కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన జాతీయ విద్యా విధానం-2020 ఇరవై ఒకటో శతాబ్దంలోనే మొదటిది. ఆర్థిక, సామాజిక నేపథ్యాలతో సంబంధం లేకుండా అందరికీ అత్యున్నత నాణ్యతతో కూడిన విద్యావకాశాలు సమానంగా అందుబాటులో ఉండే విద్యావ్యవస్థను-2040 నాటికి సాకారం చేయాలనే విస్తృత లక్ష్యాన్ని ఈ విద్యావిధానం దేశం ముందుంచింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చీఫ్ కె.కస్తూరిరంగన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ రూపొందించిన ముసాయిదా ఆధారంగా కొత్త విధానాన్ని తీర్చిదిద్దారు. ఇందుకోసం కమిటీ అన్ని స్థాయుల్లో సంబంధిత భాగస్వాములందరితో విస్తృత రీతిలో సంప్రదింపులు జరిపింది.
భారత్‌ను ప్రపంచ విజ్ఞాన శక్తిగా తీర్చిదిద్దడం, 2040నాటికి అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చేలా చూడటం, 2035నాటికి ఉన్నత విద్యాసంస్థల్లో స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్)ని 50శాతం (2018లో 26.3 శాతం) చేయడం వంటి లక్ష్యాలతో విధాన పత్రం రూపొందించారు. అత్యున్నత నాణ్యమైన విద్యావకాశాలు కల్పించడంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్న నేపథ్యంలో యువతను నిపుణులుగా, ఉద్యోగాలకు అర్హులుగా, ఉత్పాదక వనరులుగా తీర్చిదిద్దాలి. ప్రభుత్వం చేపట్టిన ‘భారత్‌లో తయారీ’, ‘నైపుణ్య భారత్’ వంటి కార్యక్రమాలకు అనుగుణంగా యువతను సంసిద్ధం చేయాలి.
'ప్రాథమిక’ పునాదులు బలహీనం
చదవడం, రాయడం, అంకెలు, ప్రాథమిక లెక్కల పరిజ్ఞానం వంటివి బడికెళ్లేందుకైనా, జీవితకాల అభ్యసనానికైనా తప్పనిసరిగా వంటబట్టాల్సిన నైపుణ్యాలు. చాలా సర్వేలు స్పష్టం చేసిన దాని ప్రకారం ప్రస్తుతం మనం అభ్యసన సంక్షోభంలో ఉన్నాం. దేశంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఉన్న అయిదు కోట్ల మందికిపైగా విద్యార్థుల్లో చాలామందికి కనీస స్థాయి అక్షరాలను చదవడం రాదని, అర్థం చేసుకునే సామర్థ్యం కొరవడిందని, చిన్న అంకెలతో కూడికలు, తీసివేతలు చేయడం సైతం రావడం లేదని వెల్లడైంది. ఒకటో తరగతిలో 16శాతంమంది చిన్నారులు మాత్రమే తమ పాఠ్యపుస్తకాన్ని చదవగలుగుతుండగా, మూడో తరగతిలో రెండు శాతం విద్యార్థులు రెండంకెల సంఖ్యల్ని గుర్తించలేకపోయినట్లు 2020 వార్షిక విద్యాస్థితి నివేదిక (అసెర్) వెల్లడించింది. ఇటీవల పార్లమెంటులో కేంద్రమంత్రి ప్రకటన మేరకు- దేశంలోని అన్ని స్థాయుల్లో 10.84 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 17శాతం మేర 10.60 లక్షల (61.84 లక్షలు) ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 35వేలు (14శాతం), తెలంగాణలో 18వేల (13శాతం) టీచర్ పోస్టులను భర్తీ చేయలేదు. ఉపాధ్యాయ ఖాళీలను సాధ్యమైనంత త్వరగా నిర్దిష్ట కాలవ్యవధితో భర్తీ చేయాలని కొత్త విద్యావిధాన పత్రం పేర్కొంది.