తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రాణత్యాగాల్ని గుర్తించలేరా? సమాచారం లేదంటారా?

కరోనా మహమ్మారి ఇప్పటికే దాదాపు 53 లక్షలమందికి సోకి 80వేలమందిని పొట్టనబెట్టుకొని ఇంకా విలయతాండవం చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం చెంత కీలక సమాచారం కొరవడింది. కొవిడ్‌పై పోరులో ముందువరస యోధులైన వైద్యులు ఎంతమంది మరణించారన్న సమాచారం లేదు. వందల కిలోమీటర్లు నడుచుకుంటూ స్వగ్రామాలకు బయలుదేరిన వలస శ్రామికుల్లో ఎందరు మార్గమధ్యంలోనే కనుమూశారో లెక్కల్లేవు! సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి గల్లంతై వీధినపడ్డ శ్రామికులెందరో కూడా కేంద్రానికి తెలియదు!

By

Published : Sep 20, 2020, 8:06 AM IST

govt says it dosen't have data
ప్రాణత్యాగాల్ని గుర్తించలేరా? సమాచారం లేదంటారా?

'ఎలాంటి జాతీయ విపత్తులోనైనా నేను ఆధారపడగలిగిన శక్తి ప్రజానీకమే. అందుకే వాళ్లకు ఎప్పుడూ వాస్తవాలు తెలియాలి'- అమెరికా మహోన్నత నేత అబ్రహాం లింకన్‌ మాట అది. పారదర్శకత, జవాబుదారీతనమనే ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిమళం అందులో గుబాళిస్తోంది. అంతకుమించి తెలుసుకొనేందుకు ప్రజలకు గల హక్కుకు ఎత్తుపీట వేస్తోంది.

ఒక్క సమాచారమూ లేదు

ఎలాంటి జాతీయ విపత్తులనైనా ధీమాగా ఎదుర్కోవాలంటే పటిష్ఠ విధానాల రూపకల్పనకు అత్యావశ్యకమైన విశ్వసనీయ సమాచారం ప్రభుత్వాల చెంత సదా సిద్ధంగా ఉండాలి. దురదృష్టం ఏమిటంటే, మందూమాకూ లేని కరోనా మహమ్మారి ఇప్పటికే దాదాపు 53 లక్షలమందికి సోకి 80వేలమంది అభాగ్యుల్ని కబళించి ఇంకా పట్టపగ్గాల్లేనట్లు విలయనర్తనం చేస్తుంటే- కేంద్ర ప్రభుత్వం చెంత కీలక సమాచారం కొరవడింది. పకడ్బందీ లాక్‌డౌన్‌ అమలు ద్వారా ఎకాయెకి 29 లక్షల కొవిడ్‌ కేసుల్ని, 78వేల మరణాల్ని నిలువరించగలిగినట్లు చెబుతున్న కేంద్రసర్కారు చెంత- కొవిడ్‌పై పోరులో ముందువరస యోధులై మోహరించిన వైద్యులు ఎంతమంది మరణించారన్న సమాచారం లేదు. బతుకు భయం తరుముతుంటే వందల కిలోమీటర్లు నడుచుకుంటూ స్వగ్రామాలకు బయలుదేరిన వలస శ్రామికుల్లో ఎందరు మార్గమధ్యంలోనే కనుమూశారో లెక్కల్లేవు! సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి గల్లంతై వీధినపడ్డ శ్రామికులెందరో కూడా కేంద్రానికి తెలియదు! కొవిడ్‌పై ఏకోన్ముఖ పోరాటానికి సారథ్యం వహిస్తున్న సర్కారు శాఖలు కీలక సమాచారం తెలుసుకోకుండా ఏం వెలగబెడుతున్నట్లు?

రాష్ట్ర జాబితా అంటారా?

ప్రాణాంతక మహమ్మారి కరోనా విరుచుకుపడిన వేళ- వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, పారిశుద్ధ్య శ్రామికుల వంటి ముందువరస యోధులకు సంఘీభావం ప్రకటించాలని ప్రధాని మోదీ కోరినప్పుడు యావద్దేశం హృదయపూర్వకంగా స్పందించింది. ఆరోగ్య ఆత్యయిక స్థితిలో ప్రాణాలొడ్డి విధివిహిత బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారందరిపైనా పుష్పాభిషేకం చేసినప్పుడూ సహర్షంగా స్వాగతించింది. ముందువరస యోధులకు రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పించడాన్నీ గౌరవ సూచకంగా మన్నించింది. వ్యక్తిగత రక్షణ సదుపాయాలు పూర్తిగా అందుబాటులోకి రానప్పటి నుంచే కరోనా పీడితులకు సాంత్వన కలిగించే క్రమంలో తామూ ఆ వ్యాధి పాలబడి వందలమంది వైద్యులు బలైపోయారన్న వాస్తవం గుండెల్ని పిండేస్తోంది. అలా ఎంతమంది అమరులయ్యారన్న ప్రశ్నకు- ఆరోగ్యం రాష్ట్ర జాబితాలోని అంశమని, కేంద్రస్థాయిలో అలాంటి 'డేటా' నిర్వహించడం లేదని, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ (బీమా సదుపాయం) ద్వారా సహాయం కోరేవారి వివరాలే అందుబాటులో ఉన్నాయన్న సమాధానం నివ్వెరపరుస్తోంది.

ప్రధానికి లేఖ రాసినా స్పందన లేదు!

మృత్యువాత పడిన వైద్యుల సంఖ్య 196గా ఉన్నప్పుడు ఆగస్టు తొలివారంలోనే ప్రధానమంత్రికి పూర్తి వివరాలతో లేఖ రాసినా స్పందన కరవైందన్న ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌- ఇప్పటికి 382మంది వైద్యులు కరోనాకు బలైపోయారంటోంది. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న మూడున్నర లక్షలమంది వైద్యుల సమాచార నిధిగల ఐఎమ్‌ఏ- కొవిడ్‌ సోకినవారిలో ప్రభుత్వ వైద్యులు ఎనిమిది శాతం, ప్రైవేటు వైద్యులు 15 శాతం మరణించారని వివరిస్తోంది. ఔట్‌ పేషెంట్‌ డాక్టర్లకు ఎన్‌95 మాస్కులు, చేతి తొడుగుల్నే వ్యక్తిగత రక్షణగా కేంద్ర మార్గదర్శకాలు నిర్ధారించడంతో- మృతి చెందినవారిలో 40శాతం తొలిగా కొవిడ్‌ రోగుల్ని పరీక్షించినవారే ఉన్నారని ఐఎమ్‌ఏ విశ్లేషిస్తోంది. దేశవ్యాప్తంగా 2,238మంది అల్లోపతి వైద్యులకు కరోనా సోకగా 382మంది మృత్యువాత పడ్డారంటూ జాతీయ సగటు మరణాల రేటు (1.7శాతం)కు అది పదింతల (17.06)లని వివరిస్తోంది. ఎంతో అనుభవం గల జనరల్‌ ఫిజీషియన్లే అధికశాతం రాలిపోయారంటున్న గణాంకాలు, 35 ఏళ్లలోపు వైద్యులూ నిస్సహాయంగా కనుమూసిన దారుణాన్ని ప్రస్తావిస్తున్నాయి. వైద్యుల కొరతతో అలమటిస్తున్న కర్ణాటక తుది సంవత్సరం వైద్యవిద్యార్థుల్నీ కొవిడ్‌పై పోరాటానికి ఆయత్తం చేస్తోంది. దేశరక్షణ కోసం ప్రాణాల్ని బలిపెట్టే సిపాయిలతో సమానంగా ఆరోగ్య సిబ్బంది త్యాగాల్నీ గుర్తించి గౌరవించాల్సిందిపోయి- అసలు సమాచారమే లేదన్న సమాధానం నివ్వెరపరుస్తోంది!

సమాచారం లేదని సాయమూ చేయరట!

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ సోకి 7,000మంది ఆరోగ్య సిబ్బంది మరణించారని ఈ నెల తొలివారంలో ప్రకటించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ- ఇండియాలో 573మంది అసువులు బాసినట్లు వెల్లడించింది. సాధ్యమైనంతగా సమాచార సేకరణకు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు కృషి చేస్తుంటే- అర్థగణాంక, పథకాల అమలుపేరిట ప్రత్యేక మంత్రిత్వశాఖేగల కేంద్రం ఏం ఉద్ధరిస్తోందన్న ప్రశ్నే ఉత్పన్నమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నూరుశాతం లాక్‌డౌన్‌ కఠినంగా అమలైన దేశం ఇండియానే. మార్చి 24న మొదలైన లాక్‌డౌన్‌ నాలుగు కోట్లమంది అంతర్రాష్ట్ర వలస శ్రామికుల పొట్టకొట్టిందని ప్రపంచబ్యాంకు నివేదికే ఎలుగెత్తింది. ఆ కష్టకాలంలో ఎంతమంది వలస శ్రామికులు బలైపోయారన్న ప్రశ్నకు- సమాచారం అందుబాటులో లేదన్న కార్మిక మంత్రిత్వశాఖ, వివరాలే లేనప్పుడు బాధిత కుటుంబాలకు సాయం అన్న ప్రశ్నే తలెత్తదనీ అతి తెలివి ఒలకబోసింది. 4,611 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లలో 63 లక్షలమందిని స్వరాష్ట్రాలకు తరలించామని చాటుకొంటున్న ప్రభుత్వం- నిస్సహాయుల మరణాలతో తనకు నిమిత్తం లేదన్నట్లుగా వ్యవహరించడమే దారుణం! ఎన్ని వందలమంది వలస శ్రామికుల జీవితాలు ఎంత దుర్భరంగా ముగిసిపోయాయో కళ్లకు కడుతున్న వార్తాకథనాలనైనా కేంద్రం పరిశీలించకపోవడం అమానుషం!

ఈ ధోరణి పనికి రాదు

జాతికి జీవనాడిగా ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం కొవిడ్‌ ధాటికి కకావికలమై కోట్లమంది అభాగ్యులు ఉపాధి కోల్పోయారు. దానిమీద ప్రత్యేక పరిశోధన ఏదీ జరగలేదన్న కేంద్రం- గొప్పగా ప్రకటించిన ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ వల్లా వాటికి ఒనగూడిందేమీ లేదు. సామాజిక, ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా కోరలు విరవాలంటే- ఈ తరహా 'చల్తా హై' ధోరణి పనికిరాదు. సమస్య మూలాలు తెలిసి సదవగాహనతో స్పందించడానికైనా, అమరుల త్యాగాలు గుర్తించి గౌరవించడానికైనా, బాధాసర్పదష్టుల కుటుంబాల్ని ఆదుకోవడానికైనా- కేంద్రం చెంత విస్పష్ట సమాచారం ఉండితీరాలి. ఏమీ తెలియనిదాన్ని ప్రభుత్వమని ఎలా అనుకోవాలి?

(రచయిత- పర్వతం మూర్తి)

ఇదీ చదవండి-పార్లమెంటులో కేంద్రం ప్రకటనపై ఐఎంఏ ఆగ్రహం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details