కొన్ని చట్టాల్లో క్రిమినల్ నేరంగా పరిగణించే నిబంధనలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 19చట్టాల్లో మార్పులు చేపట్టాలనే ప్రతిపాదనలపై ఇటీవలే ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరింది. సాధారణంగా నేరాలు రుజువైతే ఆరు నెలల నుంచి మూడేళ్లదాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆర్‌బీఐ, బ్యాంకింగ్, బీమా, సఫ్రేసి, పింఛన్లు, చెల్లింపులు, నాబార్డ్, జాతీయ హౌసింగ్ బోర్డు, చెక్కు బౌన్సు కేసులు, చిట్‌ఫండ్స్, పిరమిడ్ స్కీములు, అక్రమంగా డిపాజిట్ల సేకరణ తదితర కార్యకలాపాలకు సంబంధించిన చట్టాల్లోని క్రిమినల్ నిబంధనలు తొలగింపు ప్రతిపాదనల్లో ఉన్నాయి. అనేక ఇతర మార్పుల మాదిరిగానే కొవిడ్‌ను కూడా ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు. ఇలాంటి క్రిమినల్ నిబంధనలు న్యాయస్థానాలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయని, పెట్టుబడులను దెబ్బ తీస్తున్నాయని, ఫలితంగా సులభతర వాణిజ్య ప్రక్రియపై ప్రభావం పడుతోందనేవి ప్రభుత్వం చెబుతున్న కారణాలు. అయితే, ఇలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థను మరింతగా ఇబ్బందులపాలు చేస్తాయి.
పెట్టుబడిదారుల్లో ఆందోళన
భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన సమస్య- ఒప్పందాలను గౌరవించకపోవడం. ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వాలు సైతం తాము సంతకాలు చేసిన ఒప్పందాలపై మళ్లీ వెనుకంజ వేస్తుండటమూ సమస్యగా మారింది. ఒప్పందాలకు కట్టుబడి ఉండకున్నా, ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్నా పెట్టుబడిదారులు, ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనే అవకాశం ఉంది. సుమారు 19 చట్టాల్లో ఆర్‌బీఐ, బ్యాంకింగ్, పింఛన్లు, సఫ్రేసి, చెక్కు బౌన్స్, పిరమిడ్ పథకాలు, అక్రమంగా డిపాజిట్ల సేకరణకు సంబంధించిన చట్టాల్లో మార్పులు చోటుచేసుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. కొన్ని క్రిమినల్ నిబంధనలను చాలా ఏళ్ల క్రితమే ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నకొద్దీ చెడు ప్రవర్తనల్ని నియంత్రించడం అసాధ్యంగా మారే అవకాశం ఉండటం, వాటిని అరికట్టేందుకు కొద్దిపాటి నిబంధనలే ఉండటం వంటి కారణాలతో వీటిని ప్రవేశపెట్టారు. విచ్చలవిడి మోసాలు, నిబంధనల ఉల్లంఘనలు పెట్టుబడిదారులను నిరాశపరుస్తాయి. డిపాజిటర్లు, చిన్నస్థాయి పెట్టుబడిదారులపై ఇలాంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చెక్కులు సహా నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు సంబంధించిన క్రిమినల్ నిబంధనల్ని తొలుత 1989లో ప్రవేశపెట్టారు. 1991లో ఆర్థిక సరళీకరణతోపాటే భారీస్థాయిలో మోసాలు పెరిగాయి. ఫలితంగా ఆర్థిక, ఇతర అక్రమ డిపాజిట్ల సేకరణ పథకాలు పుట్టగొడుగుల్లా పెరిగాయి.