తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మాదక మహోత్పాతం.. మత్తులో చిత్తవుతున్న దేశం! - దేశంలో మాదకద్రవ్యాల వినియోగం తగ్గేదెలా?

మనుషులను మత్తుకు బానిసలుగా మార్చే మాదకద్రవ్యాలతో దేశం చిత్తవుతోంది. దేశంలో యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న డ్రగ్‌ మాఫియా నెట్‌వర్క్‌ అంతర్గత భద్రతకే ప్రమాదకరంగా పరిణమించింది. విస్తరిస్తున్న పార్టీ కల్చర్​తో యథేచ్చగా సాగుతున్న దందాకు అడ్డుకట్ట.. మత్తుకు బానిసలైన వారికోసం పునరావాస కేంద్రాల ఏర్పాటుతోనే 'నిషా ముక్త్‌ భారత్‌' సాక్షాత్కారం అవుతుంది.

drug addiction
మత్తుకు బానిస

By

Published : Oct 19, 2021, 5:57 AM IST

యువతకు ఎరవేసి చాపకింద నీరులా విస్తరిస్తూ అసంఖ్యాక తల్లిదండ్రుల ఆకాంక్షల్ని, దేశ భవితవ్యాన్నే కసిగా కాటేస్తున్న మహా కాలసర్పం వంటిది- మత్తు రక్కసి. కైపులో ముంచెత్తి అంతిమంగా జీవితాలనే కబళిస్తున్న మాదకద్రవ్యాలు దేశం నలుమూలలా చిలవలు పలవలు వేసుకుపోతున్న తీరు నిఘా యంత్రాంగం అసమర్థతనే చాటుతోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ కార్యాలయ నివేదిక లోగడ స్పష్టీకరించినట్లు- 'ఎక్కడైనా మాదకద్రవ్యాలు పట్టుబడితే అక్కడ వాటి ఉరవడి ఉద్ధృతంగా ఉన్నట్లు'. సుమారు నాలుగు వారాల వ్యవధిలోనే హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబై, దిల్లీ విమానాశ్రయాల్లో రూ.400కోట్లు విలువచేసే హెరాయిన్‌ చేజిక్కిందని డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌) నాలుగు నెలలక్రితం లెక్కచెప్పింది. ఇటీవల గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయంలో విజయవాడ చిరునామాతో ఎకాయెకి రూ.21వేల కోట్ల సరకు పట్టుబడటంతో, పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి!

తెలుగు చిత్రపరిశ్రమకు, బాలీవుడ్‌కు సైతం మత్తు మకిలంటిందని విచారణ ఘట్టాలు చాటుతున్నాయి. డ్రోన్ల సాయంతో దేశంలోకి డ్రగ్స్‌ సరఫరా ఉదంతాలు, విదేశాలనుంచి కొరియర్ల ద్వారా పంపిణీ ఘటనలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. మెట్రో నగరాల నుంచి ద్వితీయ శ్రేణి పట్టణాలు, మారుమూల ప్రాంతాల వరకు కోరిన చోటికల్లా డ్రగ్స్‌ సరఫరా 'నిక్షేపంగా' వర్ధిల్లుతోంది. కొన్నాళ్లుగా వాడకం జోరెత్తిన గంజాయి కిలోల లెక్కన తనిఖీల్లో పట్టుబడటంపై తెలంగాణ పోలీసులు కూపీ లాగితే- మూలాలు విశాఖ ఏజెన్సీలో బయటపడ్డాయి. మన్యంలోని 15 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి అంతర్జాతీయ విపణిలో రూ.25వేలకోట్లకు పైగానే విలువ చేస్తుందన్న లెక్కలు, సరకు తరలింపులో తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర మత్తు ముఠాల కీలక పాత్ర, ఆరా తీయబోతే పోలీసులపైనా దాడులు.. లోతుగా వేళ్లూనుకున్న అవ్యవస్థను కళ్లకు కడుతున్నాయి.

దేశంలో ఎక్కడ ఏ మూల గంజాయి పట్టుబడినా ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏఓబీ) పేరే మార్మోగుతోంది. ఇరుగు పొరుగు మొదలు ఈశాన్య భారతం వరకు సగానికిపైగా రాష్ట్రాలకు అక్కడినుంచే గంజాయి సరఫరా అవుతున్నట్లు విశ్లేషణలు తేటపరుస్తున్నాయి. గతంలో గూడ్స్‌ వాహనంలో అరటి గెలల మాటున, కట్టెల ట్రక్కుల్లో, ఆంబులెన్సుల్లో వందల కిలోల గంజాయిని తరలించిన ముఠాలు కొన్నాళ్లుగా పద్ధతి మార్చేశాయి.

కొన్ని రసాయనాలు కలిపి గంజాయి ఆకుల్ని ఉడికించి ద్రవరూపంలోకి మార్చడం ద్వారా విదేశాలకూ తేలిగ్గా తరలిస్తున్న మాదకశక్తులు, పొడి పంట కంటే 20-30 రెట్లు అధికంగా సొమ్మును ఆర్జిస్తున్నాయి. పెరుగుతున్న గిరాకీనుంచి ప్రయోజనాలు పిండుకునే క్రమంలో ఎఫిడ్రిన్‌ లాంటి నిషేధిత డ్రగ్స్‌ను ఇళ్లలోనే తయారు చేస్తున్న ఘటనలు, అపార్ట్‌మెంట్లలో పెద్దగా జనసంచారం లేని భవంతుల్లో గంజాయిని పండిస్తున్న ఉదంతాలు.. తమను ఎవరూ ఏమీ చేయలేరన్న మాదకశక్తుల దిలాసాను ప్రస్ఫుటీకరిస్తున్నాయి!

కంబోడియా, వియత్నాం, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ ప్రభృతదేశాలు- డ్రగ్స్‌ను వాడినా, ఉత్పత్తికి పాల్పడినా, నిల్వచేసినా, వ్యాపారానికి తెగబడినా మరణశిక్ష అమలుపరుస్తున్నాయి. దేశీయంగా స్వల్పశిక్షలు, వాటినుంచీ తప్పించుకోవడానికి వీలుకల్పిస్తున్న కంతలు.. మాదకాసురులకు కోరలు, కొమ్ములు మొలిపిస్తున్నాయి. ఒకర్ని అంతమొందిస్తే మరణదండన విధించే భారత్‌లో అపార యువశక్తిని వ్యసనానికి బలిచేస్తున్న కర్కోటక సంతతిని ఇలా ఉపేక్షించడమేమిటి? మాఫియా కూసాలను కదలబార్చే పటుతర కార్యాచరణ, మత్తుకు బానిసలైన వారికి స్వస్థత చేకూర్చే పునరావాస కేంద్రాల అవతరణ- చురుగ్గా సాకారమైతేనే 'నిషా ముక్త్‌ భారత్‌' సాధ్యపడేది!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details