గుజరాత్ ఎన్నికల్లో భాజపా చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. గత రికార్డులను చెరిపివేస్తూ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కాషాయదళం దూకుడుగా నిర్వహించిన ప్రచారాల కారణంగానే ఈ విజయం సాధ్యమైంది. ప్రజలకు మోదీ వ్యక్తిగతంగా అభ్యర్థించడం గుజరాత్లో ఫలితాన్నిచ్చింది. పోలైన ఓట్లలో సగానికిపైగా మోదీ పార్టీకే పడ్డాయి. విపక్షం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. మిగిలిన పార్టీలకు అత్తెసరు సీట్లు వచ్చినందున అసెంబ్లీలో భాజపా తీసుకునే నిర్ణయాలకు అడ్డు ఉండకపోవచ్చు. దళితుల అంశమైనా.. బిల్కిస్ బానో కేసు విషయమైనా.. ప్రభుత్వానికి అడ్డు చెప్పేవారెవరూ ఉండరు.
పిల్లి, పిల్లి కొట్టుకొని కోతికి రొట్టెముక్క ఇచ్చినట్టు.. విపక్షాలు.. ఒకరి ఓట్లను ఒకరు చీల్చుకొని అందరూ మునిగిపోయారు. 182 అసెంబ్లీ స్థానాల్లో.. అధికార భాజపా అందులో ఏ ఒక్క స్థానంలో ముస్లింలను బరిలోకి దింపలేదు. హిందుత్వ ఓట్లు దూరమైతాయని ఎవరినీ బరిలోకి దింపలేదు. అయినా గెలుపొంది.. తమ రాజకీయ చతురతకు తిరిగులేదని నిరూపించింది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ఓటు బ్యాంకును మజ్లిస్, ఆప్ కొల్లగొట్టాయి. దీంతో ఎన్నికల్లో హస్తం పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు.
సర్వం మోదీయే..
సూరత్ మున్సిపాలిటీలో ఆప్ బలపడటం చూసి వెంటనే భాజపా అప్రమత్తమైంది. తమ అధికారానికి ఢోకా లేకుండా చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. ఏడాది కాలంగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లింది. మోదీనే ముందుండి రాష్ట్రంలో ప్రచారాన్ని నడిపించారు. "ఈ గుజరాత్‌ను నేనే తీర్చిదిద్దాను" అంటూ మోదీ తన ఎన్నికల ప్రచారాన్ని సాగించారు.
"భాజపా అభ్యర్థి ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కమలం పువ్వును మాత్రం మదిలో నిలుపుకోండి. మీరు ఓటు వేస్తున్నప్పుడు కమలం పువ్వు కనిపిస్తే, అది భాజపా అనీ, మీ దగ్గరికి వచ్చిన మోదీ అని అర్థం చేసుకోండి. కమలం గుర్తుకు వేసిన ప్రతి ఓటూ మీరిచ్చే ఆశీర్వాదంలా నేరుగా మోదీ ఖాతాలోనే పడుతుంది" అంటూ ప్రధాని ఓటర్లకు విన్నవించారు. పోలింగ్‌కు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలంటూ మోదీ ప్రతి ఎన్నికల సభలోనూ చెప్పారు. పార్టీ కార్యకర్తలు సైతం ఇదే తరహాలో ప్రచారం చేశారు. పార్టీ ఏం చేసిందనే విషయాన్ని పక్కనబెట్టి.. గుజరాత్ సొంత బిడ్డను గెలిపించుకోవాలని మోదీ కేంద్రంగా ప్రచారం సాగించారు.