తొంభై కోట్లమంది ఓటర్లతో అలరారే భారతావనికి ప్రజాస్వామ్య మేరునగంగా గొప్ప పేరు. మూడంచెల పాలనావ్యవస్థ ప్రతినిధుల ఎన్నికకు మూలకందమైన ఓటర్ల జాబితాల సొబగు చూస్తేనే సిగ్గుచేటు. ఓటర్ల చిట్టా తయారీ ఎంతో నిష్ఠగా చేపట్టాల్సిన కర్తవ్యమని భారతరత్న అంబేడ్కర్ ఏనాడో ఉద్బోధించినా- కేంద్ర రాష్ట్ర స్థాయుల్లోని ఎన్నికల సంఘాలు విధివిహిత బాధ్యతల నిర్వహణలో దశాబ్దాలుగా విఫలమవుతున్న తీరు నిర్వేదం రగిలిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల వేళ మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానం మేరకు- లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం ఒకే ఓటర్ల జాబితాను ఖరారు చేసే దిశగా భాజపా సారథ్యంలోని ఎన్‌డీఏ సర్కారు తాజాగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాజ్యాంగంలోని 324 అధికరణ అనుసారం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం నిర్వాచన్ సదన్ ఓటర్ల జాబితాను నిర్వహిస్తుంటే, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపే అధికారాలతో పరిపుష్టమైన రాష్ట్ర ఎన్నికల సంఘాలు తాము రూపొందించే ఓటరు జాబితాలతో రాజ్యాంగ విధి నిర్వర్తిస్తున్నాయి. దాదాపు 22 రాష్ట్రాలు కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలపైనే ఆధారపడుతున్నా- యూపీ, ఉత్తరాఖండ్, ఒడిశా, అసోం, మధ్యప్రదేశ్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటివి తమవైన ఓటరు పట్టికలతో 'ప్రత్యేకత' చాటుకొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితా ఉండాలన్న బాణీకి 1999, 2004 సంవత్సరాల్లో ఈసీ శ్రుతి చేయగా- 2015లో న్యాయసంఘం సైతం ఆ ప్రతిపాదనను సమర్థించింది. ఓటర్ల జాబితా తయారీకోసం ఆయా రాష్ట్రాల్లో మరోసారి సాగుతున్న వృథా వ్యయప్రయాసల్ని తప్పించడమే లక్ష్యమంటూ మొదలుపెట్టిన కసరత్తు- రాష్ట్ర చట్టాల్లో నిర్దిష్ట మార్పుల్ని అభిలషిస్తోంది. ఒకే ఓటర్ల పట్టిక యోచన మంచిదేగాని- దాని ప్రామాణికత మాటేమిటి?
కట్టుదిట్టంగా ఓటర్ల జాబితా - దేశంలో ఓటర్లు
ప్రపంచంలోనే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న దేశంగా భారత్‌ను చెప్పవచ్చు. అయితే ఈ ఓటర్ల జాబితా తయారీలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతల నిర్వహణలో దశాబ్దాలుగా విఫలమవుతూనే వచ్చాయి. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం ఒకే ఓటర్ల జాబితాను ఖరారు చేసే దిశగా భాజపా సారథ్యంలోని ఎన్‌డీఏ సర్కారు తాజాగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఒకే ఓటర్ల పట్టిక యోచన మంచిదేగాని- దాని ప్రామాణికత మాటేమిటి?
ఓటు అంటే ఏమిటి?
అసలు ఓటు అంటే ఏమిటో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు తెలియజెబితే, విచక్షణాయుతంగా సంపూర్ణ అవగాహనతో ఓటేయడం రెండో ఎన్నికల నాటికే ఓటర్లకు అలవడిందని గతంలో ఈసీయే ఘనంగా చాటింది. అదే నేడు- ఓటును తమ అస్తిత్వ చిహ్నంగా పరిగణిస్తూ, జాబితాలో పేరు లేకపోవడాన్ని ఆక్రోశంతో ప్రశ్నిస్తున్న లక్షలాది జనవాహినికి ఈసీ నిష్క్రియాపరత్వం శరాఘాతమవుతోంది. దేశవ్యాప్తంగా ఓటరు పట్టికలో ఎనిమిదిన్నర కోట్ల పేర్లు బోగస్ లేదా నకిలీవేనని నిర్వాచన్ సదన్ ప్రధాన కమిషనర్‌గా హెచ్‌ఎస్ బ్రహ్మ 2015 ఫిబ్రవరిలోనే ప్రకటించారు. మొత్తం ఓట్లలో 10-12 శాతం నకిలీవి కావడం జాతీయ సమస్య అంటూ, అదే ఏడాది ఆగస్టు 15లోగా పౌరుల ఆధార్ సంఖ్యలను ఓటర్ల జాబితాలకు అనుసంధానించి దోషరహితంగా తీర్చిదిద్దుతామనీ భరోసా ఇచ్చారు. అన్నింటికీ ఆధార్‌ను తప్పనిసరి చేయడం సరికాదన్న సుప్రీం ఆదేశాలతో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ ఈసీ తరఫున జనజాగృతి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖుల పేర్లూ ఓటర్ల చిట్టాలో కనుమరుగైన చోద్యాలు, ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్లూ నాంపల్లి ఓటర్లుగా నమోదైన వైనాలు- ఓటి చిట్టాలకు తిరుగులేని దృష్టాంతాలు! స్వీయనిర్వాకం నగుబాటుకు గురైన సందర్భాల్లో ఈసీ చెప్పే ‘సారీ’లు అలవాటుగా మారకుండా- కట్టుదిట్టంగా ఓటర్ల జాబితా రూపకల్పన నిర్వహణపై దృష్టి సారించాలిప్పుడు! అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ వంటిచోట్ల సాఫీగా సాగుతున్న ప్రక్రియ నుంచి పాఠాలు నేర్చి, సాంకేతికత దన్నుతో నకిలీల కసవు ఊడ్చేసి, సరైన ఓటర్ల పట్టిక కూర్పునకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడివచ్చినప్పుడే భారత ప్రజాతంత్రం జేగీయమానమవుతుంది!