దేశ పర్యటన చేపట్టాలని గురువు గోపాల్ కృష్ణ గోఖలే ఇచ్చిన సలహాను పాటించిన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ, కొన్నేళ్లకే మహాత్ముడిగా ఎదిగారు. రెండు శతాబ్దాలుగా అరాచక, అమానవీయ పాలనతో దేశాన్ని దోచుకుంటున్న బ్రిటిషర్లపై పోరాడే ముందు భారత్‌ను, భారతీయులను అర్థం చేసుకోవాలని భావించిన గాంధీకి ఆ పర్యటన ఎంతగానో ఉపయోగపడింది. తాను కలలు కన్న దేశానికి, వాస్తవ పరిస్థితులకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని గాంధీ గ్రహించారు. బ్రిటిషర్ల కింద గొడ్డుచాకిరీ చేసినా ఒకపూట కడుపునిండా అన్నం తినలేని స్థితిలో అనేకమంది ఉండటం చూసి బాపూ చలించిపోయారు. ఆ అనుభవంతోనే ప్రజలను ఏకతాటిపై నడిపిస్తూ స్వాతంత్య్ర సమరంలో ముందుకు నడిచారు. కోట్ల మంది ఆయన వెంట నిలబడ్డారు. ఇప్పట్లో మరో గాంధీ ఆవిర్భవించరనేది వాస్తవం. సాంస్కృతికంగా సమున్నతమైన, వైవిధ్యభరితమైన భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలంటే విద్యావ్యవస్థతోనే సాధ్యం. అంతర్జాతీయంగా పేరొందిన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఎయిమ్స్, ఐఐఎమ్‌లకు భారత్ నెలవు. కానీ, దేశంలో ఉన్నత విద్యావంతులు, నిరక్షరాస్యుల మధ్య తీవ్ర స్థాయి అంతరాలు (inequality in india) నెలకొన్నాయి. విద్యావంతుల్లో చాలా మందికి దేశం ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపై సరైన అవగాహన ఉండటంలేదు. బాధితుల పట్ల సహానుభూతీ కొరవడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటన్నది పెద్ద ప్రశ్న. మేధావులు, అధికారులకు సైతం ఇది అంతుపట్టడంలేదు.
ఉద్యమాలపై ప్రత్యేక కోర్సు
దేశంలో ఉన్నత వర్గాలు, సామాన్యుల మధ్య అంతరాలు (inequality in india) తొలగిపోవాలంటే పాఠశాల దశలోనే అందుకు పునాది పడాలి. పిల్లల్లో సానుభూతి పెంపొందాలి. ఈ విషయంలో అరవైకి పైగా దేశాల జాబితాలో భారత్ 35వ స్థానంలో ఉన్నట్లు గతంలో ఓ అధ్యయనం
చాటిచెప్పింది. దీని పరంగా ఇండియా మరింత మెరుగుపడాల్సి ఉంది. అమెరికా వంటి దేశాల్లో భావి పౌరుల ఈక్యూ(ఎమోషనల్ కోషంట్)ను పెంపొందించేందుకు పలు చర్యలు చేపడుతున్నారు. భారత్‌లో కొన్ని ఐఐఎమ్‌లు సైతం దానిపై దృష్టిపెడుతూ, సామాజిక ఉద్యమాలపై ప్రత్యేక కోర్సును అందిస్తున్నాయి. విద్యార్థుల్లో ప్రజా ఉద్యమాలపై సానుకూల భావాన్ని పెంపొందించి, ఉద్యమాలంటే విధ్వంస కృత్యాలు కాదని, సామాజిక అన్యాయాలపై గళం వినిపించడమని, సమస్యలను పరిష్కరించడంలో అవి ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆ కోర్సు చాటిచెబుతుంది. భావి కార్పొరేట్ నాయకులుగా ఎదిగే నేటి విద్యార్థులు- సమస్యలను వాస్తవ దృక్కోణంలో అర్థం చేసుకోవడం అలవరచుకోవాలి. కోర్సులో భాగంగా, ప్రకృతి వనరులను ప్రభుత్వాల అండతో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న కార్పొరేట్ సంస్థలపై ఆదివాసులు చేస్తున్న పోరాటాలను విద్యార్థులు అధ్యయనం చేస్తారు. మహిళలు, దళితులు, అణగారిన వర్గాల హక్కులపై అవగాహన పెంపొందించుకొంటారు. తద్వారా మనుషులందరూ సమానమేనని, ఏ ఒక్కరిపట్లా దుర్విచక్షణ కూడదన్న అభ్యుదయ భావన వారిలో పాదుకొంటుంది. సంస్థకు చెడ్డపేరు వస్తుందనే కారణంతో లైంగిక వేధింపుల ఘటనలను తొక్కిపెట్టకూడదని, బాధితులకు అండగా నిలవాలన్న చైతన్యం మొగ్గతొడుగుతుంది. కోర్సులో భాగంగా నేపాల్, దక్షిణాఫ్రికాలో విజయం సాధించిన ప్రజాస్వామ్య ఉద్యమాలు, లక్ష్య సాధనలో వెనకబడిన టిబెట్, పాలస్తీనాల గురించీ విద్యార్థులు తెలుసుకుంటారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా సాగిన నిరసనలు, చట్టాలతో హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలపై అమెరికా, భారతీయ రైతులు చేపట్టిన ఉద్యమాల నేపథ్యాలు విద్యార్థులకు అవగతమవుతాయి. అన్నింటికీ మించి తమ సిద్ధాంతాలు, కార్యాచరణలతో జాతిని ఏకం చేసిన కబీర్, గురునానక్, స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ జీవిత కథలతో విద్యార్థులు స్ఫూర్తి పొందుతారు.