తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అనాథల భద్రత.. సర్కారీ బాధ్యత - అనాథలపై సుప్రీం తీర్పు

కరోనా కాఠిన్యానికి వేల మంది చిన్నారులు అనాథలయ్యారు. గతేడాది కొవిడ్‌ మహమ్మారి(covid updates) కారణంగా 9,346 మంది పిల్లలు వివిధ రూపాల్లో బాధితులుగా మారారు. అయితే.. కరోనా కారణంగా అనాథలైన చిన్నారుల కష్టాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. పిల్లల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు సమర్పించాలని కేంద్రాన్ని, తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలనూ ఆదేశించింది. చిన్నారుల వివరాలను ఎప్పటికప్పుడు బాల్‌స్వరాజ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించింది.

orphans
అనాథలు, అనాథల భద్రత

By

Published : Jun 17, 2021, 9:29 AM IST

దేశవ్యాప్తంగా కరోనా కాఠిన్యానికి వేలమంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారు. గత ఏడాదికాలంలో కొవిడ్‌ మహమ్మారి కారణంగా 9,346 మంది పిల్లలు వివిధ రూపాల్లో బాధితులుగా మారారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ క్రోడీకరించిన గణాంకాలివి. వాస్తవంగా ఈ లెక్కల్లోకి రాని బాధిత చిన్నారులు చాలా ఎక్కువగా ఉంటారనేది ఓ అంచనా. ఇదంతా ఒక సమస్య కాగా, మరోవైపు సామాజిక మాధ్యమాల వేదికగా పిల్లల దత్తతకు సంబంధించిన పోస్టులు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. లక్షల రూపాయల బేరాలూ సాగుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. మానవ అక్రమ రవాణాకు దారితీసే ప్రమాదం పొంచి ఉంది. బాధిత చిన్నారులను భద్రంగా చూసుకోకపోతే, లైంగిక వేధింపులకు గురయ్యే ముప్పుంది. అసాంఘిక శక్తుల చెరలో పడితే వారి భవిత దుర్భరమవుతుంది.

తక్షణ ఊరటే ముఖ్యం

కొవిడ్‌ కారణంగా అనాథలైన చిన్నారుల కష్టాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. పిల్లల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు సమర్పించాలని కేంద్రాన్ని, తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలనూ ఆదేశించింది. చిన్నారుల వివరాలను ఎప్పటికప్పుడు బాల్‌స్వరాజ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించింది. వారి బాగోగులు చూసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేకించి నోడల్‌ అధికారులను నియమించాలని స్పష్టంచేసింది. ఈ క్రమంలో, బాధిత చిన్నారులందరికీ పీఎం కేర్స్‌ నుంచి పలురకాల లబ్ధి చేకూర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల కార్పస్‌నిధిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ఉన్నత విద్య సమయంలో నెలవారీ ఉపకార వేతనాన్ని అందిస్తామన్నారు.

23 ఏళ్లు వచ్చిన తరవాత వ్యక్తిగత, కెరీర్‌ అవసరాల నిమిత్తం ఆ కార్పస్‌నిధి మొత్తాన్ని ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించారు. ఉన్నత విద్యకు తీసుకునే రుణాలపై వడ్డీ చెల్లిస్తామని, 18 ఏళ్ల వయసు వరకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద అయిదు లక్షల రూపాయల మేర ఆరోగ్య బీమా కల్పించి, ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందన్నారు. ఇవన్నీ భవిష్యత్తులో ఉపయోగపడే సహాయాలే తప్పించి, తక్షణమే ఊరటనిచ్చే విధానం కనిపించడం లేదు. ముందుగా సంబంధిత చిన్నారులను నిర్దిష్టంగా గుర్తించడమే కీలకం. వారి సంరక్షణ, ఆలనాపాలనకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. జువెనైల్‌ జస్టిస్‌ చట్టం ప్రకారం జిల్లా స్థాయిలో బాలల సంక్షేమ కమిటీలు ఏర్పాటయ్యాయి. వాటి ద్వారా కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సంరక్షణకు చర్యలు చేపట్టవచ్చు. ఇదే విషయాన్ని బాలల హక్కుల కమిషన్‌ సైతం సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో పొందుపరిచింది. ఇంట్లో ఆర్జించే వ్యక్తిని కోల్పోవడం పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎదుగుదలనూ ప్రభావితం చేసే ముప్పుంది. బాధిత చిన్నారులు చదివే పాఠశాలల యాజమాన్యాలు స్పందించి వారు అదే బడి వాతావరణంలో చదువుకునేలా తోడ్పడాలి. ఇందుకోసం సంబంధిత అధికారులూ చర్యలు తీసుకోవాలి.

కరోనాతో తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ముందుకొచ్చాయి. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం బాధిత పిల్లలకు ఉచితంగా రేషన్‌, ప్రతినెలా అయిదు వేల రూపాయల పింఛనుతో పాటు ఉచిత విద్యను అందించేలా కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు 25 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి నెలా రూ.2500 పింఛను ఇవ్వనున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. చదువుల ఖర్చును పూర్తిగా భరిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ బాధిత చిన్నారుల పేరిట రూ.10 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లల ఖాతాల్లో అయిదు లక్షల రూపాయల చొప్పున వేయాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రతి నెలా రూ.1,125 భత్యం ఇస్తామంది. ఇలాంటి చిన్నారులకు ఉచిత విద్య అందించాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది. అనాథ ఆశ్రమాల్లో ఉండని పిల్లలకు ప్రతినెలా రూ.3500 ఇస్తామని, 18 ఏళ్లు నిండేవరకు ఆర్థిక సాయం కొనసాగుతుందని వెల్లడించింది. తమిళనాడు సైతం చిన్నారుల పేరిట అయిదు లక్షల రూపాయలు డిపాజిట్‌ చేస్తామని, 18 ఏళ్ల వయసు వచ్చిన తరవాత వడ్డీతో సహా ఆ మొత్తాన్ని తీసుకోవచ్చని తెలిపింది. డిగ్రీ పూర్తయ్యేదాకా వసతిగృహ రుసుములతో సహా చŸదువులకయ్యే ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా మూడువేల రూపాయలు అందజేస్తామంది. ఈ నిర్ణయాలన్నీ సక్రమంగా అమలైతేనే బాధిత చిన్నారులకు భరోసా లభిస్తుంది.

మానవీయంగా స్పందించాలి

మన దేశంలో దత్తతకు సంబంధించి కఠిన చట్టాలు అమలులో ఉన్నాయి. ఈ క్రమంలో కొవిడ్‌ బాధిత పిల్లల దత్తత ప్రక్రియను తగిన పర్యవేక్షణలతో సరళతరం చేయాలి. అదేసమయంలో అనధికారిక దత్తత కార్యక్రమాలనూ నిలువరించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా, అనాథలుగా మారిన చిన్నారులకు రక్షణ కల్పించడం తక్షణావవసరం. ఇందుకోసం తాత్కాలిక సంరక్షణ బాధ్యతలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వాలు ఈ సమస్యపై మానవీయంగా స్పందించి ప్రత్యేక యంత్రాంగాల ఏర్పాటుతో చిన్నారుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలి

- స్వాతి కొరపాటి

ఇదీ చదవండి:'ఆలనా పాలనా' ప్రభుత్వ బాధ్యతే!

ABOUT THE AUTHOR

...view details