తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అజర్​బైజాన్​- ఆర్మీనియా రగడకు ఆ తప్పే కారణం! - అర్మీనియా

అజర్​బైజాన్​, ఆర్మీనియా మధ్య యుద్ధ మేఘాలు అలుముకోవడం వల్ల వారి మధ్య వివాదం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. 1920లలో సోవియట్‌ ఎర్ర సైన్యం కాకసస్‌ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు, స్టాలిన్‌ అక్కడి నగోర్నో కరబాఖ్‌ ప్రాంతాన్ని అజర్‌బైజాన్‌ లో కలిపేశారు. అయితే ఆ ప్రాంతంలో 90శాతం జనాభా ఆర్మీనియన్లే ఉండటం వల్ల రగడ రాజుకుంది. ఈ చారిత్రక తప్పిదమే సుదీర్ఘ సంక్షోభానికి బీజం వేసింది. అయితే ప్రస్తుత యుద్ధ వాతావరణాన్ని తొలగించేందుకు అమెరికా, రష్యా వంటి దేశాలు.. ఇరు దేశాల మధ్య శాంతికి కృషిచేస్తున్నాయి.

Gloomy scenario in Middle East as Armenia, Azerbaijan fight for Nagorno-Karabakh
అజర్​బైజాన్​- అర్మీనియా రగడకు ఆ తప్పే కారణం!

By

Published : Oct 27, 2020, 11:13 AM IST

నగోర్నో-కరబాఖ్‌ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం గడచిన మూడు దశాబ్దాలుగా ఆర్మీనియా, అజర్‌బైజాన్‌ల మధ్య చెదురుమదురు సంఘర్షణలు జరుగుతూనే వచ్చాయి. 1990లలో ఆర్మీనియా వేర్పాటువాదులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు అజర్‌బైజాన్‌ తో దాదాపు పూర్తి స్థాయి యుద్ధమే సంభవించింది. అందులో 30,000 మంది మరణించారు. తాజాగా కొన్ని వారాల నుంచి జరుగుతున్న సంఘర్షణలలో దాదాపు 5000 మంది మరణించారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అంచనా. ఆర్మీనియా, అజర్‌బైజాన్‌లకు రష్యా, ఇజ్రాయెల్‌, టర్కీ, పాకిస్థాన్‌ల నుంచి అందుతున్న మద్దతు వల్ల ఘర్షణలు తీవ్ర రూపం ధరించాయి. కాల్పుల విరమణకు ఫ్రాన్స్‌, రష్యాల ఆధ్వర్యంలో రెండు సార్లు ఒప్పందాలు కుదిరినా అవి భగ్నమైపోయాయి. తాజాగా అమెరికా, ఫ్రాన్స్‌, రష్యాలతో ఏర్పడిన మిన్స్క్‌ గ్రూపు ఆర్మీనియా, అజర్‌బైజాన్‌లను కాల్పుల విరమణకు ఒప్పించింది. వివాదాన్ని సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని నచ్చచెబుతోంది.

ఆయుధాల సేకరణలో నిమగ్నం

ఇక్కడ ఘర్షణ పూర్వాపరాలను గుర్తుచేసుకోవడం అవసరం. 1920లలో సోవియట్‌ ఎర్ర సైన్యం కాకసస్‌ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు, స్టాలిన్‌ అక్కడి నగోర్నో కరబాఖ్‌ ప్రాంతాన్ని అజర్‌బైజాన్‌ లో కలిపేశారు. ఆ ప్రాంతంలో 90 శాతం జనాభా ఆర్మీనియన్లేనన్న సంగతిని ఆయన పట్టించుకోలేదు. ఈ చారిత్రక తప్పిదమే సుదీర్ఘ సంక్షోభానికి బీజం వేసింది. అత్యధిక ఆర్మీనియా ప్రజలు క్రైస్తవులు కాగా, అజర్‌బైజానీలు ముస్లిములు. సోవియట్‌ యూనియన్‌ పతనమైన తరవాత, అంటే 1991లో 4,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల నగోర్నో కరబాఖ్‌ ప్రాంతంలోని ఆర్మీనియన్లు అజర్‌బైజాన్‌ పాలన నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. వారిలో కొందరు గెరిల్లా పోరాటం ప్రారంభించారు కూడా. అజర్‌ ప్రభుత్వం సేనలను పంపింది. ఈ సందర్భంగా సామూహిక జన హననం చోటుచేసుకుంది. దీంతో నగోర్నో కరబాఖ్‌ స్వచ్ఛందంగా ఆర్మీనియాలో విలీనమవుతున్నట్లు ప్రకటించింది. అజర్‌బైజాన్‌ సహజంగానే దాన్ని ప్రతిఘటించింది. 1991-94 మధ్య కరబాఖీలు జరిపిన పోరుకు ఆర్మీనియా సైన్యంతోపాటు రష్యన్‌ సైనిక సలహాదారులు సహకారం అందించారు. ఈ నాలుగేళ్ల పోరాటంలో కరబాఖీలు 4,400 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి తోడు దాని సమీపంలోని ఏడు జిల్లాల్లో 7,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్నీ ఆక్రమించారు. ఈ మొత్తం ప్రాంతానికి అర్ట్‌శాఖ్‌ రిపబ్లిక్‌ అని నామకరణం చేసి, స్టెపనేకర్ట్‌ను రాజధానిగా ప్రకటించారు. దీన్నే నగోర్నో కరబాఖ్‌ రిపబ్లిక్‌గా కూడా పరిగణిస్తున్నారు. అజర్‌బైజాన్‌కు చమురు నిక్షేపాల ద్వారా బాగా ఆదాయం వస్తోంది కనుక ఆ సొమ్ముతో డ్రోన్లు, క్షిపణులు కొనుగోలు చేసింది. ఆర్మీనియాకు పరిమిత ఆదాయమే ఉన్నా రష్యా నుంచి భారీ శతఘ్నులు, అత్యాధునిక క్షిపణులు సేకరించింది. ఆర్మీనియాకు రష్యా అండదండలను ఇస్తోంటే, అజర్‌బైజాన్‌ను టర్కీ సమర్థిస్తోంది.

ఆర్మీనియా, అజర్‌బైజాన్‌లు రెండింటితో ఉమ్మడి సరిహద్దు ఉన్న ఇరాన్‌లో పెద్ద సంఖ్యలో అజరీలు నివసిస్తున్నారు. అజర్‌బైజాన్‌లో ఉన్న అజరీల జనాభాకన్నా ఇరాన్‌లోని అజరీల సంఖ్యే ఎక్కువ. ఇరాన్‌ సానుభూతి అజర్‌బైజాన్‌కే ఉన్నా, ఆర్మీనియాను బహిరంగంగా తెగనాడటానికి సిద్ధంగా లేదు. రెండు దేశాలకు మధ్యవర్తిగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తోంది. నిజానికి నగోర్నో కరబాఖ్‌ ప్రాంతాన్ని అజర్‌బైజాన్‌లో భాగంగా అంతర్జాతీయ సమాజం గుర్తిస్తోంది. ఆర్మీనియా ప్రభుత్వ అధికార వైఖరి కూడా ఇదే కానీ, పరోక్షంగా మటుకు కరబాఖీలకు మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం నగోర్నో కరబాఖ్‌, ఆర్మీనియా సరిహద్దుల్లో అజరీలు సైనికంగా మోహరించి ఉన్నారు. ఇక్కడ తటస్థ ప్రాంతం కానీ, ఐక్యరాజ్య సమితి శాంతి రక్షక సేనలు కానీ లేకపోవడంతో పరిస్థితి ఏ క్షణాన్నైనా పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబులా ఉంది. ఎవరు ఎక్కడ పొరపాటు చేసినా యుద్ధం విరుచుకుపడవచ్చు. అదే జరిగితే పౌరులకు భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తాయి. ఐరోపాకు, పొరుగు దేశాలకు అజర్‌బైజాన్‌ నుంచి చమురు, సహజ వాయువు ఎగుమతులు దెబ్బతింటాయి. మధ్యాసియా మీదుగా భారత్‌, రష్యాలను అనుసంధానించే ఉత్తర-దక్షిణ కారిడార్‌ ద్వారా ఇంధన ఎగుమతులు విచ్ఛిన్నమవుతాయి.

యుద్ధం అన్నివిధాలా అనర్థం

ఇప్పటికే చమురు ధరల పతనం, కొవిడ్‌ వ్యాప్తితో అతలాకుతలమైన అజర్‌బైజాన్‌, ఆర్మీనియా ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేనంతగా దెబ్బతింటాయి. రాజకీయ సంక్షోభమూ తక్కువేమీ కాదు. అజరీ అధ్యక్షుడు అలీయేవ్‌ ఇప్పటికే ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని, నిరసన ప్రదర్శకులను అరెస్టు చేస్తూ, సమాచార మాధ్యమాల పీక నులుముతున్నారని దుమారం రేగుతోంది. అసలు ఆర్మీనియా, అజర్‌బైజాన్‌ ప్రభుత్వాల పాలన, ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న మాట వాస్తవం. అందుకే అవి రెండూ నగోర్నో కరబాఖ్‌ సమస్యను పెద్దది చేసి, జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తున్నాయనే ఆరోపణ ఉంది. భారతదేశం ఈ రెండు దేశాల్లో దేనినీ దూరం చేసుకోవడానికి సుముఖంగా లేదు. ఉభయులతో సమతూకంగా సంబంధాలు కొనసాగించడం భారత్‌ విధానం. కశ్మీర్‌ సమస్యపై ఆర్మీనియా మొదటి నుంచీ భారత్‌ను సమర్థిస్తోంది. 1995లో భారత్‌, ఆర్మీనియాల మధ్య స్నేహ, సహకార ఒప్పందం కుదిరింది కూడా. ఇక అజర్‌బైజాన్‌లో చమురు, సహజవాయు నిక్షేపాల అన్వేషణపై భారత ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, జీఏఐఎల్‌ పెట్టుబడులు పెట్టాయి. అందుకే ఆర్మీనియా-అజరీ వివాదాన్ని దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలంటూ అంతర్జాతీయ సమాజం ఇస్తున్న పిలుపుతో భారత్‌ గొంతు కలుపుతోంది.

- కేసీరెడ్డి
(మాజీ ఐపీఎస్‌ అధికారి, ఐరాస మాజీ భద్రతా సలహాదారు)

ABOUT THE AUTHOR

...view details