ప్రైవేటు రంగ సంస్థలు తమ సంస్థాపకులకు, వాటాదారులకు లాభాలు ఆర్జించిపెట్టడమే పరమావధిగా వ్యాపారం చేస్తుంటాయి. అదే ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌ఈ) అన్ని వర్గాల ప్రజలకు సరిసమానంగా సేవలు అందించడమే పరమార్థంగా కార్యకలాపాలు సాగిస్తాయి. ప్రైవేటుది లాభార్జన దృష్టి అయితే, ప్రభుత్వ రంగానిది సామాజిక సంక్షేమ దృక్పథం. ప్రైవేటు కంపెనీలు తమ యజమానులకు జవాబు చెప్పుకోవాలి. పీఎస్‌ఈలు ప్రభుత్వానికీ, నియంత్రణ సంస్థలకు, చట్టసభలకు జవాబుదారీగా వ్యవహరించాలి. అవి 'కాగ్', సీబీఐ, కేంద్ర విజిలెన్స్ విభాగం వంటి సంస్థల డేగ కళ్ల కింద పనిచేయాల్సి ఉంటుంది. దేశ ఆర్థిక వికాసంలో ప్రైవేటు కంపెనీల పాత్ర గణనీయమే కానీ, వాటి కోసం పీఎస్‌ఈలను బలిపెట్టడం ఎంతమాత్రం అభిలషణీయం కాదు. మారిన కాలానికి ప్రైవేటు రంగమే తారకమంత్రమని అధికార వర్గాలు వినిపిస్తున్న వాదన లోపభూయిష్ఠమైనది. దశాబ్దాల క్రితం స్వావలంబన మంత్రాన్ని జపించిన భారతదేశం నేడు ఆత్మనిర్భరతను ప్రవచిస్తోంది. రెండింటి అర్థం ఒకటే అయినా, గడచిన ప్రభుత్వాల హయాములో సోషలిస్టు భావజాలానికి అగ్రాసనం వేస్తే, ఇప్పుడు పెట్టుబడిదారీ పంథాకు పట్టం కడుతున్నారు. అందుకే నేడు 'ఈ దేశంలో పీఎస్‌ఈలు అస్తమించకతప్పదు', 'ప్రభుత్వం పని పరిపాలించడమే తప్ప వ్యాపారం చేయడం కాదు' అనే సూత్రీకరణలు వినబడుతున్నాయి. వ్యక్తులు, వ్యాపార సంస్థలు, పాలకులు తరాలపాటు శ్రమించి విలువైన ఆస్తులు కూడగట్టి భావి తరాలకు భద్రమైన భవిష్యత్తు అందించాలని తపన పడిన సంగతిని ఈ సందర్భంలో విస్మరిస్తున్నారు. రాజకీయ పార్టీలు తిరిగి అధికారంలోకి రావడానికి ప్రజల ఆస్తులు అమ్మి వారికి రకరకాల తాయిలాలు ఇస్తున్నాయి తప్ప జాతి భవిష్యత్తుకు బలీయ పునాదులు వేయాలనీ, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని తపించడం లేదు. దశాబ్దాలుగా కష్టించి నిర్మించిన పీఎస్‌ఈలను అప్పనంగా ప్రైవేటుకు అమ్మివేస్తున్నారు.
లక్షలమందికి ఉపాధి
టెలికం సర్వీసు ప్రొవైడర్ల (టీఎస్పీ)నుంచి రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయిలను తక్షణం వసూలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా, ప్రభుత్వం టీఎస్పీలు పదేళ్ల వ్యవధిలో దఫాలవారీగా బకాయిలు చెల్లించవచ్చని ఎంతో ఉదారంగా సెలవిచ్చింది. తీరా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖజానాకు పడిన రూ.1.75 లక్షల కోట్ల బొర్రెను పూడ్చుకోవాలని పీఎస్‌ఈలను తెగనమ్మడానికి సిద్ధపడుతోంది. దీనికోసం భావితరాల భవిష్యత్తును గాలికి వదిలేస్తోంది. కొన్ని పీఎస్‌ఈలు నష్టాల్లో ఉన్నప్పటికీ అత్యధిక పీఎస్‌ఈలు ప్రభుత్వ ఖజానాకు తమ లాభాలు జమచేస్తున్నాయి. పన్నుల రూపంలో మరింత ఆదాయం సమకూరుస్తున్నాయి. ఈ పీఎస్‌ఈలపై వేల సంఖ్యలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఆధారపడి పని చేస్తూ లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కరోనా కాలంలో ప్రభుత్వ రంగంలోని రైళ్లు, విమానాలు లాభాపేక్ష లేకుండా పనిచేసి లక్షలమందిని సొంత ఊర్లకు చేర్చాయి. వరదలు, తుపానులు, భూకంపాల వంటి విపత్తులు విరుచుకుపడినప్పుడు ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ అమూల్యమైన సేవలు అందించి ఆపన్నులను ఆదుకొంటోంది. కరోనా మహమ్మారి విరుచుకుపడిన కొత్తలో ప్రైవేటు ఆస్పత్రులు తాళాలు వేసుకోగా, జనాలకు చికిత్స అందించింది ప్రభుత్వ ఆస్పత్రులేనని మరువకూడదు. పెద్ద నోట్ల రద్దు రోజుల్లో మన పొరుగున ఉన్న కిరాణా దుకాణాల వారు అరువు మీద సరకులు ఇచ్చి అండగా నిలబడ్డారనీ విస్మరించకూడదు.
'విశాఖ'పై ఉక్కుపాదం!