రం 3-4 అడుగుల లోతులో సొరంగాలు నిర్మించనుంది. వాటిని మధ్యదరా సముద్ర తీర ప్రాంతానికి అనుసంధానం చేస్తుంది. ఇజ్రాయెల్ ఆక్రమణకు వచ్చినప్పుడు.. సముద్రంలో బాంబుతో విస్ఫోటనం సృష్టిస్తుంది. అనంతరం సొరంగాల ద్వారా లోతట్టు ప్రాంతాల్లో వరద వచ్చేట్లు చేసి చిత్తడి నేలల్ని తయారు చేస్తుంది. ఫలితంగా ఇజ్రాయెల్ ట్రక్కులు, ట్యాంకులు ముందుకు వెళ్లడం అసాధ్యం అవుతుంది' అని రాబిందర్ సచ్దేవ్ 'ఈటీవీ భారత్'కు వివరించారు.