కొత్త పంటల ఖరీఫ్ సీజన్ వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమవుతోంది. మరోవైపు సాగు చేయాల్సిన పంటలపై రైతులకు దిశానిర్దేశం కరవైంది. మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలనే అధిక విస్తీర్ణంలో సాగుచేసే పంటలకాలనీల ఏర్పాటు ప్రణాళికలు ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో లేవు. పంటల కాలనీల ప్రణాళికలు అమలు చేస్తేనే రైతులకు ఆదాయం పెంచవచ్చని అయిదేళ్లుగా కేంద్రం అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖలకు సూచిస్తోంది. కానీ చాలా రాష్ట్రాలు ఈ సూచనను పట్టించుకోవడం లేదు. గతేడాది మాదిరిగానే యథావిధిగా మళ్లీ పత్తినే అధిక విస్తీర్ణంలో సాగు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ ఇప్పటికే రైతులకు సూచించింది. ఈ పంటతో రైతులకు ఆదాయం పెద్దగా పెరగకున్నా దానినే ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం గమనార్హం.
సుస్థిర సేద్యానికి దారేది?
రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని 2022 కల్లా సాధించాలని కేంద్రం 2016లో ప్రకటించింది. ఇప్పటికే అయిదేళ్లవుతున్నా ఆదాయం పెరుగుతున్న దాఖలాలే లేవు. పలు ప్రతిష్ఠాత్మక పథకాలను ఈ లక్ష్యసాధన కోసమే అమలు చేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. పలు రాష్ట్రాలు ఆ పథకాలనే సరిగ్గా అమలు చేయనప్పుడు ఆదాయం పెంపు లక్ష్యసాధన ఎలా సాధ్యమనేది కీలక ప్రశ్నగా మారింది. ఉదాహరణకు ఒక్కో జిల్లా వాతావరణం, భూములకు అనువైన ఒక్కో పంటను ఎంపిక చేసి దానినే అక్కడ అధికంగా సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తూ 'పంటల కాలనీ' పథకం అమలు చేయాలని కేంద్రం చెప్పింది. దీనివల్ల ఆ జిల్లా నుంచి ఆయా పంట ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు ఆదాయం పెంచాలని లక్ష్యం.
అసలు పంటల కాలనీలే ఏర్పాటు చేయనప్పుడు ఇక ఎగుమతులు, ఆదాయం పెరగడం ఎలా సాధ్యం? సీజన్ ఆరంభంలో విత్తనం వేసే ముందే ఆ పంటకు మార్కెటింగ్ సదుపాయాలెలా ఉంటాయి, నాలుగైదు నెలల తరవాత దాన్ని కోసి మార్కెట్లలో అమ్మితే రైతులకు ఎంత ధర వస్తుందనే విషయంలో స్పష్టమైన అంచనాలు ఉండాలి.
ఇతర రాష్ట్రాలపై ఆధారం
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తృణధాన్యాల పంటలకు గిరాకీ ఉన్నా తెలుగు రైతులు వాటి సాగుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహకాలు లేకపోవడం, మద్దతు ధరపై హామీ లేకపోవడంతో రైతులు ముందుకు రావడం లేదు. గతేడాది ఖరీఫ్‌లో తెలంగాణలో కోటీ 34 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే పత్తి 60, వరి 53 లక్షల ఎకరాల్లో వేశారు. దీనివల్ల రాష్ట్రానికి అవసరమైన ఇతర పంట ఉత్పత్తులన్నీ వేరే రాష్ట్రాల నుంచే కొనాల్సి వస్తోంది. ప్రస్తుత రబీ సీజన్‌లో దేశంలోనే అత్యధికంగా 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసిన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు- ప్రజలకు నిత్యం అవసరమయ్యే టమాటాలు, ఉల్లిగడ్డలు, పాలు వంటి సాధారణ ఆహారోత్పత్తుల కోసం పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లాంటి సుదూర రాష్ట్రాల నుంచి తెప్పించాల్సి వస్తోంది. ఐసీఏఆర్ లోతైన పరిశోధనలు చేసి చెప్పిన సమగ్ర సేద్య విధానాలను అనుసరించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
అపార అవకాశాలు..
ఇందులో భాగంగా 'రాష్ట్రస్థాయి మార్కెటింగ్ పరిశోధన, విశ్లేషణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్నా ఇంత వరకూ ఏర్పాటుకాలేదు. ప్రతి పంట సాగును 'సమగ్ర సేద్య విధానం' (ఐఎఫ్‌ఎస్)లో చేపట్టాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సూచించింది. ప్రతి రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖ కలిసి అక్కడి భూములు, వాతావరణానికి అనుగుణంగా ఐఎఫ్‌ఎస్‌లు రూపొందించి రైతులతో అమలు చేయాలని ఐసీఏఆర్ పేర్కొంది. పంటల ఉత్పాదకత పెరిగేలా సాగు ప్రణాళికలు లేకపోతే రైతుల ఆదాయం పెంచడం అసాధ్యమని కేంద్రం ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ సైతం స్పష్టం చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు 26.28 శాతం అదనంగా పెరిగాయి. ఇవి లక్షా 30 వేల కోట్ల రూపాయలను దాటాయని 'వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల మండలి'(అపెడా) తాజా నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే కాలవ్యవధిలో లక్షా మూడు వేల కోట్ల రూపాయల ఎగుమతులు నమోదయ్యాయి. ఈ ఏడాది రూ.27 వేల కోట్లు అదనంగా పెరగడం భారత వ్యవసాయ, ఆహారోత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న గిరాకీని చాటుతోంది. కానీ ఈ మేర అన్ని పంటల సాగు, ఎగుమతులు పెంచడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు అన్ని రాష్ట్రాల్లో సక్రమంగా ఉండటం లేదు.