'నేటి రాజకీయ నాయకులు సారా కాంట్రాక్టర్ల గుప్పిట్లో ఉన్నారు.. పోలీసులు సారా కాంట్రాక్టర్ల బంట్లు.. ఇప్పుడు గూండాలు రాజకీయాల్లో ప్రవేశించి పెత్తనం చేస్తున్నారు' స్వాతంత్య్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య దాదాపు మూడు దశాబ్దాల క్రితం వెళ్లగక్కిన చేదు నిజాలివి. ఇలాంటి పెడధోరణులు చూస్తూ తానింకా బతికి ఉన్నందుకు బాధ పడుతున్నానని ఆయన వాపోయారు. ప్రస్తుతం ఆయన సజీవులై ఉంటే- మరింతగా క్షీణించిన స్థితిగతులు చూడలేక, కల్తీమద్య రక్కసి (Adulterated alcohol in india) వికటాట్టహాసాలు వినలేక.. ఇంకెంత తల్లడిల్లిపోయేవారో!
150 లక్షల లీటర్లు
బిహార్‌లో మళ్లీ కోరసాచిన అక్రమ మద్య దందా మూడు పదులకు పైగా నిండుప్రాణాల్ని కబళించింది. తాగుడుకు బానిసలై కడకు తమకు కాకుండా పోయిన అయినవాళ్లను తలచుకుని గోపాల్‌గంజ్, పశ్చిమ చంపారన్, ముజాఫర్‌పుర్ జిల్లాలకు చెందిన బాధిత కుటుంబాలు కుళ్లికుళ్లి ఏడుస్తున్నాయి. అయిదున్నర సంవత్సరాలుగా మద్యనిషేధం అమలవుతున్న (liquor ban in bihar) రాష్ట్రమది. తొలినాళ్లలో నిషేధాన్ని పకడ్బందీగా అమలు జరిపినందువల్ల అక్కడ రాష్ట్రవ్యాప్తంగా అపహరణ కేసులు, హత్యలు, దోపిడులు, అత్యాచారాలు ఏ మేరకు తగ్గుముఖం పట్టాయో నీతీశ్ ప్రభుత్వం నాలుగేళ్లక్రితం సర్వోన్నత న్యాయస్థానానికి సగర్వంగా గణాంక నివేదిక సమర్పించింది. అటువంటిచోట నేడు అక్రమ మార్గాల్లో లిక్కర్ నిల్వలు నల్లబజారుకు తరలుతున్నాయని, కల్తీ మద్యం సరఫరాలు జోరెత్తుతున్నాయంటూ ఆరోపణలు ముమ్మరిస్తున్నాయి. తాజా ఘటనలతో కలిపి ఈ సంవత్సరం జనవరి నుంచి అక్కడ సుమారు (alcohol addiction statistics in india) వంద మంది కల్తీ మద్య సేవనానికి బలైపోయారన్నది అనధికారిక అంచనా. 2016 ఏప్రిల్ నుంచి 2021 ఫిబ్రవరి మధ్యకాలంలో ఎకాయెకి 150 లక్షల లీటర్ల ఐఎంఎఫ్‌ఎల్ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) పట్టుబడిందని, 3.46 లక్షల మందిని అరెస్ట్ చేశామని అధికార యంత్రాంగమే చెబుతోంది. మద్యనిషేధాన్ని బిహారీ మహిళలు పెద్దయెత్తున స్వాగతించారు. అడుగడుగునా సర్కారుకు బాసటగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేశారు. పోనుపోను యంత్రాంగం పట్టు సడలి కల్తీ మద్య భూతం జడలు విరబోసుకుంటున్న కారణంగా- పరిస్థితి చేజారుతున్న తీరు నిశ్చేష్టపరుస్తోంది.
నిబంధనలకు తూట్లు
స్వాతంత్య్రానికి ముందే, దేశంలో మద్యపాన నిషేధం (liquor ban in india) కచ్చితంగా పాటించాలనేవారు బాపూజీ. మిజోరం, గుజరాత్, బిహార్, నాగాలాండ్, లక్షద్వీప్ వంటి చోట్ల నిషేధం విధించినా అడపాదడపా వెలుగుచూస్తున్న ఉదంతాలు, నిబంధనలకు తూట్లు పొడవడంలో ఉల్లంఘనుల పోటాపోటీ- మహాత్ముడి సదాశయ స్ఫూర్తికి తలకొరివి పెడుతున్నాయి. లోగడ కటక్ (ఒడిశా)లో రెండువందల మందిని పొట్టన పెట్టుకున్న అక్రమ సారా అంతకు మూడింతల సంఖ్యలో జనాన్ని ఆస్పత్రుల పాలు చేసింది. రెండున్నరేళ్ల క్రితం అస్సాం కల్తీ సారా విషాదం 140 మంది ప్రాణాల్ని తోడేసింది. ఏడాదిక్రితం గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో నాలుగడుగుల లోతున భూమిలో 16 వేల కల్తీ మద్యం సీసాల పాతర బయటపడింది. అదంతా కర్ణాటకలోని బెల్గాంలో తయారైందని; తెలంగాణ, మధ్యప్రదేశ్‌లకు చెందినవారూ సరకు తరలింపులో పాల్గొన్నట్లు వెల్లడైంది. పంజాబ్, రాజస్థాన్ల బృందాలూ తరచూ చేతివాటం చూపిస్తున్నాయి. మద్యనిషేధానికి ఓటేసిన బిహార్‌లోకి హరియాణా, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్‌లతోపాటు నేపాల్ నుంచీ కుప్పలు తెప్పలుగా ఐఎంఎఫ్‌ఎల్ సీసాలు వచ్చి పడుతున్నాయన్న విశ్లేషణలు- అవినీతి మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం అలసత్వాన్నే కళ్లకు కడుతున్నాయి. నాటు సరకుకు అతిపెద్ద విపణి కేంద్రాలుగా యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ప్రభృత రాష్ట్రాలు ఏళ్ల తరబడి చలామణీ అవుతూ ఎందరో వ్యసనపరులకు మరణశాసనం లిఖిస్తున్నాయి. ఒక లీటరు సాధారణ మద్యంలో అమోనియా, మిథైల్ ఆల్కహాల్, డైజోఫాం మాత్రలు, నల్లబెల్లం, ఇతర రసాయనాలు మిళాయించి వెయ్యి లీటర్ల కల్తీ సరకు తయారు చేస్తున్నవాళ్లకు, గుట్టుగా నిర్దేశిత ప్రాంతాలకు తరలిస్తున్న వాళ్లకు.. దండిగా నోట్ల పంట పండుతోంది. ఎక్కడ కల్తీమద్యం ఏరులై పారుతోందో, ఎవరెవరి ప్రమేయంతో లావాదేవీలు నిక్షేపంగా సాగుతున్నాయో- స్థానిక నేతాగణానికి, ఎక్సైజ్ అధికార సిబ్బందికి, పోలీసులకు మహబాగా తెలుసు. లెక్కప్రకారం పద్ధతిగా మామూళ్ల చెల్లింపులు, వాటాల పందేరం సాగిపోతే- వారి చూపు పొరపాటునైనా అటువైపు ప్రసరించదు. అర్భక వ్యసనపరుల ప్రాణాలు దారపు పోగుల్లా పుటుక్కున తెగిపోతే ఎవడిక్కావాలి? ఈ తరహా అలసత్వం కలుపు మొక్కలా విస్తరించిన చోట, మద్యమహా విలయం కొత్త రికార్డుల సృష్టికి శాయశక్తులా పాటుపడుతోంది! కొన్నాళ్ల క్రితం ఉత్తరాఖండ్‌లో అక్రమ మద్యం సేవించి 70 మంది కడతేరిపోయినప్పుడు, నిజానిజాల నిర్ధారణకు ప్రత్యేక బృందమొకటి ఏర్పాటైంది. ఆటోమొబైల్ పరిశ్రమలో ఉపయోగించే ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌ను అక్రమ మద్యం తయారీకి వాడారని, దాన్ని డీజిల్ డబ్బాల్లో నిల్వ చేశారనీ దర్యాప్తు బృందం అప్పట్లో నిర్ధారించింది! లిక్కర్ రాబడుల కిక్కు తలకెక్కి ప్రభుత్వాలే సర్కారీ లేబుళ్లతో మద్య భూతాన్ని జనంపైకి ఉసిగొలుపుతుంటే- కల్తీ దందాసురులకు అదురేమిటి, బెదురేమిటి?