ప్రభుత్వ విధానాలకు జనశ్రేయమే కేంద్రబిందువు కావాలన్నది ప్రధాని మోదీ నిర్దేశించుకొన్న పది సుపరిపాలన సూత్రాల్లో కీలకమైనది. శతాబ్ది సంక్షోభంగా పరిణమించి జాతి జవజీవాలను కృశింపజేస్తున్న కొవిడ్ కల్లోలంలో ఈ ఆదర్శమే కొడిగట్టిపోతోంది! కరోనాపై పోరులో కీలకమైన ఔషధాల మీద సుంకాల తొలగింపు జనహితానికి తోడ్పడదన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు విస్మయపరుస్తున్నాయి. కొవిడ్ టీకాలు, ప్రాణాధార ఔషధాలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మినహాయించాలంటూ పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇటీవల ప్రధానిని అభ్యర్థించారు. ఆమెకు ఆగమేఘాలపై జవాబిస్తూ, పన్నులను మినహాయిస్తే ధరలు పెరుగుతాయే తప్ప తరగవని నిర్మల సెలవిచ్చారు! వాటిని జీఎస్టీ పరిధిలోంచి తప్పిస్తే ముడిపదార్థాల సమీకరణపై చెల్లించిన సుంకాలను రాబట్టుకోలేక, తయారీదారులు ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచే పిండుకోవడానికి ప్రయత్నిస్తారని, దానితో ప్రజలపై భారం ఇంతలంతలవుతుందని మంత్రి సూత్రీకరించారు.
కనికరం లేని కేంద్రం..
కరోనా కరాళనృత్యంతో కుటుంబాలకు కుటుంబాలే కకావికలమవుతున్న వేళ గండాన్ని గట్టెక్కించే వ్యాక్సిన్లు, మందులు తదితరాలపై పన్నుల రూపేణా ఆదాయాన్ని ఆశించడం సబబు కాదని పంజాబ్, ఛత్తీస్గఢ్, దిల్లీ తదితర ప్రభుత్వాలు కొన్నాళ్లుగా మొత్తుకుంటున్నాయి. జీఎస్టీ మండలిని సత్వరం కొలువుతీర్చి దీనిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర సర్కారు చెవినిల్లు కట్టుకొని పోరుతున్నాయి. జీఎస్టీ మండలి సిఫార్సుల మేరకు ప్రజాప్రయోజనాల దృష్ట్యా వేటికైనా పన్ను మినహాయింపులు ఇవ్వగల వీలుందని వస్తుసేవల చట్టంలోని సెక్షన్ 11(1) విశదీకరిస్తోంది. మాయదారి మహమ్మారి కరకుదెబ్బలకు ఆసేతుహిమాచలం కంపించిపోతున్నప్పుడు ప్రజలకు కాస్త ఊరట కలిగించే ఈ నిబంధనను కేంద్రం విస్మరించడమేమిటి? తయారీదారులకు నష్టం కలిగించకుండానే సామాన్యులకు సాంత్వన చేకూర్చడానికి మార్గాలున్నా, వాటిని గుర్తించడానికి సైతం కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం నివ్వెరపరుస్తోంది!