తెలంగాణ

telangana

ETV Bharat / opinion

జర్మనీలో 'రాజకీయ' ఉత్కంఠ- భారత్‌ వాణిజ్యంపై వేటు! - angela merkel party

ఎన్నికల అనంతరం జర్మనీలో(Germany polls 2021) ప్రభుత్వ ఏర్పాటు ఉత్కంఠగా మారింది. 24.1శాతం ఓట్లతో రెండో స్థానానికి పరిమితమైనా, ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌కు చెందిన యూనియన్‌ కూటమి సంకీర్ణ సర్కారు ఏర్పాటుపై ధీమాగా ఉంది. అయితే.. ఎవరు గద్దెనెక్కినా భారత్‌తో బంధాలకు ఎలాంటి ప్రాధాన్యమిస్తారు? ఐరోపా సమాఖ్య(ఈయూ)తో భారత్‌ 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)' కుదర్చుకోవడంలో ఎంత మేరకు సహకరిస్తారు?

germany
జర్మనీ

By

Published : Sep 29, 2021, 6:42 AM IST

పార్లమెంటరీ ఎన్నికల తాజా ఫలితాలతో జర్మనీ రాజకీయాలు(Germany Polls 2021) మరోసారి రసకందాయంలో పడ్డాయి. ఈసారీ అక్కడ ఏ పార్టీకీ(Germany Election 2021) స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 24.1శాతం ఓట్లతో రెండో స్థానానికి పరిమితమైనా, ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌కు(Angela Merkel Party) చెందిన యూనియన్‌ కూటమి సంకీర్ణ సర్కారు ఏర్పాటుపై ధీమాగా ఉంది. దానికన్నా 1.8శాతం ఓట్లు అధికంగా దక్కించుకొన్న సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ(Social Democratic Party of Germany) మాత్రం నూతన ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని చెబుతోంది. మూడో స్థానంలో నిలిచిన గ్రీన్‌ పార్టీ కింగ్‌మేకర్‌గా నిలుస్తామన్న విశ్వాసంతో ఉంది. మూడు పక్షాల్లో ఎవరు గద్దెనెక్కినా భారత్‌తో బంధాలకు ఎలాంటి ప్రాధాన్యమిస్తారు? ఐరోపా సమాఖ్య(ఈయూ)తో భారత్‌ 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)' కుదర్చుకోవడంలో ఎంత మేరకు సహకరిస్తారు? కీలకమైన ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఐరోపాలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి జర్మనీ(Germany India Relations). కొన్నేళ్లుగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బాగా బలపడ్డాయి. ప్రస్తుతం ఇండియాలో జర్మనీ కంపెనీలు 1,700కు పైగా ఉన్నాయి. సుమారు ఏడు లక్షల మందికి అవి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. జర్మనీలోనూ ఫార్మా, సమాచార సాంకేతికత, ఆటొమోటివ్‌ తదితర రంగాల్లో భారతీయులు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. 2009లో జర్మనీలో భారతీయుల సంఖ్య 46వేలు. 2016 నాటికి అది దాదాపు లక్షకు చేరుకుంది. 2019-20 విద్యాసంవత్సరంలో ఆ దేశ విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య 25వేలు దాటింది. 16 ఏళ్లుగా జర్మనీని ఏలుతున్న దిగ్గజ నేత మెర్కెల్‌ భారత్‌తో సంబంధాలకు బాగానే ప్రాధాన్యమిచ్చినా, చైనాకు అంతకంటే పెద్దపీట వేశారు. ప్రస్తుతం ఆమె అస్త్రసన్యాసం చేయనుండటంతో తదుపరి ఛాన్స్‌లర్‌ ఎవరన్నదానిపై అందరి దృష్టి నెలకొంది.

రూ. 75 వేల కోట్ల మేరకు ప్రయోజనాలు..

యూనియన్‌ కూటమి నాయకుడు అర్మిన్‌ లాషెట్‌, సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ నేత ఉలాఫ్‌ షోల్జ్‌, గ్రీన్‌ పార్టీ నాయకురాలు అనలీనా బేర్బాక్‌ ఈ రేసులో ముందున్నారు. ఈయూ-భారత్‌ మధ్య ఎఫ్‌టీఏ ఇంకా కుదరలేదు. దీనికి సహకరిస్తామని గతంలో జర్మనీ హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా సరైన చొరవ చూపలేదు. 2013లో నిలిచిపోయిన ఎఫ్‌టీఏ చర్చల్లో మళ్ళీ ఈ ఏడాది మేలో కాస్త కదలిక వచ్చింది. చర్చల పునరుద్ధరణ దిశగా ముందడుగు పడినట్లు భారత్‌ ప్రకటించింది. భారత్‌తో ఎఫ్‌టీఏ అమలులోకి వస్తే దాదాపు రూ.75వేల కోట్ల మేర ప్రయోజనాలుంటాయని 2020లో యూరోపియన్‌ పార్లమెంటు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ఆ ఒప్పందం కుదరాలని ఐరోపాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జర్మనీ గట్టిగా మద్దతిస్తే ఒప్పందం సులభతరమవుతుంది. బ్రస్సెల్స్‌ కేంద్రంగా ఈయూ కార్యకలాపాలు సాగిస్తున్నా- జర్మనీ, ఫ్రాన్స్‌లే ప్రధానంగా అందులో చక్రం తిప్పుతున్నాయి. ఆ సమాఖ్యలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీ నిలుస్తోంది. దీనివల్ల కొత్త ఛాన్స్‌లర్‌ భారత్‌కు కీలకంగా మారనున్నారు.

జర్మనీలో రాజకీయ ఉత్కంఠ

జర్మనీ ఏకపక్షంగా భారత్‌కు అండగా నిలిచే అవకాశాలు తక్కువే. దీనికి కారణం చైనా. ఈయూకు డ్రాగన్‌ దేశమే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. జర్మనీతోనూ దానికి భారీస్థాయిలో వ్యాపార సంబంధాలున్నాయి. అందుకే మెర్కెల్‌ ఎప్పుడూ చైనాకు ఎదురుచెప్పలేదు. షోల్జ్‌, లాషెట్‌లలో ఎవరు అధికార పీఠమెక్కినా డ్రాగన్‌ అభీష్టాలకు వ్యతిరేకంగా నడుచుకొనే అవకాశాలు దాదాపు ఉండకపోవచ్చు. దూకుడుకు పెట్టింది పేరైన బేర్బాక్‌ మాత్రం అందుకు మినహాయింపు. చైనాకు వ్యతిరేకంగా ఇప్పటికే పలు వేదికలపై ఆమె గళం విప్పారు.

చైనాతో వాణిజ్య విధానాలను కఠినతరం చేయాలని జర్మనీ, ఈయూలకు గతంలో పిలుపిచ్చారు. జర్మనీలో 5జీ నెట్‌వర్క్‌ విస్తరణ పనులకు చైనా కంపెనీ- హువావై టెక్నాలజీని దూరం పెట్టాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించి గతేడాది సెప్టెంబరులో జర్మనీ నూతన వ్యూహాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ భద్రత, పర్యావరణ మార్పులు, మానవ హక్కులు వంటి అంశాల్లో ఇండో-పసిఫిక్‌ దేశాలతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించింది. నూతన ప్రభుత్వం దానికి ఏ మేరకు కట్టుబడి ఉంటుందో చూడాలి. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదితర దేశాలు చైనా విస్తరణ కాంక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరుణంలో డ్రాగన్‌ను నొప్పించకుండా జర్మనీ ఎలా ముందుకు సాగుతుందన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఛాన్స్‌లర్‌ పదవి దక్కకున్నా సంకీర్ణ ప్రభుత్వంలో బేర్బాక్‌ కీలకంగా మారగలిగితే ఇండో-పసిఫిక్‌లో జర్మనీ నుంచి చైనాకు పలు వేదికలపై ప్రతిఘటన ఎదురయ్యే అవకాశముంది.

- నవీన్‌ కుమార్‌

ఇదీ చదవండి: 'విశ్వశాంతి'కి చోదక శక్తిగా భారత్​...

ABOUT THE AUTHOR

...view details