తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'ఆహార భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వాలదే' - MADHURA SWAMYNATHAN INTERVIEW

లాక్​డౌన్​ కారణంగా దేశంలో ఆకలి సమస్య తీవ్రమైంది. పేదరికం పెరుగుతోంది. ఈ సమయంలో అంతర్జాతీయ ఆహార భద్రత కమిటీ సభ్యురాలు మధుర స్వామినాథన్​ పరిష్కార మార్గాలపై 'ఈనాడు'తో మాట్లాడారు. సంక్షోభ కారణాలను వివరించారు.

FOOD SECURITY
ఆహార భద్రత

By

Published : May 14, 2020, 7:54 AM IST

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది. తద్వారా ఆహార భద్రత, పౌష్టికాహార లభ్యత ప్రశ్నార్థకంగా మారాయి. ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) అయిదుగురు నిపుణులతో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆహార భద్రత కమిటీలో సభ్యురాలైన మధుర స్వామినాథన్‌- ప్రస్తుతం చెన్నైలోని ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పరిశోధన కేంద్రం ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. దేశంలో వలసకూలీల సమస్య తీవ్రరూపందాల్చి, ఆహారభద్రత చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సంక్షోభ కారణాలు, పరిష్కార మార్గాలపై మధుర స్వామినాథన్‌తో 'ఈనాడు' ప్రత్యేక ప్రతినిధి ఎం.ఎల్‌.నరసింహారెడ్డి ముఖాముఖి.

లాక్‌డౌన్‌ ప్రకటించిన అనంతరం దేశంలో ఆకలి సమస్య తీవ్రమైంది. ఈ సమస్య ఎంత ఎక్కువగా ఉంది?

ఆహార భద్రత సమస్యను ఎదుర్కొనే వారి సంఖ్య రెట్టింపు అవుతుందని ప్రపంచ ఆహార కార్యక్రమం (వరల్డ్‌ పుడ్‌ ప్రోగ్రాం) పేర్కొంది. పేదరికం పెద్దయెత్తున విస్తరిస్తోంది. కూలీలు, కార్మికులు, స్వయం ఉపాధి, చిన్న చిన్న పనులపై ఆధారపడ్డ వర్గాలు... ఇలా అనేక రంగాల్లోని వారికి గడచిన రెండు నెలలుగా ఎలాంటి ఆదాయం లేనందున దేశంలో పేదరికం పెరుగుతోంది. వీరంతా ఆహార భద్రత సమస్యను ఎదుర్కొంటారు. కరోనాకు ముందు దేశంలో 36శాతం బాలలు పౌష్టికాహార లోపంతో ఉన్నారు. లాక్‌డౌన్‌వల్ల పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొనేవారి సంఖ్య రెట్టింపవుతుంది. భారత్‌లో వర్షాధార పంటలపై ఆధారపడిన ప్రాంతాల్లో ఏప్రిల్‌, మే నెలల్లో సాధారణంగానే ఆకలి, సరైన ఆహరం లభించకపోవడం ప్రధాన సమస్యలుగా ఉంటాయి. ఈ సమయంలో వ్యవసాయేతర పనులే వారికి ఉపాధి. ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఆ అవకాశాన్నీ పూర్తిగా కోల్పోయారు. ఫౌండేషన్‌ ఫర్‌ అగ్రేరియన్‌ స్టడీస్‌- 12 రాష్ట్రాల్లో తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోనూ రోజువారీ కూలిపనులు లభించలేదు. గిరిజన ప్రాంతాల్లో సమస్య మరీ అధికం.

వలస కార్మికుల సమస్య చాలా తీవ్రంగా ముందుకొచ్చింది. వివిధ ప్రాంతాలనుంచి తిరిగి వచ్చేవారికి తగిన సదుపాయాలు కల్పించే స్థితిలో సొంత రాష్ట్రాలు ఉన్నాయంటారా? ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఏం చేయాలి?

ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదు. ప్రతి ప్రభుత్వ లక్ష్యం ఇదే కావాలి. దీనికి అవి కొన్ని పనులు చేయాలి. అన్ని గ్రామీణ కుటుంబాలకు సాధారణంగా ఇచ్చే దానికంటే రెట్టింపు బియ్యం, గోధుమలు రేషన్‌ను ఉచితంగా పంపిణీ చేయాలి. ప్రస్తుతం ఇస్తున్నది భారత వైద్య ఆరోగ్య పరిశోధన మండలి ప్రతి రోజూ తీసుకోవాలని సిఫార్సు చేసిన దాంట్లో సగం మాత్రమే. ప్రతి మనిషికి వాస్తవంగా రోజూ ఎంత మేరకు ఆహారం సరఫరా చేయాలని సూచించారో నిర్దిష్టంగా ఆ మేరకు ఇవ్వాల్సి ఉంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డు ఉందా, బయోమెట్రిక్‌లో వేలిముద్రలు సరిపోతున్నాయా వంటివి చూడరాదు. అర్హులను గుర్తించడంలో లోటుపాట్ల వల్ల చాలామంది రేషన్‌ అందక ఇబ్బందులు పడుతున్నారు. అన్ని గ్రామీణ కుటుంబాలకు అదనంగా వంటనూనె, చక్కెర, ఉప్పు, ఆకుకూరలు సరఫరా చేయాలి. ఈ జాబితాలో సబ్బులనూ కలపాలి. పాలు, కోడిగుడ్లు, కూరగాయాల్లో కనీసం ఏదో ఒకటి లేదా రెండింటిని సరఫరా చేయాలి. జాతి అతి పెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో- ప్రాథమిక ఆహార భద్రత కన్నా పౌష్టికాహార సరఫరా గురించే ఎక్కువగా ఆలోచించాలి.

పట్టణ ప్రాంతాల్లోని వారికి నిత్యావసరాలతోపాటు వండిన ఆహారాన్నీ సరఫరా చేయాలి. పట్టణాల్లో రేషన్‌కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ- గ్రామీణ ప్రాంతాల కుటుంబాలకు ఏవైతే సరఫరా చేశారో వాటన్నింటినీ ఇవ్వాలి. కార్మికులందరూ పని దొరకని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సామాజిక వంటశాలలు ఏర్పాటు చేయాలి. వండిన ఆహారాన్ని సబ్సిడీ ధరలకు అందించాలి. కేరళ ఈ విషయంలో ఓ అడుగువేసింది. ఇది చాలా జాగ్రత్తగా జరగాల్సిన ప్రక్రియ.

మరోవంక భౌతిక దూరాన్ని పాటించేందుకు సరైన ప్రణాళిక, సాంకేతికతను వినియోగించుకోవాలి. కనీసం ఆరు నెలలపాటు విధిగా ఈ కార్యక్రమాలన్నీ అమలు కావాలి. ‘ఎఫ్‌సీఐ’ వద్ద భారీగా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి. కొత్త ధాన్యమూ మార్కెట్లోకి రాబోతుంది. కాబట్టి ప్రజాపంపిణీ వ్యవస్థ కింద బియ్యం, గోధుమలు సరఫరా చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతోపాటు ఇతర అవసరాలు అంటే కూరగాయలు, దినుసులు వంటి అవసరాలకోసం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు లేదా జన్‌ధన్‌ ఖాతాలు ఉన్నవారికి, ఫించనుదారులకు నెలకు అయిదువేల నుంచి రూ.7500 వరకు నగదు బదిలీ చేయాలి.

వలస కార్మికులు వెళ్ళిపోతే నిర్మాణ పనులు ఆగిపోతాయని, ఎక్కువ మంది తిరిగి రాకపోతే సమస్య తీవ్రంగా ఉంటుందని కొన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయి. రానున్న నెలల్లో ఇది ఏ రూపం తీసుకొంటుందంటారు?

వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలు వెనక్కి తీసుకోవాలి. అయితే దీనికి నిధులు అవసరమవుతాయి. ఈ ఆర్థిక భారాన్ని కేంద్రం భరించాలి. రాష్ట్రాలకు ఈ మేరకు అవసరమైన నిధులు ఇవ్వాలి. ఈ క్లిష్ట సమయంలో వలస కూలీలకు తమ ఇళ్లకు వెళ్లే హక్కు ఉంది. ఆర్థిక, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కుటుంబంతోనూ, సన్నిహితులతోనూ ఉండాలనుకొంటారు. దీనివల్ల కొన్ని రోజులపాటు కూలీల కొరత ఏర్పడవచ్చు. కానీ తమ గ్రామాల్లో, పట్టణాల్లో పనులు ఉండవు కాబట్టి వలస కార్మికులు అనివార్యంగా తిరిగి వస్తారు... రాక తప్పదు! ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి వలస కూలీల రవాణా బాధ్యత తీసుకోవాలి. చైనా ఇదే చేసింది.

ఆకలితో ఎవరూ అలమటించడానికి వీల్లేదని ప్రధాన మంత్రి, పలువురు ముఖ్యమంత్రులు పేర్కొన్నారు. కానీ ఆచరణలో ఏం జరిగింది. లాక్‌డౌన్‌ ప్రకటించే ముందు సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలా జరిగిందంటారా? రానున్న రోజుల్లో దీనిపై మరింత దృష్టి సారించాలంటారా?

ప్రపంచవ్యాప్తంగా ఒక ఒప్పందం ఉంది. కొంత ముందస్తు నోటీసుతో (జనతా కర్ఫ్యూ సైతం మూడు రోజులుండాలి), ఇన్‌ఫెక్షన్‌ రేటుపై ఎక్కువ ప్రభావం లేకుండా లాక్‌డౌన్‌ అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం నివ్వెరపాటుకు గురి చేసింది. చాలామంది నిపుణులదీ ఇదే అభిప్రాయం. రాష్ట్రాలవారీగా చూసినపుడు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సమస్య ఉంది. ఉదాహరణకు కేరళను తీసుకొందాం. గల్ఫ్‌దేశాల నుంచి లక్షల మంది తిరిగి రానున్నారు. దీనివల్ల అక్కడ వైరస్‌ వ్యాప్తితోపాటు ఉపాధి సైతం ప్రధాన సమస్య కానుంది. వలస వెళ్లిన ఎంతోమంది తిరిగి రావడం వల్ల వారికి ఉపాధి కల్పించడం బిహార్‌కు ఇప్పుడు అతి పెద్ద సమస్య. పర్యాటకం, వ్యాపారం, రెస్టారెంట్లపై ఆధారపడిన రాష్ట్రాలు పెద్దగా సమస్యలు ఎదుర్కొంటాయి. వ్యవసాయ ప్రధాన రాష్ట్రాల్లో ఈ సమస్య తక్కువగా ఉంటుంది. ప్రతి రాష్ట్రం స్వీయ పరిస్థితిని మదింపు వేసుకొని తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం కావాలి.

ABOUT THE AUTHOR

...view details