'కుల మతాలు గీచుకున్న గీతల చొచ్చి
పంజరాన కట్టు పడను నేను
నిఖిలలోకమెట్లు నిర్ణయించిన, నాకు
తిరుగులేదు విశ్వనరుడ నేను'
కవిత్వం ఆయన గుండె లోతుల్లోంచి పెల్లుబికి వచ్చి తరతరాల దుఃఖాన్ని, కన్నీటిగాథను వెల్లడిస్తుంది. ఒకవంక దరిద్రం, మరోవంక అస్పృశ్యత వెక్కిరిస్తుంటే- వెరవక ధైర్యంతో మట్టిపొరలను చీల్చి సాహితీక్షేత్రంలో పసిడి పండించిన కృషీవలుడాయన. మాతృభూమికను మరవని విశ్వమానవ దృష్టి, సంప్రదాయ సంస్కారం వదలని ఆధునిక దృక్పథం, ఆస్తికత్వాన్ని తిరస్కరించని హేతువాదం, ద్వేషపూరితం కాని ధర్మాగ్రహం- వెరసి... నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా. భావకవితా ప్రభంజనం వీస్తున్న గత శతాబ్ది పూర్వభాగంలో కలం పట్టిన జాషువా అభ్యుదయ కవిత్వయుగంలో అంచులు ముట్టిన కవి. ఆయన ఏ వాదాలు, ఉద్యమాల ఉరవడిలోను, అనుకరణ ప్రాయమైన కవితా స్రవంతిలోను కొట్టుకుపోకుండా స్వతంత్రమైన తన ప్రత్యేకత నిలబెట్టుకున్నారు. జాషువా పద్యకవి. రూపంలో ప్రాచీనత, వస్తువులో ఆధునికత పాటించారాయన.
జాషువా 1895 సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. తల్లిదండ్రులు లింగమ్మ, వీరయ్యలది వర్ణాంతర వివాహమైనా, ఇద్దరూ క్రైస్తవులే. తెలుగుభాష మీద మక్కువతో పురాణేతిహాసాలు చదువుతుంటే స్వమతస్థులు ఛీత్కరించుకున్నారు. కొప్పరవు కవుల అవధానంలో తాను రాసిన అభినందన పద్యాలను వేదిక మీద వినిపించాలని ప్రయత్నిస్తే నిమ్నకులం వాడికి సభలో ప్రవేశార్హత లేదని అన్య వర్ణాలవారు తృణీకరించారు. ఈ పరిస్థితుల్లో పాడుబడ్డ మసీదే పాఠశాలగా, గుడ్డిదీపమే గురువుగా చదువుకున్నాడు.
'నా గురువులు ఇద్దరు- పేదరికం, కుల మత భేదాలు. ఒకటి సహనాన్ని నేర్పితే, రెండోది ఎదిరించే శక్తిని పెంచిందిగాని బానిసగా మార్చలేదు. దారిద్య్రాన్ని, కులభేదాన్ని చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలచాను. వాటిపై కత్తికట్టాను. అయితే నా కత్తి కవిత. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపై ద్వేషం' అంటారు జాషువా. పొట్టకూటి కోసం ఎన్నో ఉద్యోగాలు చేశారు. బడిపంతులుగా, రెండో ప్రపంచయుద్ధ ప్రచారకుడిగా, టూరింగ్ సినిమాల్లో మూకీ సినిమాలకు కథావాచకుడిగా పనిచేశారు. అద్దెకు, ముద్దకు సరిపోక నానా కష్టాలు పడ్డారు. మద్రాసు ఆకాశవాణి తెలుగు విభాగంలో స్పోకెన్‌వర్డ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.