తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బాధ్యతను గాలికొదిలేస్తే... అంతే!

దిల్లీలో గతేడాది, ఈ సంవత్సరం పంజాబ్​ సహా.. ఉత్తర భారత నగరాల్లో వాయునాణ్యత తీవ్ర స్థాయిలో పడిపోయినట్టు వెల్లడైంది. పెరుగుతున్న చలిగాలుల దృష్ట్యా ఏటా శీతాకాలంలో వాయుకాలుష్యం ఏర్పడుతోంది. యథేచ్చగా పంట వ్యర్థాలు తగులబెట్టడం, వాహన పారిశ్రామిక కాలుష్యాలు, బాణసంచా వంటివి గాలి కలుషితానికి ప్రధాన కారకాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాలుష్యకారక పరిశ్రమల కట్టడికి చైనా తరహా నమూనాను ఆవిష్కరించాలి. లేదంటే జనజీవనం మరింత ప్రమాదకరమయ్యే అవకాశముంది.

GOVT NEED TO TAKE ACTIONS ON THE AIR POLLUTION
బాధ్యతను గాలికొదిలేస్తే... అంతే!

By

Published : Nov 6, 2020, 8:36 AM IST

నిరుడీ రోజుల్లో వాయుకాలుష్యం పెచ్చుమీరి దిల్లీలో అత్యవసర పరిస్థితి నెలకొందని ప్రకటించిన కేజ్రీవాల్‌ ప్రభుత్వం, పాఠశాలల్ని మూసేసింది. ఏడాది గిర్రున తిరిగొచ్చాక, ఇప్పుడు పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనం ఒక్కుదుటున జోరెత్తి, దేశ రాజధాని నగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. దిల్లీతోపాటు 29 ఉత్తరాది నగరాల్లో వాయునాణ్యత తీవ్ర ఆందోళనకర స్థాయికి పడిపోయినట్లు తాజా విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఏటా చలిగాలులు గజగజలాడించే నవంబరు, ఫిబ్రవరి మాసాలమధ్య ఉత్తర భారతావనిలో గాలి పెను విషపూరితం కావడం పరిపాటిగా మారింది. యథేచ్ఛగా పంట వ్యర్థాలు తగలబెట్టడం, వాహన పారిశ్రామిక కాలుష్యం నిక్షేపంగా కొనసాగడం, ఉత్సవాల్లో బాణసంచా కాల్చడం- గాలి నాణ్యతకు తూట్లు పొడుస్తున్నాయి.

18 రాష్ట్రాలకు నోటీసులు..

కొవిడ్‌ సంక్షోభవేళ ఈ 'వార్షిక ఉత్పాతం' తాలూకు దుష్పరిణామాల తీవ్రత మరెంతటి మహావిపత్తు తెచ్చిపెడుతుందోనన్న ఆలోచనకే సాధారణ పౌరుల గుండెలు అవిసిపోతున్నాయి! వేసవిలో ఉష్ణోగ్రతల్ని తట్టుకున్న కరోనా వైరస్‌ చలి వాతావరణంలో విజృంభిస్తోందని, వాయుకాలుష్యం అధికంగా ఉన్నచోట్ల కసిగా మృత్యుకోరలు చాస్తోందని వైద్యులు, శాస్త్రవేత్తలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నారు. ఈ తరుణంలో జాగ్రత్త పడకపోతే ప్రాణనష్టం పెచ్చరిల్లుతుందన్న భీతితో ఒడిశా, పశ్చిమ్‌ బంగ, రాజస్థాన్‌, హరియాణా, దిల్లీ వంటివి బాణసంచా వినియోగం, విక్రయాలపై నిషేధాంక్షలు ప్రకటించాయి. హఠాత్తుగా మేలుకున్న జాతీయ హరిత ట్రైబ్యునల్‌- 'మీ సంగతి ఏమిటి' అంటూ ఏపీ, తెలంగాణ సహా 18 రాష్ట్రాలకు ఆదరాబాదరా నోటీసులు జారీ చేసింది. దీపావళి ఇంకోవారం ఉందనగా ఇప్పుడీ హడావుడి నోటీసుల ద్వారా ఒరిగేదేమిటి?

అధ్యయనాలు ఏమంటున్నాయంటే?

కోతల దరిమిలా పంట వ్యర్థాల దహనం ముమ్మరించినప్పుడో, పండుగలప్పుడో హెచ్చరికలు, ఉత్తర్వుల రూపేణా నికర ప్రయోజనం నాస్తి అని ఏటికేడాది రుజువవుతూనే ఉంది. దేశంలో ప్రధానంగా వాహన, పారిశ్రామిక కాలుష్యం మూలాన ఏటా మూడున్నర లక్షల శిశువుల్లో ఉబ్బసం కేసులు బయటపడుతున్నాయని, పెద్దల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్లు జోరెత్తుతున్నాయని 'గ్రీన్‌పీస్‌' అధ్యయనం ధ్రువీకరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిధికి 10, 11రెట్ల వరకు అతిసూక్ష్మ ధూళికణాలు గాలిలో పేరుకుపోయి లఖ్‌నవూ లాంటి నగరాల్ని ‘గ్యాస్‌ ఛాంబర్లు’గా భ్రష్టుపట్టిస్తున్నాయి. పంజాబ్‌, హరియాణా, యూపీ వంటివి తగలబెడుతున్న కోట్లాది టన్నుల పంట వ్యర్థాలనుంచి పెద్దయెత్తున కార్బన్‌ మోనాక్సైడ్‌, బొగ్గుపులుసు వాయువు, సూక్ష్మ ధూళి కణాలు, బూడిద, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వెలువడి పరిసర ప్రాంతాల్లో గాలిని, నేలను, నీటిని విషతుల్యం చేసేస్తున్నాయి. ఈసారీ దిద్దుబాటు చర్యల్ని ఆనవాయితీగా గాలికొదిలేస్తే దారుణ పర్యవసానాలు తథ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కార్యచరణ చేపట్టాలి..

గాలిలోని సూక్ష్మరేణువుల స్థాయి ఒక్క మైక్రోగ్రామ్‌ పెరిగినా, కొవిడ్‌ మరణాల్లో ఎనిమిది శాతం వృద్ధి అనివార్యమని సెప్టెంబర్‌ గణాంకాలు చాటుతున్న దృష్ట్యా- కాలుష్య నియంత్రణ మండళ్లు, ఎన్‌జీటీ, ప్రభుత్వ యంత్రాంగాలు సత్వరం దీటైన కార్యాచరణకు నిబద్ధం కావాలి. వాయునాణ్యతా ప్రమాణాల పరిరక్షణకు అవసరమైన వనరుల విషయంలో రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు నిత్యక్షామం ఎదుర్కొంటున్నాయన్న సరికొత్త అధ్యయనం- బండారం బట్టబయలు చేసింది. తనవంతుగా కేంద్రం- 22ఏళ్లపాటు కొనసాగిన పర్యావరణ కాలుష్య నియంత్రణ ప్రాధికార సంస్థ(ఈపీసీఏ)పై వేటు వేసి, కేంద్ర రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చక్కదిద్దే కమిషన్‌ ఏర్పాటుకు మొన్నీమధ్యే ప్రత్యేక ఆర్డినెన్స్‌ తెచ్చింది. అవినీతిగ్రస్త పీసీబీలను సాకల్యంగా ప్రక్షాళించి, దేశవ్యాప్తంగా కాలుష్యకారక పరిశ్రమల కట్టడికి చైనా నమూనాను ఆవిష్కరిస్తేనే తప్ప- వాయునాణ్యత మెరుగుపడదు, జనజీవనం కుదుటపడదు!

ఇదీ చదవండి:దిల్లీలో ఈసారి దీపావళి బాంబులు లేనట్టే

ABOUT THE AUTHOR

...view details