భారత స్వాతంత్య్ర పోరాటం(Independence Movement), జాతి నిర్మాణం ఏకకాలంలో సమాంతరంగా జరిగాయి. ప్రపంచ చరిత్రలో ఏ రాజ్యంలోనూ మన సమాజంలో ఉన్నంత వైవిధ్యం లేదు. విభిన్న భాషలు, కులాలు, మతాలు, జాతులు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలు, సంప్రదాయాలు దేశంలో సహస్రాబ్దాలుగా సహజీవనం చేస్తున్నాయి. ఈ క్రమంలో నిజమైన ప్రజాస్వామ్యం(Democracy)- సమాఖ్య వ్యవస్థలో(federal system in India) మాత్రమే సాధ్యమని, కేంద్రీకరణ దేశ ఐక్యతకు, భవిష్యత్తుకు ప్రమాదమని జాతి నిర్మాతలు గుర్తించారు. ఆ కారణంగానే రాజ్యాంగంలో మొదటి అధికరణలోనే భారత్‌ను రాష్ట్రాల సమాఖ్యగా ప్రకటించారు.
కేంద్రానిదే పైచేయి
రాజ్యాంగసభ 1946లో ఆమోదించిన తొలి తీర్మానంలో పూర్తి సమాఖ్య వ్యవస్థను, వికేంద్రీకరించిన పరిపాలనను, పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలను ప్రతిపాదించారు. కానీ, దేశ విభజన కాలంలో చెలరేగిన దారుణ మారణకాండ, కొన్ని ప్రాంతాల్లోని అరాచక పరిస్థితులు కేంద్రీకృత రాజ్యాంగ వ్యవస్థకు దారితీశాయి. దాన్నే అర్ధ సమాఖ్య వ్యవస్థగా కొందరు విశ్లేషకులు వర్ణించారు. రాష్ట్రాలకు సొంత ఉనికి, ఎన్నికైన ప్రభుత్వాలు, చట్టసభలు, నిర్దిష్ట అధికారాలు, బాధ్యతలను రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే గవర్నర్లు, వారి చేతుల్లోని విచక్షణాధికారాలు, 356వ అధికరణను ప్రయోగించి రాష్ట్ర శాసనసభలను రద్దు చేసే అధికారం, ప్రజల అనుమతితో నిమిత్తం లేకుండా రాష్ట్రాలను విభజించడానికి, విలీనం చేయడానికి, రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేయడానికి, సరిహద్దుల్ని మార్చడానికి పార్లమెంటుకు ఉన్న అధికారాలు, అఖిల భారత సర్వీసుల పాత్ర తదితరాలు సమాఖ్య స్ఫూర్తిని బలహీనం చేశాయి.
ఉమ్మడి జాబితాలో కేంద్రానిదే పైచేయి కావడంతో పాటు తొమ్మిదో షెడ్యూల్‌లో ప్రస్తావించని అంశాలపై కేంద్రానికే సర్వాధికారాలు దఖలుపడ్డాయి. 252వ అధికరణ కింద కేంద్ర చట్టాన్ని రాష్ట్రాలు ఆమోదిస్తే ఆ మేరకు నిర్ణయాధికారాన్ని శాశ్వతంగా కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా రాష్ట్రాల జాబితాలోని అంశాలపై చట్టాలను చేసే అధికారాన్నీ పార్లమెంటుకు కల్పించారు. పెరుగుతున్న ఆదాయ వనరులను కేంద్రానికి దఖలు చేసి- పరిపాలన, సేవల బాధ్యతను మాత్రం రాష్ట్రాలకు అప్పగించారు. ఇవన్నీ రాజ్యాంగ నిర్మాణంలోనే రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని హరించివేశాయి. స్వాతంత్య్రానంతర పరిణామాలు సమాఖ్య వ్యవస్థను మరింతగా బలహీనపరచాయి. అడవులు, విద్య, భూసేకరణ వంటి రాష్ట్రాల జాబితా అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చి తుది అధికారాన్ని కేంద్రం చేతుల్లో పెట్టారు. ప్రణాళికా సంఘం రాజ్యాంగేతర శక్తిగా అవతరించి మరింత కేంద్రీకరణకు దోహదం చేసింది.
రాజ్యాంగబద్ధమైన ఆర్థికసంఘం పాత్రను ప్రణాళికేతర వనరుల పంపిణీకి పరిమితం చేశారు. లైసెన్స్-పర్మిట్-కోటా రాజ్యం ఆర్థిక కేంద్రీకరణకు దారితీసింది. 356వ అధికరణ దుర్వినియోగం ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి రాష్ట్రాల స్వపరిపాలన హక్కును నిర్వీర్యం చేసింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల జాతీయీకరణ ఆర్థిక వ్యవస్థపై సర్వాధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టింది. రాజ్యాంగంలో చేర్చిన స్థానిక ప్రభుత్వాల అధ్యాయం సైతం ఇలాగే అయింది. వాటి ఏర్పాటులో రాష్ట్రాలకు వెసులుబాటు లేకుండా పోయింది. ఇంతటి వైవిధ్యం కలిగిన దేశంలో ఒకే నమూనాలో నిర్మించడం మూడో అంచె సమాఖ్యను నిర్వీర్యం చేసింది. ఇంతా చేసి స్థానిక ప్రభుత్వాలకు నిర్దిష్ట అధికారాలు, పాత్రను నిర్దేశించడంలో రాజ్యాంగ సవరణలు విఫలమయ్యాయి.
ఆరోగ్యకరమైన మార్పులు ఇవీ...
మన సమాఖ్య వ్యవస్థ స్తబ్ధంగా లేదు. గత 74 సంవత్సరాలలో పరిణామం చెందుతూ వస్తోంది. జాతీయస్థాయిలో తరచూ సంకీర్ణ ప్రభుత్వాలు అనివార్యం కావడంతో రాష్ట్రాల హక్కులను కాలరాయడం కష్టమైంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో వనరుల విభజనలో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల మధ్య వ్యత్యాసం అంతరించింది. 1991 ఆర్థిక సంస్కరణలు లైసెన్సు రాజ్యాన్ని చాలా మేరకు అంతం చేయడంతో రాష్ట్రాలు తమ ప్రజల అభివృద్ధి కోసం సొంతంగా కార్యక్రమాలు చేపట్టడం సాధ్యమైంది. ప్రణాళికా సంఘం రద్దు కావడంతో రాష్ట్రాల నిర్ణయాధికారంలో, వనరుల కేటాయింపులో కేంద్రం జోక్యం తగ్గింది. ఈ పరిణామాలు దేశ ఐక్యతను బలపరచి, ఆర్థిక ప్రగతికి దోహదం చేశాయి. రాష్ట్రాల మధ్య పోటీతత్వం పెరిగింది. కొత్త విధానాలు రూపొందించడం సులువైంది. మంచి ఫలితాలనిచ్చిన విధానాలు, పద్ధతులు దేశమంతటా విస్తరిస్తున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మరింత బలపడింది. కేంద్రం పాత్రను మరింత స్పష్టంగా నిర్వచించడంతో ద్రవ్య నియంత్రణ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక విధానాలు, పెట్టుబడులకు ప్రోత్సాహం మరింత సమర్థంగా అమలవుతున్నాయి.
జరగాల్సిన కృషి మరెంతో!