మహా సాగరాల నుంచి మహోన్నత పర్వతశ్రేణుల వరకు అన్నింటిపైనా ప్లాస్టిక్ పడగనీడ పరచుకొంటోంది. వాతావరణ మార్పులకు కారణమవుతూ- జీవజాతుల మనుగడకు పెనువిపత్తుగా పరిణమిస్తోంది. ఈ కాలుష్య కోరల్లోంచి పుడమిని రక్షించుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కంకణబద్ధం కావాలని ఐరాస పర్యావరణ విభాగం ఏనాడో హెచ్చరించింది. విశ్వవ్యాప్తంగా ఏటా మేట వేస్తున్న 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల్లో పది శాతమైనా పునర్వినియోగంలోకి రావడం లేదు. ఇండియాలోనైతే ఏడాదికి 38 లక్షల టన్నుల మేరకు అసలు సేకరణకే నోచుకోవడం లేదు. భూమి పొరల్లో, జల వనరుల్లో చొరబడి శతాబ్దాల పాటు అలాగే ఉండిపోతూ- ప్రజారోగ్యానికి అవి చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు! ఒకసారి వినియోగించి పారవేసే ఉత్పత్తులతో పోనుపోను ముప్పు ముమ్మరిస్తోంది. అటువంటి వాటిపై 2022 జులై 1 నుంచి నిషేధాన్ని ప్రకటించిన కేంద్రం- ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తాజాగా కఠినతరం చేసింది.
సుప్రీం ఆందోళన..
పర్యావరణానికి ప్రమాదకరమైన ప్లాస్టిక్ చెత్తపై సుప్రీంకోర్టు ఏడేళ్ల క్రితమే తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తంచేసింది. వ్యర్థాల కట్టడికి సమర్థ చట్టాలెన్ని ఉన్నా- వాటి అమలులో యంత్రాంగం అలసత్వమే అసలు సమస్య అని కుండ బద్దలుకొట్టింది. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులను యథేచ్ఛగా తయారుచేస్తున్న వందల కొద్దీ కర్మాగారాల బాగోతాలు నిరుడు భాగ్యనగరంలో బయటపడ్డాయి. దేశ రాజధానిలో సైతం తిష్ఠవేసిన అటువంటి సంస్థల గుట్టుమట్లు మూడు నెలల క్రితమే వెలుగులోకి వచ్చాయి. తయారీ మొదలు వినియోగం వరకు అన్ని స్థాయుల్లో పర్యవేక్షణ కట్టుదిట్టమైతేనే ఎలాంటి నిషేధాజ్ఞలైనా సఫలీకృతమవుతాయి. ప్లాస్టిక్ ఉత్పత్తులతో పొంచి ఉన్న ప్రమాదాన్ని విశదీకరిస్తూ జనచేతనకు ప్రోదిచేస్తేనే మేలిమి ఫలితాలు సాధ్యపడతాయి. ప్రధాని మోదీ లోగడే పిలుపిచ్చినట్లు ప్లాస్టిక్ రక్కసి కబంధ హస్తాల నుంచి దేశం బయటపడాలంటే- వ్యర్థాల పునర్వినియోగమూ జోరెత్తాల్సిందే!