కొవిడ్-19 భారత్‌ను తీవ్రంగానే వణికిస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనూ ప్రధాని నరేంద్రమోదీ పొరుగుదేశాలే తమ మొదటి ప్రాధాన్యం అని తన అంతర్జాతీయ విధానాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అంతేకాదు ఇటీవల పరిణామాల ద్వారా కుదేలైన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘాన్ని (సార్క్) మహమ్మారిపై ఉమ్మడి పోరుకు ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఒక విపత్తు నిధిని కూడా ఏర్పాటు చేశారు. పొరుగుదేశాలతో సమాలోచనలు జరిపి వైరస్‌పై పోరులో ఉత్తమ విధానాలను చర్చించారు. ఇలాంటి తరుణంలో మిత్రదేశమైన బంగ్లాతో సత్సంబంధాలు మెరుగ్గా లేకపోవడం కలవరపెడుతోంది.
కరోనా వల్లే...
కొవిడ్-19 కేసులు భారతదేశం అంతటా విస్తరించడం, పాజిటివ్ కేసుల్లోనూ ప్రపంచ దేశాల్లో మూడవ స్థానానికి చేరుకున్నందున.. ఆశించిన మేర పొరుగు దేశాలతో సంబంధాలు ఆవిష్కృతం కావట్లేదు. మహమ్మారిని నిలువరించడం, ప్రాంతీయ సంబంధాలను మెరుగుపర్చడంలో భారత్ చేస్తున్న కృషికి మాల్దీవులు మినహా పొరుగున ఉన్న ఏ దేశం సానుకూలంగా లేవు. పైగా వారి దేశ అభివృద్ధికి సంబంధించిన అవసరాలకు.. సార్క్ సభ్యదేశాలన్నీ బీజింగ్ వైపు చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి.
స్వర్ణ అధ్యాయానికి బీటలా..?
భారత్-బంగ్లాదేశ్ మధ్య సముద్ర, భూ సరిహద్దు వివాదాలన్నీ గత ఐదేళ్లలో నెమ్మదిగా పరిష్కృతమయ్యాయి. అందుకే ఇరుదేశాల మధ్య 'స్వర్ణ అధ్యాయం' మొదలైంది అనే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఇలాంటి సమయంలో ఓ ఘటన మళ్లీ రెండు దేశాల సత్సంబంధాలపై దెబ్బ కొడుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బంగ్లా రాజధాని ఢాకాలో 16 నెలల క్రితమే నియమించిన భారత రాయబారి రివ గంగూలీ దాస్‌ను వెనక్కి పిలిపించి.. ఆమె స్థానంలో వేరొకరిని నియమించింది ప్రభుత్వం. ఆమె కార్యదర్శి హోదాలో పదోన్నతిపైనే భారత్‌కు తిరిగి వస్తున్నప్పటికీ.. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే బంగ్లాదేశ్‌లో భారత హై కమిషన్ స్థానానికి అధికారిక ర్యాంక్‌తో సంబంధం లేదు. రాజకీయంగా ఇది చాలా కీలకమైన పోస్టింగ్. సీనియర్ దౌత్యవేత్తలను ఆ స్థానంలో నియమించిన సందర్భాలూ ఉన్నాయి.
బంగ్లాదేశ్ ఆవిర్భావం నుంచి కూడా ఢాకాలో భారత సీనియర్ దౌత్య ప్రతినిధిగా చాలా ముఖ్యమైన వ్యక్తులే ఉన్నారు. బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్లు ముఖ్యంగా బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా హయాంలో అక్కడి ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. అలాగే భారత్‌లో గతంలో పనిచేసిన బంగ్లాదేశ్ రాయబారులు ముఖ్యంగా హై కమిషనర్ సయ్యిద్ మౌజీమ్ అలీ, మోదీ ప్రభుత్వంతో చాలా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.
ప్రభుత్వం ఆశాభావంతోనే...
రివ గంగూలీ దాస్.. గత నాలుగు నెలలుగా బంగ్లాదేశ్ అధ్యక్షురాలితో మాట్లాడిన దాఖలాలు లేవు. ఇదే రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి అనడానికి నిదర్శనం. ఆమె గతంలో రెండు దేశాల మధ్య సాంస్కృతిక ప్రతినిధిగా పని చేశారు. షేక్ హసీనా చారిత్రక విజయం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో.. 2019 మార్చ్‌లో ఢాకాకు దాస్‌ని పంపింది భారత్. ప్రస్తుత భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ సింగ్లా అప్పట్లో రాయబారిగా పని చేశారు. ఆయన స్థానంలో దాస్‌ని నియమించారు. అయితే ఆమె అంచనాలు అందుకోలేకపోవడం వల్ల విదేశాంగ మంత్రి జయ్శంకర్ అత్యధికంగా ఆదరించే.. దౌత్యాధికారి విక్రమ్ దొరైస్వామిని ఆ దేశానికి రాయబారిగా నియమించారు. ఈ మార్పుతో మళ్లీ రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయన్నది ప్రభుత్వ ఆశాభావం. అయితే ఇందుకు కాస్త సమయం పట్టొచ్చు.
ఆ వ్యాఖ్యల వల్లే...
ప్రస్తుతం రెండు దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని రాజకీయ విభేదాలు ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. గత ఏడాది భాజపా నాయకులు కొందరు బంగ్లాదేశీయులను 'చెదపురుగులు' అని వ్యాఖ్యలు చేయడం వారిని బాధించాయి. అప్పట్నుంచి షేక్ హసీనా కూడా సంబంధాలను కొనసాగించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. భారతీయ పౌరసత్వ సవరణ చట్టం వల్ల తమ మైనారిటీ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతారని.. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సహా బంగ్లాదేశ్ ప్రభుత్వాలు అభిప్రాయపడ్డాయి.
అతిపెద్ద వాణిజ్య భాగస్వామి...