తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సేద్య సంస్కరణలతో అన్నదాతకు బంధ విముక్తి - వ్యవసాయ సంస్కరణలు

దేశానికే గర్వకారణమైన అన్నదాతలు- తమ ఉత్పత్తులను తమకు నచ్చిన ప్రదేశంలో విక్రయించేందుకు ఎన్నాళ్లుగానో వేచిచూశారు. వారి ఎదురుచూపులకు ఇన్నాళ్లకు ఫలితం దక్కింది. ప్రధాని నరేంద్రమోదీ తీసుకురానున్న సంస్కరణలతో అటు రైతులు, ఇటు వినియోగదారులు ఇరువురూ లాభపడతారు. ఈ సంస్కరణ త్వరలోనే కార్యరూపం దాల్చాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

farmer
అన్నదాత

By

Published : May 28, 2020, 8:45 AM IST

ప్రతిఫలం ఆశించకుండా కర్తవ్య పాలన చేయాలని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన నిష్కామ కర్మ తత్వాన్ని భారతీయ రైతులు దశాబ్దాలుగా చేతల్లో చూపిస్తూ వచ్చారు. వర్షం పడినా పడకపోయినా, రాబడి వచ్చినా రాకపోయినా, ఎన్నిసార్లు భంగపడినా ఈ దేశంలో రైతులు ఏనాడూ భూమిని నమ్ముకుని వ్యవసాయం చేశారే తప్ప- తమ ప్రయత్నాలను విరమించలేదు.

రైతు బిడ్డగా కోట్లమంది అన్నదాతల సమస్యలకు, కష్టాలకు ప్రత్యక్ష సాక్షిని నేను. శ్రమకు తగిన గిట్టుబాటు ధర అన్నదాతలకు ఎండమావిగానే మిగిలిపోయింది. రైతుల కష్టానికి ఫలితం మార్కెట్లు, మధ్యవర్తులు, రుణదాతల దయపై ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రాథమిక హక్కుల ఉల్లంఘన

నిత్యావసర సరకుల చట్టం-1955, రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ చట్టాలు రైతుల ఉత్పత్తులను తమకు నచ్చిన ధరలకు, ఇష్టం వచ్చిన చోట విక్రయించే హక్కుకు తూట్లు పొడుస్తున్నాయి. ఈ రెండు చట్టాలు రైతుల విక్రయ స్వేచ్ఛకు పరిమితులు విధిస్తున్నాయి. ఇది ఒక రకంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. ఫలితంగా రైతులు, వినియోగదారులు మార్కెట్‌ బాధితులుగా మిగిలి; మధ్యవర్తులు, దళారులు లాభాలు పొందుతున్నారు.

వ్యవసాయ ఉత్పత్తులకు సహేతుక విలువను నిర్ధరించే వరకూ వాటిని భద్రపరచేందుకు అనువైన శీతల గిడ్డంగులు, గోదాములు వంటి మౌలిక సదుపాయాలు; త్వరగా పాడయ్యే గుణం ఉన్న వస్తు రవాణా కోసం శీతలీకరణ సౌకర్యాలున్న వాహనాలు తగిన స్థాయిలో అందుబాటులో లేవు. అందుకే రైతులు తరచూ తమ ఉత్పత్తులను రోడ్ల మీద పారబోయడం, పశువులకు ఆహారంగా వేయడం వంటి ఘటనలను నేటికీ చూడాల్సి వస్తోంది. ఇంత జరిగినా ఏనాడూ రైతులు సమ్మెకు దిగలేదు. దేశానికి ఆహారం అందించే క్రతువును కొనసాగించడం మానలేదు.

దేశంలో రైతుల, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించి సమతౌల్యం ఇప్పటికీ సాధ్యం కాలేదు. దీనివల్ల రైతులు నిస్సహాయంగా మిగిలిపోయారు. వ్యవసాయ ధరలకు సంబంధించి నిర్బంధ వాణిజ్య, మార్కెటింగ్‌ విధానాల కారణంగా రైతు ఆదాయాలు గణనీయంగా క్షీణించాయి.

అప్రకటిత పన్నుల భారం..

భారత్‌లో వ్యవసాయ విధానాలపై అధ్యయనం చేసి ‘ఐసీఆర్‌ఐఈఆర్‌-ఓఈసీడీ’ వెలువరించిన అధ్యయనాని(2018)కి వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్‌ అశోక్‌ గులాటి సహరచయితగా వ్యవహరించారు. ఇందులో ఎన్నో ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెల్లడించారు. వ్యవసాయ-మార్కెటింగ్‌పై పరిమితుల రూపంలో 2000-01నుంచి 2016-17 మధ్యకాలంలో రైతులపై రూ.45 లక్షల కోట్ల అప్రకటిత పన్నులు విధించినట్లు ఆ అధ్యయనంలో వెల్లడించారు.

పదిహేడు సంవత్సరాల కాలంలో ఈ పన్నుల మొత్తం ఏడాదికి సగటున 2.56 లక్షల కోట్ల రూపాయలుగా తేలింది. ఈ పరిస్థితి మరే దేశంలోనూ లేదని అధ్యయనం వెల్లడించింది. అన్నదాతలను గట్టెక్కించేందుకు ఏదో ఒకటి చేయాలన్న విజ్ఞాపనల నేపథ్యంలో- వారి మార్కెటింగ్‌ స్వేచ్ఛపై ఆంక్షల తొలగింపుపై తొలి అధికారిక కార్యాచరణ ప్రకటన ఇటీవల వచ్చింది.

కేంద్రం ఉద్దీపనతో..

ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్రకటించగా; అందులో వ్యవసాయ, అనుబంధ రంగాల ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రుణ మద్దతు పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు సుమారు రూ.4 లక్షల కోట్ల మద్దతు ప్యాకేజీ ప్రకటించారు.

మార్పు త్వరగా రావాలి..

నిత్యావసర సరకుల చట్టం, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చట్టాల సవరణ దిశగా గట్టి నిబద్ధత వ్యక్తం చేయడం స్వాగతించాల్సిన అంశం. ఈ నిర్బంధ చట్టాల సవరణ ఎంతో కాలంగా వాయిదా పడుతూనే ఉంది. వీటి సవరణవల్ల రైతులు తమ ఉత్పత్తులకు తగిన విలువ పొందే క్రమంలోని అడ్డంకులు తొలగిపోతాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ కూర్పును చాలా జాగ్రత్తగా, బాధ్యతతో చేపట్టాల్సి ఉంది. రైతులు తిరిగి సమస్యల్లోకి జారిపోకుండా ఉండేందుకు ఇది అవసరం. ఈ మార్పులు త్వరగా సాధ్యం కావాలి.

కొనుగోలుదారులను రైతుల నుంచి నేరుగా ఉత్పత్తులు కొనే దిశగా అనుమతించినప్పుడు, రైతుల బేరసారాల శక్తిని పెంచడానికి అదే విధంగా వారు మళ్ళీ దోపిడికి గురికాకుండా చూసేందుకు వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ (ఎఫ్‌.పి.ఓ) బలమైన, సమర్థమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కౌలు వ్యవసాయంపై సమర్థమైన చట్టం అవసరం. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, రైతులు మంచి ఆదాయం పొందేలా చర్యలు తీసుకోవడమూ తక్షణావసరం.

గిట్టుబాటు ధర దక్కాలి

ఇదొక మంచి సంస్కరణ అన్న విషయంలో మరో మాట లేదు. అనేక రకాల కార్యకలాపాల ద్వారా రైతుల ఆదాయాలను, అవకాశాలను మెరుగుపరచగల సమర్థ మార్గాలను ఇందులో అన్వేషించటం... ఈ ప్యాకేజీ ప్రత్యేకత. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ (మేనేజ్‌) దేశంలో మూడున్నర వేలమంది రైతుల ఆత్మహత్యలపై ఓ అధ్యయనం జరిపింది.

అందులో పాడి పరిశ్రమ, కోళ్ళ పెంపకం చేపట్టిన రైతులెవ్వరూ ఆత్మహత్య చేసుకోలేదని తేల్చారు. ఉద్దీపన ప్యాకేజీలో పశుసంవర్థక, మత్స్య సంపదకు భారీ మద్దతు అందించారు. ఈ చర్య రైతుల ఆదాయ వనరులను విస్తృతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. అదే జరిగితే రైతులోకానికి స్వాతంత్య్రం దక్కినట్లే భావించాలి.

ఆనాటి నుంచే డిమాండ్​..

నా ప్రజాజీవన మొదటి రోజుల్లో రైతు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేటప్పుడు ఇచ్చిన నినాదాలు నాకు ఇంకా గుర్తున్నాయి. 'కొనబోతే కొరివి- అమ్మబోతే అడవి', 'పారిశ్రామిక ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు-రైతు పంటలపై ఆంక్షలేమిటి?' వంటివి అప్పట్లో విస్తృతంగా ప్రస్తావనకు వచ్చేవి. 'వాషింగ్టన్‌లో తయారైన గడియారాన్ని గుంటూరులో విక్రయించవచ్చా.. మరి మన ధాన్యాన్ని మాత్రం పక్క రాష్ట్రంలో అమ్మడంపై ఈ ఆంక్షలేమిటి?' అన్న నిరసనలు, డిమాండ్లు ఆనాటినుంచే ఉన్నాయి.

జనతా ప్రభుత్వం ప్రారంభించినా..

1977లో జనతా హయాములో దేశం మొత్తాన్ని ఒకే ఆహార మండలంగా ప్రకటించారు. ఇది రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చింది. ఆ తరవాత తిరిగి ఆంక్షలు మొదలయ్యాయి. సమర్థమైన, సరైన ఫలితం కోసం నిర్బంధ వ్యవసాయ-మార్కెటింగ్‌ చట్టాలను సవరించేటప్పుడు వాటాదారులందరికీ నిర్ణయంలో భాగస్వామ్యం కల్పించాలి. కేంద్ర, రాష్ట్రాలతోపాటు బాధ్యులందరికీ ఈ చట్ట రూపకల్పనలో భాగస్వామ్యం కల్పించాలి. అప్పుడే అర్థవంతమైన, విజయవంతమైన సానుకూల మార్పు వస్తుందన్నది నా భావన... నా సలహా!

నేటి ప్రకటనతో..

ప్రధాని ప్రకటించిన సంస్కరణలను అన్ని స్థాయుల్లోనూ భాగస్వాములందరూ చిత్తశుద్ధితో అమలు చేస్తే అన్నదాతల జీవితాలు బాగుపడతాయి. కరోనా నేపథ్యంలో చాలా మంది ఇంటినుంచే పని చేస్తున్నారు. కానీ రైతులకు మాత్రం ఆ వెసులుబాటు లేదు. వారు పొలాల నుంచి మాత్రమే పని చేయాలి. లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ రైతులు శ్రమించారు. మునుపటితో పోలిస్తే గోధుమ, వరి, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. అందుకే నేను వారిని డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందితో పాటు ముందు వరసలో నిలిచే పోరాట యోధులు (ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌) అని వ్యాఖ్యానిస్తాను.

దేశానికే గర్వకారణమైన అన్నదాతలు- తమ ఉత్పత్తులను తమకు నచ్చిన ప్రదేశంలో విక్రయించేందుకు ఎన్నాళ్లుగానో వేచిచూశారు. వారి ఎదురుచూపులకు ఇన్నాళ్లకు ఫలితం దక్కింది. దీనివల్ల అటు రైతులు, ఇటు వినియోగదారులు ఇరువురూ లాభపడతారు. ఈ సంస్కరణ త్వరలోనే కార్యరూపం దాల్చాలని ఆకాంక్షిస్తున్నాను.

(రచయిత- ఎం.వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి)

ABOUT THE AUTHOR

...view details