తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బడిగంట మోగక ముందే.. పిల్లలకు సురక్షిత టీకాలు! - బడికి పోయే ముందే పిల్లలకు టీకాలు

విద్యార్థులు ఇప్పటికే వరసగా రెండో ఏడాది కూడా బడులకు, సహవాసులకు దూరంగా ఇళ్లలో నాలుగు గోడల మధ్య ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతో నిత్య సావాసం చేస్తున్నారు. ఫలితంగా చదువులు సరిగ్గా సాగక, ఆటాపాటల్లేక, శారీరక, మానసిక ఎదుగుదల సమస్యలతో కుంగిపోతున్నారు. సహజసిద్ధమైన ప్రత్యక్ష తరగతి అభ్యసనకు దూరమైన చిన్నపిల్లలు ఆన్‌లైన్‌ తరగతులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారనే అభిప్రాయాలు తల్లిదండ్రుల వైపు నుంచి వినిపిస్తున్నాయి. చిన్న తరగతుల విద్యార్థులు ప్రాథమిక స్థాయి అంశాలను మరచి పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

vaccines to the students
పిల్లలకు టీకా

By

Published : Aug 10, 2021, 6:31 AM IST

Updated : Aug 10, 2021, 6:57 AM IST

కరోనా వైరస్‌ కారణంగా ఇంకా బడుల్ని మూసి ఉంచితే విద్యార్థులపై మరింత ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉన్నందు వల్ల తగిన జాగ్రత్తలతో వాటిని తెరవాలని తాజాగా పార్లమెంటు స్థాయీసంఘం నివేదిక సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యార్థులు ఇప్పటికే వరసగా రెండో ఏడాదీ బడులకు, సహవాసులకు దూరంగా ఇళ్లలో నాలుగు గోడల మధ్య ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతో నిత్య సావాసం చేస్తున్నారు. ఫలితంగా చదువులు సరిగ్గా సాగక, ఆటాపాటల్లేక, శారీరక, మానసిక ఎదుగుదల సమస్యలతో కుంగిపోతున్నారు. సహజసిద్ధమైన ప్రత్యక్ష తరగతి అభ్యసనకు దూరమైన చిన్నపిల్లలు ఆన్‌లైన్‌ తరగతుల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారనే అభిప్రాయాలు తల్లిదండ్రుల వైపు నుంచీ వినిపిస్తున్నాయి. చిన్న తరగతుల విద్యార్థులు ప్రాథమిక స్థాయి అంశాలనూ మరచి పోతున్నారనే ఆరోపణలున్నాయి. పార్లమెంటరీ సంఘం సైతం ఇదే తరహా ఆందోళనను వ్యక్తం చేసింది. ప్రత్యక్ష తరగతులు ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థులకు చాలా అవసరమని ఉపాధ్యాయులూ అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బడులు తెరిచి ప్రత్యక్షంగా పాఠాలు బోధించాలంటే, చిన్నారులకు కరోనా నుంచి రక్షణ కల్పించేదెలాగన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మరోవైపు, పదేళ్లలోపు చిన్నారులకు ఇన్‌ఫెక్షన్‌ ముప్పు తక్కువేనని ఐసీఎంఆర్‌ చెబుతున్న క్రమంలో తరగతులు ప్రారంభించేందుకు అభ్యంతరాలు ఏమిటనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు టీకాలు వేసినందువల్ల చిన్నారుల కారణంగా కరోనా వ్యాప్తి ముప్పు తక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సమాధానం దొరకని సవాలు

ఎవరి వాదనలు ఎలాగున్నా- క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కరోనా డెల్టా రకం వైరస్‌ రూపు మార్చుకుంటూ విజృంభిస్తోంది. ఈ క్రమంలో టీకాలు వేస్తే తప్పించి తమ పిల్లల్ని బడులకు పంపించేది లేదంటూ 48 శాతం తల్లిదండ్రులు స్పష్టం చేసినట్లు ఇటీవల 'లోకల్‌ సర్కిల్స్‌' సంస్థ దేశవ్యాప్త సర్వేలో తేలింది. తమ జిల్లాల్లో కొవిడ్‌ కేసులు సున్నాకు చేరితేనే పిల్లల్ని బడులకు పంపిస్తామంటూ మరో 30 శాతం వెల్లడించారు. కొవిడ్‌ కారణంగా ఆస్పత్రుల పాలవడం, మరణాల ముప్పు చిన్నారుల్లో చాలా తక్కువేనని చెబుతున్నా- ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిచేసి, తమతో ఉండే పెద్ద వయసు వారికి ముప్పు కలిగించే అవకాశం లేకపోలేదు. అలాగని, బడుల్ని నిరంతరాయంగా మూసి ఉంచడమూ నష్టదాయకమే. ఆన్‌లైన్‌ పాఠాలతో అభ్యసనం సజావుగా సాగక చిన్నారుల విద్యావికాసం మందగించడం ఒక సమస్యగా మారింది. దేశంలో ఎంతోమంది చిన్నారులకు ఆన్‌లైన్‌ పాఠాలు వినేందుకు అవసరమైన స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు లేకపోవడం, అన్నింటికీ మించి గ్రామీణ ప్రాంతాల్లో సరైన అంతర్జాల సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలతో ఎంతోమంది నాణ్యమైన విద్యకు దూరం అవుతున్నారు. ఇలా బడులు తెరిస్తే వ్యాధి ముప్పు, మూసి ఉంచితే భవితే ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితి- ప్రభుత్వాలకు ఎటూ తేల్చుకోలేని ఇరకాటంగా, సమాధానం చిక్కని సవాలుగా పరిణమించింది.

ఈ క్రమంలో ఆగస్టులో చిన్నారులకు టీకాలు ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఇటీవల ప్రకటించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. చిన్నారుల టీకాలకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయని, క్లినికల్‌ ట్రయల్స్‌పై తుది ఫలితాలు రాగానే, నిపుణుల సలహా మేరకు పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ప్రస్తుతం రెండు భారత వ్యాక్సిన్లు చిన్నారులకు వేసేందుకు అర్హత పొందినట్లు తెలుస్తోంది. మరోవైపు, పన్నెండేళ్లు పైబడిన వారికి వేసేందుకు ఫైజర్‌ ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను అనుమతించారు. మోడెర్నా టీకాకు అమెరికాలో ఇదే తరహా అనుమతి లభించింది. ఈ రెండు కంపెనీలూ భారత ప్రభుత్వంతోనూ చర్చలు జరుపుతున్నాయి. ఈ లెక్కన ఇప్పటికిప్పుడు చిన్నారులకు వ్యాక్సిన్ల పంపిణీ సాధ్యమయ్యేనా అన్నది ప్రశ్నార్థకమే. ఇప్పటికే కొన్ని ధనిక దేశాలు చిన్నారులకు టీకాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. మరికొన్ని పచ్చజెండా ఊపాయి. ఇప్పటికీ సరిపడా డోసులు అందుబాటులో లేని దుస్థితి రాజ్యమేలుతున్న మనలాంటి దేశాల పరిస్థితి ఏమిటి?

వ్యూహాత్మక ముందడుగు

విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి టీకాలు వేయాలని, బడిలో చిన్నారులకు ఉష్ణోగ్రతలను పరీక్షించాలని, ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయాలని, ప్రతి పాఠశాలలో అత్యవసర వైద్యసౌకర్యాలు, మందులు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు ఏర్పాటు చేయాలని, మాస్కులు, శానిటైజేషన్‌ వంటి జాగ్రత్తలు పాటించాలని, వీటన్నింటినీ తనిఖీ చేసేందుకు హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేయాలని పార్లమెంటరీ సంఘం స్పష్టం చేసింది. సిఫార్సులు చేయడం వరకు బాగానే ఉన్నా, ఇవన్నీ ఆచరణలో సాధ్యమేనా అన్నదీ యోచించాలి. భారత్‌లో ఇప్పటిదాకా వయోజనులకు వేసిన పూర్తిస్థాయి టీకాల శాతమే చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలో చిన్నారులకు టీకాలు వేయాల్సి రావడం కొండంత సవాలే. అన్ని వర్గాలకూ ఇవ్వాలంటే ఆ స్థాయిలో వ్యాక్సిన్‌ డోసులను సమకూర్చుకోవాలి. అదెంతమేరకు సాధ్యమనేది ప్రణాళికాబద్ధంగా యోచించి, వ్యూహాత్మకంగా ముందుకు కదలాలి. ఇతర దేశాల నిర్ణయాలు, పరిస్థితులు ఎలాగున్నా- మన దేశానికి, మన స్థితిగతులకు ఏది సరైనదనే కోణంలో యోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ముందుంది.

- శ్రీనివాస్‌ దరెగోని

ఇదీ చూడండి:ఈ వారంలోనే పిల్లల టీకాకు అనుమతి!

Last Updated : Aug 10, 2021, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details