తెలంగాణ

telangana

ETV Bharat / opinion

రాజకీయ పునరేకీకరణ.. కశ్మీర్‌లో 'గుప్కార్‌ కూటమి' - కశ్మీర్‌లో గుప్కార్‌ కూటమి

జమ్మూకశ్మీర్​లో వేర్పాటువాదం, దేశ అనుకూల రాజకీయవాదం మధ్య విభజనరేఖలు చెరిగిపోయి.. 'గుప్కార్​ గ్యాంగ్'​ తెర మీదకొచ్చింది. ప్రధాన ప్రాంతీయ రాజకీయ సమూహాలన్నీ ఈ కూటమిలో చేరాయి. భారత పార్లమెంట్​ గతేడాది చేసిన 370 అధికరణ రద్దుకు వ్యతిరేకిస్తూ.. ఓ గొడుగు కిందకు వచ్చాయి. విశేషమేంటంటే.. ఈ కూటమిలో చేరిన పార్టీలన్నీ ఒకప్పటి జమ్మూకశ్మీర్​ విధానసభకు విడిగా పోటీచేసి.. సంకీర్ణ ప్రభుత్వాలు నడిపేందుకు ఎన్డీయేలో చేరినవే.

Gupkar Alliance
రాజకీయ పునరేకీకరణ

By

Published : Nov 21, 2020, 6:27 AM IST

జమ్మూకశ్మీర్​లో వేర్పాటువాదం, భారత అనుకూల రాజకీయ వాదం నడుమ విభజన రేఖలు చెరిగిపోయాయి. వీటికి జనం మనోభావాలు కూడా తోడై... భాజపా భాషలో చెప్పాలంటే- 'గుప్కార్‌ గ్యాంగ్‌' పేరిట తెర మీదికొచ్చాయి. ప్రధాన ప్రాంతీయ రాజకీయ గ్రూపులన్నీ కలిసి కూటమి కట్టాయి. భారత పార్లమెంటు 2019 ఆగస్టు అయిదోతేదీన చేసిన 370వ అధికరణ రద్దును వ్యతిరేకిస్తూ- పీపుల్స్‌ అలయన్స్‌ ఆఫ్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ) పేరిట ఒక గొడుగు కిందకు చేరాయి.

మొన్న మిత్రులు... నేడు ప్రత్యర్థులు

గుప్కార్‌ కూటమిలోని ప్రధాన పాత్రదారులు ఒకరి తరవాత మరొకరుగా లోగడ భాజపాతో అంటకాగినవారే. ఒకప్పటి జమ్మూకశ్మీర్‌ విధానసభకు విడివిడిగా పోటీ చేసిన పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాలు నడిపేందుకు ఎన్డీయే తీర్థం పుచ్చుకొన్నవే. వాజ్‌పేయీ హయాములో ఇలా భాజపా పంచన చేరి ఎన్డీయే భాగస్వామిగా మారిన అక్కడి తొలి రాజకీయ పక్షం అబ్దుల్లా ‘నేషనల్‌ కాన్ఫరెన్స్‌’ పార్టీ. అనంతరం, మోదీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరో ప్రాంతీయ పార్టీ(పీడీపీ)కి అధినేత్రి ముఫ్తీ. ఒకరినొకరు ఓడించుకోవడానికి అటు ఎన్‌సీ ఇటు పీడీపీ రెండూ భాజపా మద్దతు తీసుకున్నాయి. ఇప్పుడివే పార్టీలు జమ్మూకశ్మీరులో తమ ఉనికిని కాపాడుకునేందుకు అదే భాజపాపై కూటమి కట్టాయి. కశ్మీరు లోయలోని పది జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క స్థానం లేనప్పటికీ, ‘గుప్కార్‌ గ్యాంగ్‌’ భాగస్వాముల ఊతంతో భాజపా ఈ ప్రాంతంలో వేరూనుకుని, జమ్మూకశ్మీరు రాష్ట్ర విధానసభలో పట్టు చిక్కించుకోగలిగింది.

రాజకీయ పునరేకీకరణ

జమ్మూకశ్మీరుకు ప్రత్యేక హోదా తొలగించిన తరవాతా భాజపా అక్కడ ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదు. అంతా సాఫీగానే నడిచింది. భాజపా ‘నిశ్శబ్ద కార్యశూరుడై’న గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అదుపాజ్ఞల్లో సర్వం సానుకూలంగా సాగింది. స్తంభించిన రాజకీయ ప్రక్రియను సిన్హా తిరిగి పట్టాలకెక్కించాల్సిన తరుణంలో- మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. ఈ ప్రాంతంలో రాజకీయ కార్యకలాపాల పునరుద్ధరణే సిన్హాను గవర్నరుగా నియమించడంలోని ముఖ్య ఉద్దేశం. ఒమర్‌, ఆయన తండ్రి ఫారుఖ్‌ అబ్దుల్లాల విడుదల తరవాత ప్రజల్లో పెద్దగా మార్పు రాలేదు. 4జీ సమాచార వ్యవస్థ పునరుద్ధరణ వంటి డిమాండ్లు తప్ప వారేమీ పెద్దగా మాట్లాడిందీ లేదు. అబ్దుల్లాలను అదుపు చేయడంలో మనోజ్‌ సిన్హా ప్రదర్శించిన దక్షతను చూసిన దిల్లీ పెద్దలు మరింత నిబ్బరపడ్డారు. కొత్తగా ఏర్పడిన జెఅండ్‌కె కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి వారు కీలకమైన రాజ్యాంగ సవరణలూ చేపట్టారు. అమిత్‌ షా, జితేంద్ర సింగ్‌ల నుంచి సంబిత్‌ పాత్రా వరకు భాజపా నేతలు ఉలికిపాటుతో గుప్కార్‌ అలయన్స్‌కు వ్యతిరేకంగా శరపరంపరగా ప్రకటనలు గుప్పించారు. అందుకు వారిని పురిగొల్పిన అంశం ఏమిటి? వారి పార్టీ లెక్కలు ఎలా తప్పిపోయాయి? ఈ అంశాలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అందుకే ఎన్నికలు..

భాజపా రాజకీయ విఘాతానికి మూలాలు... జైలు నుంచి విడుదలై వచ్చి మెహబూబా ముఫ్తీ చేసిన ప్రకటనలో ఉన్నాయి. తాను ఎన్నికల్లో పాల్గొనబోనని, 370వ అధికరణ పునరుద్ధరించే వరకు ఎలాంటి జెండా (అంటే త్రివర్ణ పతాకం) ఎగరేసేది లేదని మెహబూబా కుండ బద్దలు కొట్టారు. బహుశా, ఈ ప్రకటనే జమ్మూకశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతం అంతటా క్షేత్రస్థాయి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్డీయేను పురిగొల్పినట్లుంది. ప్రాంతీయ పార్టీలు ఎన్నికల రణానికి దూరంగా ఉండిపోతాయని, గ్రామస్థాయిలో తమకు అప్పనంగా అధికారం అప్పగిస్తాయని భాజపా అనుకుని ఉండవచ్చు. డీడీసీలు (డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిళ్లు) కేంద్రపాలిత ప్రాంత విధానసభ అధికారాన్ని నీరుగార్చేవిధంగా అప్పటికే ఒక సవరణ సైతం తీసుకువచ్చాయి. ఎన్‌సీ, పీడీపీల పరిధి పరిమితం అవుతుందని అంచనా వేసుకున్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, కేంద్రపాలిత ప్రాంతం అంతటా అట్టడుగు స్థాయిలో తాము తిరుగులేని విధంగా ప్రాంతీయ పార్టీల కంటే బలపడతామని అనుకున్నారు.

ఆసక్తి రేపుతున్న పరిణామాలు

సరిగ్గా ఇక్కడే కథ అడ్డం తిరిగింది. గుప్కార్‌ కూటమి మెరుపులా పావులు కదిపింది. తాము ఉమ్మడిగా భాజపాపై పోటీ చేస్తామని ప్రకటించి భాజపా నేతలకు షాకిచ్చింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. చూస్తుండగానే గుప్కార్‌ కూటమి జమ్మూకశ్మీరు రాజకీయ క్షేత్రం అంతటినీ ఆక్రమించింది. అది ప్రధాన స్రవంతి కావచ్చు, వేర్పాటువాదం లేదా జన మనోభావాలను ఆకట్టుకునే ఇతర వాదాలు కావచ్చు. కూటమి ఇప్పుడు అందరిదీ అయింది. చివరికి కశ్మీరు లోయలో హురియత్‌ రాజకీయ క్షేత్రం సైతం దానిదే అయింది. కరడుగట్టిన వేర్పాటువాది, హురియత్‌ వర్గాల్లో ఒకదానికి అధిపతి అయిన మస్రత్‌ ఆలమ్‌ భట్‌ విడుదల ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. భట్‌ విడుదలతో భాజపా ప్రయోజనం పొందుతుందా? అతడి విడుదల నుంచి లబ్ధి పొందడానికి అది రచిస్తున్న వ్యూహం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరమైన విషయం.

గుప్కార్‌ అలయన్స్‌ అజెండా నుంచి జనాల్ని పక్కకు తప్పించడానికి భట్‌ విడుదల ఒక ఎరగా ఉపయోగపడుతుందని భాజపా భావించినట్లు చర్చ జరుగుతోంది. గుప్కార్‌ గ్రూపుతో చేతులు కలిపి దేశద్రోహానికి ఒడిగట్టిందంటూ భాజపా చేపట్టిన ప్రచారానికి ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం... చివరికి అలయన్స్‌కు గుడ్‌బై చెప్పి చేతులు దులిపేసుకుంది. జమ్మూకశ్మీరు ప్రాంతీయ పార్టీలు మాత్రం ఈ పరిణామంతో తమకు పోయిందేమీ లేదనుకుంటున్నాయి.

- బిలాల్‌ భట్‌, రచయిత

ఇదీ చదవండి:అమిత్‌జీ.. మీది ఏ గ్యాంగ్‌ మరి?: సిబల్​

ABOUT THE AUTHOR

...view details