తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బాపూదే గురుపీఠం- ఆయనో వికాస పాఠం!

జాతిపిత మహాత్మాగాంధీలోని అద్భుతమైన గురువును స్మరించుకున్న దాఖలాలు చాలా తక్కువ. ఆ కోణంలో గాంధీని దర్శిస్తే బోధన వృత్తిపై ఆయన అభిరుచి అవగతమవుతుంది. మహాత్ముని స్వీయచరిత్రలో ఆ వివరాలున్నాయి. ప్రతి విద్యార్థికి వ్యాయామ విద్య, మేధా విద్య ఎంత అవసరమో ఆధ్యాత్మిక విద్య సైతం అంతే ముఖ్యమని అప్పుడే ఆదర్శపౌరులను తయారు చేయగలమని గాంధీజీ భావించారు. ఉపాధ్యాయుల ప్రవర్తన సమతుల్యంగా ఉన్నప్పుడే విద్యార్థులపైన వారి ప్రభావం ఆశించిన విధంగా ఉంటుందన్నది మహాత్ముడు నమ్మేవారు.

GANDHI BIRTH ANNIVERSARY SPECIAL STORY
బాపూదే గురుపీఠం- ఆయనో వికాస పాఠం!

By

Published : Oct 2, 2020, 8:26 AM IST

మహాత్మాగాంధీని స్వాతంత్య్ర సమర సేనానిగా, సమర్థుడైన న్యాయవాదిగా, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా, నిరాడంబరుడుగా, త్యాగశీలిగా, గొప్ప విద్యావేత్తగా, సత్యాగ్రహిగా, అహింసావాదిగా సాధారణంగా అందరూ గుర్తిస్తుంటారు. కానీ, ఆయనలోని అద్భుతమైన గురువును స్మరించుకున్న దాఖలాలు చాలా తక్కువ. ఆ కోణంలో ఆయనను దర్శిస్తే బోధన వృత్తిపై ఆయన అభిరుచి అవగతమవుతుంది. ఆయన స్వీయచరిత్రలో ఆ వివరాలున్నాయి. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఎంతో తపనతో జీవన పాఠాలు బోధించినట్లుగా మహాత్ముడు తన స్వీయచరిత్రలో ఎన్నో విలువైన సూచనలు చేశారు. ఆ రకంగా బోధనను ఆయన వృత్తిగా స్వీకరించలేకపోయినా ప్రవృత్తిగా ఆచరించారు.

ఇదీ చూడండి:గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం

గురువుకు శిష్యులంతా సమానమే

దక్షిణాఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్‌లో టాల్‌స్టాయ్‌ ఫార్మ్‌ పేరిట 1910లో గాంధీజీ మొట్టమొదటి ఆశ్రమం స్థాపించారు. గాంధీజీ బోధన, విద్యలో జరిపిన ప్రయోగాలన్నింటికి ఆ ఆశ్రమం ఒక ప్రయోగశాల. అక్కడ వృత్తి విద్యకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులు రోజూ ఎనిమిది గంటలపాటు వృత్తి విద్యలో శిక్షణ పొందితే; రెండు గంటలపాటు బోధన, పుస్తక పఠనం చేసేవారు. విద్యార్థులను స్వీయశక్తిమంతులుగా తీర్చిదిద్ది వారిని స్వావలంబన బాట పట్టించడమే లక్ష్యంగా ఆశ్రమం కొనసాగింది. మత, ప్రాంత, వర్ణ, లింగ భేదాలకు అతీతంగా ఆశ్రమం నడిచింది. ఒకసారి గాంధీజీ సహచరుడు, ఆశ్రమ నిర్వహణలో ప్రధాన భాగస్వామి, ఆశ్రమానికి టాల్‌స్టాయ్‌ పేరును ప్రతిపాదించిన హెర్మన్‌ కాలెన్‌బాక్‌ గాంధీజీతో మిగిలిన పిల్లలతో సమానంగా మహాత్ముడి పిల్లలూ కలపడంవల్ల వారు పాడయ్యే అవకాశం ఉండవచ్చునని లేదా ఆశించినంత వృద్ధి సాధించలేకపోవచ్చునని కాబట్టి వారికోసం ఆశ్రమంలో కొంతవరకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమోనని సలహా ఇచ్చారు. అందుకు గాంధీజీ 'నా పిల్లల్ని, ఇతర పిల్లల్ని వేర్వేరుగా నేను చూడలేను. ఇరువురికీ నేను సమాన బాధ్యత వహిస్తున్నాను. నా దృష్టిలో ఇద్దరూ ఒక్కటే. ఈ ఆశ్రమంలో కొందరు జులాయిలు, సోమరులు ఉన్నారనే విషయం నాకు తెలుసు. అలా అని వారిని దూరంగా ఉంచి వేరే విధంగా చూడలేను. పతనమైపోతున్న వారిని సైతం మార్చవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. నా పిల్లలకు ఏది మంచో, ఏది చెడో తెలుసుకోవడానికి, ఏది ఆచరణీయమో, ఏది కాదో అవగాహన చేసుకొని సమాజంలో బతకడానికి ఈ ఆశ్రమంలో మనం పాటించే సమానతా సూత్రం ఉపకరిస్తుంది' అని బదులిచ్చారు.

ఇదీ చూడండి:సైకత శిల్పంతో మహాత్మునికి నివాళి

ఈ ఆశ్రమంలో సామాజిక సేవ, ఆదర్శ పౌరసత్వం, సామాజిక ప్రయోజకత్వం వంటి వాటిపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవారు. వ్యక్తి ప్రయోజనాల కంటే సమాజం కోసం ఎలా బతకాలి అన్న విషయాన్ని నేర్పేవారు. అందుకు అనుగుణంగానే ఆశ్రమంలో వృత్తివిద్యలు ఉండేవి. వడ్రంగి, తాపీ పని, ప్లంబింగ్‌, పారిశుద్ధ్య కార్యక్రమాలు, వంట చేయడం, మొక్కల పెంపకం వంటి గ్రామీణ, సమాజ నిర్మాణానికి ఉపయోగపడే వృత్తుల్లో శిక్షణ ఇచ్చేవారు. ఉపాధ్యాయులు ఎలా ఉండాలన్న విషయంలోనూ మహాత్ముడికి కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. చదవడం కంటే వినడం ద్వారానే నేర్చుకోవడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. విద్యార్థులపై పుస్తకాల మోత తగ్గించాలని, వారికి నిజమైన పుస్తకం ఉపాధ్యాయుడేనని చెబుతుండేవారు. పిల్లలకు నీతి కథల బోధన జరగాలని, ప్రతి విద్యార్థి ముందుగా తన మతం గురించి, మత గ్రంథాల గురించి తెలుసుకోవాలని సూచించేవారు. వ్యక్తిత్వ నిర్మాణం, శీల నిర్మాణం, స్వీయ సాక్షాత్కారం నైతిక విద్య ద్వారానే జరుగుతుందన్నది ఆయన నమ్మకం. ప్రతి విద్యార్థికి వ్యాయామ విద్య, మేధా విద్య ఎంత అవసరమో ఆధ్యాత్మిక విద్య సైతం అంతే ముఖ్యమని అప్పుడే ఆదర్శపౌరులను తయారు చేయగలమని గాంధీజీ భావించారు. ఉపాధ్యాయుల ప్రవర్తన సమతుల్యంగా ఉన్నప్పుడే విద్యార్థులపైన వారి ప్రభావం ఆశించిన విధంగా ఉంటుందన్నది మహాత్ముడి నమ్మిక.

స్వీయనిబంధన ముఖ్యం

ఉపాధ్యాయుడు తనకు తెలియని విషయాలను పిల్లల ముందు తనకు తెలియదు, తెలుసుకొని చెబుతాను అని అనాలే తప్ప తెలిసినట్లు వారిని మభ్య పెట్టకూడదని, నిజాయతీగా ఉన్న గురువులనే విద్యార్థులు చిరకాలం ఇష్టపడతారని ఆయన సూచించారు. విద్యార్థుల హృదయాలను స్పృశించి, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొని, సమస్యలను అధిగమించడంలో వారికి సాయపడి, ఆశయసాధనలో వారికి మార్గదర్శిగా ఉపయోగపడే నిజమైన ఉపాధ్యాయుడిగా ఉండటం తనకు ఇష్టమని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థుల తప్పులకు కొంతవరకు ఉపాధ్యాయుడిదే బాధ్యత అంటారు గాంధీజీ. అటువంటి విద్యార్థి తన తప్పును తెలుసుకొని మారాలంటే విద్యార్థిని శిక్షించడం కంటే ఉపాధ్యాయుడే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అప్పుడే విద్యార్థులు తమ తప్పు తీవ్రతను, ఉపాధ్యాయుల బాధను అర్థం చేసుకొని మారతారు అని గాంధీజీ తన అనుభవం ఆధారంగా సూచించారు. ఒకసారి ఆశ్రమంలో ఇద్దరు విద్యార్థులు చేసిన తప్పునకు గాంధీజీ వారం రోజుల పాటు ఉపవాసం చేయడమే కాకుండా, నాలుగు నెలల పాటు ఒంటి పూట భోజనంచేసి తనను తాను శిక్షించుకున్నారు. తద్వారా వారిలో ఊహించిన దానికంటే ఎక్కువ పరివర్తన వచ్చిన నేపథ్యంలోనే ఆయన ఆ సూచన చేశారు. ఉపాధ్యాయులకు క్రమశిక్షణ, స్వీయ నిగ్రహం ఎంతో అవసరమని చెప్పారు. ఎందుకంటే విద్యార్థులు వారిని వినడమే కాకుండా తమకు తెలియకుండానే ఉపాధ్యాయులను అనుకరిస్తారని వివరించిన ఆయన- ఆశ్రమంలో ఆయన ఎన్నో స్వీయ నిబంధనలు పాటించేవారు. ప్రస్తుత తరం ఉపాధ్యాయులు ఈ సూచనను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరముంది. మహాత్ముడి బాటలో ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు విధానాలను తీర్చిదిద్దుకున్నప్పుడే భావి భారతావనికి ఆదర్శపౌరులను అందించడం సాధ్యమవుతుంది.

- ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు (ఆదికవి నన్నయ వర్సిటీ మాజీ ఉపకులపతి)

ABOUT THE AUTHOR

...view details