అసోంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రాంతీయ పార్టీల ప్రభావం గణనీయంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బలం పుంజుకున్న ప్రాంతీయ శక్తులు.. అధికార భాజపా, కాంగ్రెస్‌కు కొత్త సవాళ్లు విసుతున్నట్లు కనిపిస్తోంది.
రాష్ట్రంలోని ప్రధాన విద్యార్థి సంఘాలైన ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్(ఆసు), అసోం జాతీయతావాది యువ ఛాత్ర పరిషత్(ఏజేవైసీపీ) కలిసి అసోం జాతీయ పరిషత్(ఏజేపీ) అనే రాజకీయ పార్టీకి పురుడుపోశాయి. మరోవైపు, ఆర్టీఐ కార్యకర్త, కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎంఎస్ఎస్) అధినేత అఖిల్ గొగొయి స్థాపించిన 'రైజర్ దళ్' సైతం రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ విద్యార్థి సంఘాలకు రాష్ట్రంలో గట్టి పట్టు ఉంది. ఇవి ఏకమై రాజకీయ పార్టీని స్థాపించడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది.
మరోవైపు, ప్రాంతీయ శక్తులన్నింటినీ ఏకం చేయాలని రాజ్యసభ ఎంపీ అజిత్ భుయాన్ ప్రయత్నాలు చేస్తున్నారు. భాజపాను ఎన్నికల్లో దెబ్బకొట్టేందుకు కసరత్తులు ముమ్మరం చేశారు.
100 సీట్లకు ఎసరు!
రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకుంటామని పదేపదే చెబుతోంది. అయితే మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో అధికారం చేపట్టాలంటే భాజపా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అసోంలోని ఎగువన ఉన్న ప్రాంతాల్లో ఈ తీవ్రత మరీ అధికంగా ఉంది. ఈ కారణంగా సీనియర్ భాజపా నేతలు, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు కాషాయ పార్టీకి వీడ్కోలు చెప్పారు. ఏజేపీ, రైజర్ దళ్‌లోకి వెళ్తున్నారు.
లక్ష్యం.. సీఏఏ రద్దు
'ఆసు' మాజీ ప్రధాన కార్యదర్శి లురిన్జ్యోతి గొగొయి అసోం జాతీయ పరిషత్‌కు నేతృత్వం వహిస్తున్నారు. అసోంలో ఆయనకు ఫైర్‌బ్రాండ్‌గా పేరుంది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతను ఇప్పటికే ప్రారంభించారు లురిన్. సీఏఏ నిరసనలు జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పౌరసత్వ సవరణ చట్టం రద్దే లక్ష్యంగా బరిలోకి దిగిన ఏజేపీ.. అసోం ఎన్నికలపై గణనీయ ప్రభావం చూపనుంది. ఓటర్లను తనవైపు లాక్కునే సత్తా ఈ పార్టీకి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఏజేపీ, రైజర్ దళ్ మధ్య పొత్తు కుదురుతుందన్న ఊహాగానాలు వీరిపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.