దేశ భద్రత, సార్వభౌమత్వంపై భారత రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ 'ఈటీవీ భారత్' ప్రత్యేక ఇంటర్వూ...
ప్ర. ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద యుద్ధ విమానాల తయారీ గురించి వివరించండి.
జ. భారతదేశం నాలుగో తరం యుద్ధ విమానం తేజస్‌ను తయారు చేస్తోంది. తక్కువ బరువుండే లఘు యుద్ధ విమానాల్లో తేజస్ ప్రపంచంలోనే మేటి అయినది. దీన్ని పూర్తిగా స్వదేశంలోనే రూపొందించి ఉత్పత్తి చేస్తున్నాం. ఫ్రాన్స్ నుంచి వస్తున్న రఫేల్ 4.5వ తరం యుద్ధ విమానం. దీనితోపాటు అయిదో తరం యుద్ధ విమానమైన అమ్కా (ఏఎంసీఏ) రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమంలో పురోగమిస్తున్నాం. ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద అత్యాధునిక విమానాలు, అన్ని రకాల అత్యుత్తమ ఆయుధాలను సొంతంగా తయారు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం.
ప్ర. ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్న రఫేల్ యుద్ధ విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) స్వదేశంలోనే తయారుచేయగలదా?
జ. హెచ్‌ఏఎల్‌కు ఆ సత్తా కచ్చితంగా ఉంది. యుద్ధ విమానాల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తులను ఒంటి చేత్తో చేపట్టగల పారిశ్రామిక శక్తిగా సంస్థ ఎదిగింది. ఆధునిక లఘు యుద్ధ విమానం తేజస్‌తో పాటు లఘు హెలికాప్టర్, లఘు పోరాట హెలికాప్టర్, సైనికుల రవాణా కోసం లఘు హెలికాప్టర్‌లను హెచ్‌ఏఎల్ తయారుచేస్తోంది. పైలట్ల తర్ఫీదుకు బేసిస్ జెట్ శిక్షణ విమానాన్నీ సొంతంగా తయారుచేస్తోంది. మధ్య తరహా శిక్షణ విమానాల రూపకల్పనను పూర్తిచేసుకుని ఉత్పత్తికి సన్నాహాలు చేస్తోంది. డార్నియర్ విమానాలను పూర్తిగా స్వదేశంలోనే తయారు చేయగలుగుతూ ప్రయాణికుల రవాణా రంగంలో అడుగిడనుంది.
ప్ర. భారతదేశం 101 రక్షణ పరికరాల దిగుమతిని నిషేధించింది. ఇకపై వీటిని ఆత్మనిర్భర్ పథకం కింద స్వదేశంలోనే తయారుచేస్తారా?
జ. ఇది మన ప్రభుత్వ రాజకీయ దృఢ సంకల్పాన్ని చాటిచెబుతున్న చరిత్రాత్మక నిర్ణయం. ఈ పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది లేదని తెలిసిన వెంటనే, స్వదేశీ పరిశ్రమలు వీటిని ఇక్కడే తయారుచేయడానికి దీర్ఘకాల ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతాయి. ఆత్మ నిర్భర్ భారత్ ధ్యేయమూ అదే.
ప్ర. గోవా షిప్ యార్డ్ నిర్మించిన సముద్ర గస్తీ నౌక (ఓపీవీ) సార్థక్ వల్ల మన సాగర భద్రత ఎలా ఇనుమడిస్తుంది ?
జ. ఈ గస్తీ నౌకను సముద్రంలో విస్తరించిన మన ప్రత్యేక ఆర్థిక మండలంలో భద్రతా విధుల్లో నియోగిస్తాం. భారత తీర రక్షక దళం (కోస్ట్‌గార్డ్)లో అంతర్భాగంగా పనిచేస్తూ ప్రత్యర్థులు, ఉగ్రవాదులు, సముద్ర దొంగల పని పడుతుంది. సముద్రంలో విపత్తులో చిక్కుకున్న నౌకల నుంచి సహాయం కోసం వచ్చే పిలుపులకు సత్వరం స్పందించి ఆదుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన భారత్‌లో తయారీ (మేకిన్ ఇండియా) పథకం కింద నిర్మిస్తున్న అయిదు ఓపీవీలలో సార్థక్ నాలుగోది. కొవిడ్ విజృంభణకూ వెరవకుండా గోవా షిప్ యార్డ్ ఈ ఘనత సాధించింది. మేకిన్ ఇండియా కింద ఈ అయిదు ఓవీవీలకు తోడు దేశంలోని వివిధ షిప్ యార్డుల్లో మొత్తం 52 యుద్ధ నౌకలు తయారవుతున్నాయి.
ప్ర. మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్‌ల కింద రక్షణ రంగంలో సాధిస్తున్న పురోగతిని వివరిస్తారా?
జ. మేకిన్ ఇండియా కింద ప్రభుత్వ రంగ రక్షణ పరిశ్రమలకు అండదండలు కొనసాగిస్తూనే, ప్రైవేటు భాగస్వామ్యాన్నీ ప్రోత్సహిస్తున్నాం. విదేశీ సంస్థల నుంచి తెచ్చుకున్న లైసెన్సులపై ఇక్కడ ఆయుధాలు తయారుచేయడానికే పరిమితమైపోకుండా సొంత సాంకేతికతతో ముఖ్యమైన ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్నాం. ఆయుధాల తయారీ కోసం భారతీయ ప్రైవేటు సంస్థలకు 460 లైసెన్సులు ఇచ్చాం. రక్షణ సరఫరా గొలుసులో నేడు 8,000 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పాలుపంచుకొంటున్నాయి. నిరుడు మే నెలలో రక్షణ శాఖ 101 పరికరాల దిగుమతిని నిషేధించడం, మన పరిశ్రమలకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టింది. నిషిద్ధ వస్తువుల్లో కేవలం విడిభాగాలే కాకుండా శతఘ్నులు, ఎసాల్ట్ రైఫిళ్లు, రవాణా విమానాలు, లఘు హెలికాప్టర్లు, కోర్వెట్ నౌకలు, సోనార్ల వంటి ఆధునిక ఆయుధ వ్యవస్థలూ ఉన్నాయి. రూ.200 కోట్లకు మించిన విలువ గల ఆయుధ వ్యవస్థల కోసం అంతర్జాతీయ టెండర్లను పిలవడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. ఈ నిర్ణయాలు స్వదేశీ పరిశ్రమలకు వరంలా పరిణమిస్తాయి. రక్షణ సామగ్రి సేకరణ విధానం ఇకనుంచి భారతీయ సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్, పరికరాలనే వాడాలని నిర్దేశిస్తోంది. ఇది మనకు సైబర్ భద్రతనూ అందిస్తుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) 108 ఆయుధ వ్యవస్థలు, ఉప వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి బాధ్యతను ప్రైవేటు పరిశ్రమలకు అప్పగించింది. సరికొత్త రక్షణ పరిజ్ఞానాల అభివృద్ధికి 35 ఏళ్ల లోపు శాస్త్రజ్ఞులతో డీఆర్డీఓ ప్రయోగశాలలను ఏర్పాటు చేసింది. రక్షణ రంగంలో ఉత్కృష్ట నవీకరణల సాధన పథకం (ఐడెక్స్) కింద 50 అంకుర పరిశ్రమలు సైన్యానికి ఉపయోగకరమైన సాంకేతికతలను, పరికరాలను రూపొందిస్తున్నాయి.
ప్ర: కొవిడ్ కష్ట కాలంలో డీఆర్డీఓ నిర్వహించిన విశిష్ట పాత్ర గురించి వివరించండి?
జ. సాంకేతికతలు, సాధనాలు, టెస్టింగ్ విభాగాల్లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అవిరళ సేవలు అందించింది. కొవిడ్ కట్టడికి దాదాపు 130 సాధనాలను, సాంకేతికతలను రూపొందించింది. తన పరిజ్ఞానాలను పరిశ్రమలకు బదిలీ చేసింది. కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అల్ట్రావయొలిట్ కిరణాలతో వైరస్‌ను సంహరించే టవర్లను డీఆర్డీఓ గత మే నెలలో ప్రవేశపెట్టింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కొవిడ్ ఆస్పత్రిలో కేవలం 12 రోజుల్లోనే 1000 పడకలను ఏర్పాటు చేసింది. అందులో 250 ఐసీయూ పడకలే. కొవిడ్ టెస్టింగ్ కోసం సింథటిక్ బ్లడ్ పెనిట్రేషన్ రెసిస్టెన్స్ పరీక్షను రూపొందించింది. వెంటిలేటర్ల తయారీ పరిజ్ఞానాన్ని భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు బదిలీ చేసింది. పీపీఈ కిట్లు, శానిటైజర్ల తయారీని ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ బోర్డు చేపట్టగా- కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, కంటైన్‌మెంట్ జోన్లపై నిఘాకు డ్రోన్ల వాడకంలో డీఆర్డీఓ చురుకైన పాత్ర పోషిస్తోంది. పరారుణ కిరణాలతో లక్ష్యఛేదన సాంకేతికతను జన సమూహాల్లో జ్వరసంబంధ ఉష్ణోగ్రతలను పసిగట్టడానికి ఉపయోగిస్తున్నారు. డీఆర్డీఓతోపాటు వివిధ ప్రభుత్వ రక్షణ రంగ పరిశ్రమలూ కొవిడ్‌పై పోరులో చురుగ్గా పాలుపంచుకొంటున్నాయి.
ఇదీ చదవండి:దిల్లీలో 21 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం