వ్యవసాయం తరవాత భారత్‌లో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగం. 24లక్షల మగ్గాలు పనిచేస్తేనే 43.31లక్షల మంది జీవనం సాగుతుంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్త్రాల్లో చేనేత రంగం వాటా 15శాతం. గతంలో ఇది 25శాతంగా ఉండేది. ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.5కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని చేనేత వార్షిక నివేదిక-2015 చెబుతోంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో సుమారు 90శాతం మన దేశానివే. బనారస్, కంచి, బెంగాలు చీరలు అంతర్జాతీయంగా ప్రసిద్ధిపొందాయి. ఉమ్మడి ఏపీలో మంగళగిరి, పోచంపల్లి, ఎమ్మిగనూరు, గద్వాల్, ధర్మవరం, సిరిసిల్ల, వెంకటగిరి, సిద్దిపేట, ఉప్పాడ, మాదవరం, పొందూరు వంటి ప్రాంతాలు చేనేతకు పేరొందాయి. వీటిలో పోచంపల్లి, గద్వాల చీరలకు 2008లో పేటెంట్లు దక్కాయి. పోచంపల్లి చీరలు ‘ఇక్కత్’, ‘డబుల్ ఇక్కత్’గా పేరొందాయి. సిద్దిపేట చీరలు ‘గొల్లభామ’ చీరలు, ఎమ్మిగనూరు పట్టుచీరలు ‘కోటకొమ్మ’ చీరలు, పొందూరు ఖాదీ చీరలు, పంచెలు ఎనలేని పేరు ప్రఖ్యాతులు పొందాయి. నేటికీ మన వస్త్రాలకు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఇంతటి ఘనచరిత్ర కలిగిన చేనేత పరిశ్రమకు లాక్‌డౌన్‌తో ఉపాధి కరవై కార్మికులకు కుటుంబ పోషణ భారంగా మారింది. నేతన్నల బతుకు పోగులు తెగిపోతున్నాయి. మగ్గం మూగబోతోంది. చేయూత కోసం ప్రభుత్వాలవైపు చూస్తోంది. కులవృత్తినే నమ్ముకున్న కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది.
పెరిగిన ఉత్పత్తి వ్యయం
వస్త్రాల తయారీలో పడుగు పేకలను పొందికగా అమర్చే నైపుణ్యం ఉన్న నేత కార్మికుల్లో అత్యధికులు బడిమెట్లు కూడా ఎక్కలేదని, 55,615 మంది పలకా బలపం పట్టలేదని, ప్రాథమిక విద్య కూడా పూర్తిచేయని వారు 21,979 మంది ఉన్నారని, 13 వేల మంది ఇంటర్/ డిగ్రీ లేదా ఆ పై తరగతులు చదివారని, బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులు లేనివారు కూడా వీరిలో ఉన్నారని చేనేతల స్థితిగతులపై 2019-20లో కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో తేలింది. ఇదిగాక 2014 ఎన్నికల ముందు నాటి ప్రభుత్వం నిర్వహించిన సర్వే- దేశవ్యాప్తంగా నేతన్నల రుణభారం మొత్తం రూ.3,000 కోట్లుగా పేర్కొంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, తగ్గుతున్న గిరాకీ, పోటీదారులైన మరమగ్గాలకు, మిల్లులకు కల్పిస్తున్న రాయితీలు వంటివి ఈ రంగానికి పెద్ద సమస్యలుగా పరిణమించాయి. చేనేతకు ముడి సరకులైన చిలపల నూలు, జరీ, సిల్కు, రంగుల ధరలు కొన్నాళ్లుగా భారీగా పెరగడంతో వస్త్ర ఉత్పత్తి వ్యయమూ విపరీతంగా పెరిగిపోయింది. కూలీల వ్యయమూ భారీస్థాయిలో పెరిగింది. ఉత్పత్తి వ్యయంతోపాటు అమ్మకపు ధర కూడా పైకెగబాకింది. వినియోగదారులు అందంగా కనిపించే, తక్కువ ధరలకే లభ్యమయ్యే మరమగ్గాలు, మిల్లు వస్త్రాలవైపే మొగ్గు చూపుతున్నారు.
కరోనా మూలంగానే..