తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భవితను మనమే నిర్మించుకుందాం!

దేశంలో కరోనా నియంత్రణకు విధించిన లాక్​డౌన్ కారణంగా పలు రంగాల కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. అయితే ఈ పరిస్థితులు సద్దుమణిగేలోపు తయారీ, ఎగుమతి రంగాలకు నూతన ప్రోత్సాహం అందించేలా మంత్రివర్గ సహచరులకు ప్రధాని మోదీ ఇటీవల సూచనలు చేశారు. దేశ ఆర్థికానికి సత్తువ ఇవ్వగల సామర్థ్యం ఉన్న పరిశ్రమలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. అనుకున్నవన్నీ యథాతథంగా అమలుకు నోచుకోగలిగితే 'భారత్‌లో తయారీ'కి సంబంధించి ఇదో గొప్ప ప్రకరణమవుతుంది!

government should encourage some industries who Can give stamina for nation.
భవితను మనమే నిర్మించుకుందాం!

By

Published : Apr 10, 2020, 8:58 AM IST

మహమ్మారి కరోనా వైరస్‌ విలయతాండవానికి యావత్‌ ప్రపంచం గతిరీతులే గాడితప్పుతున్నాయి. దేశంలో ప్రాణనష్టాన్ని కనిష్ఠస్థాయికి పరిమితం చేసే లక్ష్యంతో లాక్‌డౌన్‌ ప్రకటించాక, పలు రంగాల కార్యకలాపాలు దాదాపుగా స్తంభించిపోయాయి. ఈ స్తబ్ధత ఇలాగే ఎల్లకాలం కొనసాగేది కాదు. సంక్షోభం సమసి పరిస్థితులు తేటపడతాయి. అప్పటికి తయారీ, ఎగుమతి రంగాలకు నూతన జవసత్వాలు సమకూర్చడం ఎలాగన్నదానిపై దృష్టి సారించాల్సిందిగా మంత్రివర్గ సహచరులకు ప్రధాని మోదీ ఇటీవల పిలుపిచ్చారు. దేశంలో మరిన్ని విడిభాగాలు, ఉత్పత్తుల తయారీకోసం వివిధ సర్కారీ విభాగాలు విస్తృత కసరత్తు సాగిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. చితికిన దేశార్థికానికి కొత్త సత్తువ ఇవ్వగల సామర్థ్యం ఉన్నవాటిగా ఔషధ, జౌళి, ఎలెక్ట్రానిక్స్‌, ఆహార ప్రాసెసింగ్‌, రక్షణ సామగ్రి తదితర పరిశ్రమల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయిదేళ్ల వ్యవధిలో రూ.35వేల కోట్లమేర ఆయుధ పరికరాలు, మందుగుండు సామగ్రి ఎగుమతి లక్ష్యాన్ని రెండు నెలల క్రితమే ప్రధాని నిర్దేశించారు. ఇవన్నీ యథాతథంగా అమలుకు నోచుకోగలిగితే- 'భారత్‌లో తయారీ'కి సంబంధించి ఇదో గొప్ప ప్రకరణమవుతుంది!

శ్రామికులకు చేతినిండా పని అవసరం...

అయిదున్నర సంవత్సరాల క్రితం 'భారత్‌లో తయారీ'కి శ్రీకారం చుట్టినప్పుడు కేంద్రం భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంది. 2022నాటికి స్థూల దేశీయోత్పత్తిలో తయారీ రంగం వాటాను 25శాతానికి విస్తరించి అదనంగా పదికోట్ల ఉపాధి అవకాశాలు సృష్టించదలచామని ఘనంగా చాటింది. కొన్నాళ్లకే ఆ సందడి సద్దుమణిగింది. ఇటీవలి ఆర్థిక సర్వే, అయిదేళ్లలో నాలుగు కోట్ల ఉపాధి అవకాశాలు ఏర్పరచేలా 'భారత్‌లో కూర్పు' యోచనను తెరపైకి తెచ్చింది. పేరు ఏదైనా, దేశీయంగా శ్రామికులకు చేతినిండా పని కల్పించే సత్వర కార్యాచరణ నేడు అత్యవసరం. లాక్‌డౌన్‌తో కార్పెట్లు, దుప్పట్లు, వస్త్రాల తయారీ నిలిచిపోయిన దశలో మాస్కుల రూపకల్పనకు సంసిద్ధమని జౌళి పరిశ్రమ చెబుతోంది. ప్రస్తుత పంట కోతల కాలంలో అనేక రాష్ట్రాలు గోనె సంచులు, టార్పాలిన్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. స్థానిక అవసరాల ప్రాతిపదికన చిన్న తరహా సంస్థలకు ఆ పని మప్పడం ఉభయతారకమవుతుంది. వ్యక్తిగత రక్షణ సామగ్రి, చేతి తొడుగుల వంటివీ పెద్దయెత్తున తక్షణం సమకూర్చుకోవాల్సి ఉంది. అసంఘటిత రంగంలోని 40 కోట్లమంది శ్రమజీవుల బతుకుతెరువుకు ముప్పు దాపురించిందన్న అంచనాల వెలుగులో, దీటైన ప్రణాళికలు రూపుదిద్దుకోవాలి!

వాటికి ప్రభుత్వం ఆసరాగా నిలిస్తే...

ఎకాయెకి 67శాతం మేర బల్క్‌ డ్రగ్స్‌, ముడి ఔషధా(యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రెడియెంట్స్‌- ఏపీఐ)ల దిగుమతులకోసం చైనాపై ఆధారపడిన భారత్‌ను ఇటీవలి పరిణామాలు ఇరకాటంలోకి నెట్టేశాయి. వాస్తవానికి, ఏపీఐల తయారీ అన్నది ఇండియాకు స్వాభావిక బలిమి. వేర్వేరు అంచెల్లో శుద్ధీకరించి, మలినాల్ని తొలగించి మాత్రలు, గొట్టాల తయారీకి వినియోగించే ముడి రసాయన ఔషధాలు పాతికేళ్ల క్రితం వరకు దేశంలోనే పుష్కలంగా ఉత్పత్తయ్యేవి. ఆ బాణీని తిరిగి అందిపుచ్చుకొంటే ఏపీఐల ఎగుమతిదారుగా భారత్‌కిక ఎదురుండదు! వెదురుబుట్టలు, కేన్‌ కుర్చీలు, పారిశ్రామిక విడిభాగాలనుంచి జౌళి, తోలు, హస్తకళా ఉత్పత్తుల వరకు అందించగల లఘు పరిశ్రమలు- ప్రభుత్వం ఆసరాగా నిలిస్తే, అద్భుతాలు సృష్టిస్తామంటున్నాయి. విడి భాగాలు, పరికరాలు, ఉప వ్యవస్థల్ని క్రమబద్ధీకరిస్తే- రక్షణ ఉత్పత్తులూ కీలక రంగాన స్వావలంబనకు దోహదపడతాయి. వ్యవసాయ ప్రధాన దేశంలో ఆహార ప్రాసెసింగ్‌ను ప్రగతి బాట పట్టించడమన్నది, చేపపిల్లకు ఈత నేర్పడంలాంటిదే! మనకు అత్యవసరమైనవి, విదేశాలకు ఎగుమతి చేయగలిగినవి దేశంలోనే సొంతంగా ఉత్పత్తయ్యే వాతావరణ పరికల్పన- నిరుద్యోగంపై రామబాణమవుతుంది. సంక్షుభిత భారతాన్ని సాంత్వనపరచగలుగుతుంది!

ABOUT THE AUTHOR

...view details