Goa elections 2022: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ గోవా ఎన్నికల బరిలోకి దూకడం కేవలం అతిశయ ప్రదర్శనకేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమెకు అక్కడ నిజంగా బలం లేదు. బంగాల్‌లో భారతీయ జనతా పార్టీని ఓడించిన దీదీ- తాను దేశంలో మరెక్కడైనా ఆ పార్టీని చిత్తు చేయగలనని చాటుకోవాలనుకుంటున్నారు. అయితే, ప్రతి రాష్ట్రమూ బంగాల్ కాదన్న విషయాన్ని ఆమె మరిచిపోతున్నారు. ఎటువంటి ముందస్తు సన్నాహాలు లేకుండా, గోవాలో టీఎంసీని పటిష్ఠం చేయకుండా ఆమె ఎన్నికల పోరులోకి ఎలా దిగారో అంతుచిక్కడం లేదు. గోవాలో అధికార సాధనకు కేవలం 100 రోజుల్లో తృణమూల్‌ను బలమైన పోటీదారుగా నిలబెట్టడం సాధ్యమేనా? బంగాల్‌లో ఏళ్లతరబడి శ్రమించి బలమైన పార్టీని నిర్మించుకోవడం ద్వారానే మమత అక్కడ అజేయమనుకున్న వామపక్షాలను ఓడించి అధికారంలోకి రాగలిగారు. బంగాల్‌లో వీధి పోరాటాలు చేసి మరీ నాయకురాలిగా ఎదిగారు. దానికి భిన్నంగా ఆమె గోవాలో అకస్మాత్తుగా ఊడిపడిన నేతగా కనిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకన్నా 2024 లోక్‌సభ ఎలక్షన్ల కోసమే ఆమె పునాది నిర్మించుకుంటున్నారని స్పష్టమవుతూనే ఉంది. ఆ లక్ష్య సాధనకోసం ఆమె కింది స్థాయి నుంచి పైవరకు కార్యకర్తలు, నాయకుల యంత్రాంగాన్ని నిర్మించుకోవలసింది పోయి, పైస్థాయి నాయకులతో పార్టీ వ్యవస్థను రూపుదిద్దాలనుకోవడం చోద్యంగా కనిపిస్తోంది.
TMC in Goa election:ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే గోవాలోనూ విధేయత అనేది వ్యాపార సరకుగా మారింది. పార్టీలో పైకి ఎదగలేకపోయినవారు, పార్టీ టికెట్లు పొందలేకపోయినవారు ఇతర పార్టీలకు తమ విధేయతను అమ్ముకోవడానికి రాజకీయ బజారులోకి వస్తారు. అక్కడ తమకు పనికొచ్చే నాయకులకోసం వేటను టీఎంసీ చాలా ముందు నుంచే మొదలుపెట్టింది. పూర్వం గోవా ముఖ్యమంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన లూయిజినో ఫలేరోతో మొదటి బేరం కుదరడం టీఎంసీని పరమానందభరితం చేసింది. ఫెలీరో రాజ్యసభ సీటును కోరారు. దానికి మమత వెంటనే అంగీకరించారు. గోవాలో తృణమూల్ కోట నిర్మాణానికి ఫలేరో మూల స్తంభంగా పనికొస్తారని దీదీ భావిస్తున్నారు. ఫలేరో తన నియోజకవర్గం నావెలిం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాట నిజమేకానీ, ఆయన బలం అక్కడికే పరిమితం. గోవా అంతటా ఆయనకు పలుకుబడి లేదు. ఆయనకు జన సమూహాలను ఆకర్షించే శక్తీ లేదు. గోవా ముఖ్యమంత్రిగా ఆయన చెప్పుకోదగిన విజయాలేమీ సాధించలేదు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిలోనూ రాణించలేకపోయారు.
పొత్తు కుదరడం లేదు