నాలుగున్నర దశాబ్దాల క్రితం సప్త సంపన్న రాజ్యాల కూటమి జీ7 కళ్లు తెరిచే నాటికి నవచైనా ఆవిర్భవించనే లేదు. 'మేడిన్ చైనా' ముద్రతో కొత్త శతాబ్దపు ప్రపంచ వాణిజ్యాన్ని అనుశాసిస్తూ, అమేయ సాంకేతిక శక్తిగా పలు సవాళ్లు రువ్వుతూ, ఆర్థిక బలసంపన్నతే పెట్టుబడిగా దుర్నిరీక్ష్య ఆధిపత్యానికి పెరపెరలాడుతున్న డ్రాగన్- జీ7 సదస్సు(G-7 summit)కు కీలక అజెండాగా మారిందిప్పుడు! బ్రిటన్‌లోని కార్బిస్ బేలో భేటీ అయిన జీ7 దేశాధినేతలు జనచైనాకు 'చెక్'పెట్టే వ్యూహాత్మక ప్రకటనకు తుదిమెరుగులు దిద్దారు. 'చైనీయులను చూసి భయపడాల్సిన పనే లేదు. ప్రపంచాధిపత్యానికి తగిన శక్తిసామర్థ్యాలేమీ వాళ్లకు లేవు' అని పదిహేనేళ్ల క్రితం తీసిపారేసిన నేటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, 'చైనీయులు అసలు మాకు పోటీయే కాదు' అని రెండేళ్ల కిందట స్పష్టీకరించిన బైడెన్‌ల సారథ్యంలో జరిగిన తాజా సదస్సు చైనా కట్టడి వ్యూహాల చుట్టూనే పరిభ్రమించింది.
'బీ3డబ్ల్యూ' ప్రతిపాదన:
ఆసియా నుంచి ఆఫ్రికా మీదుగా ఐరోపా వరకు డ్రాగన్ దేశ ఆర్థిక, రాజకీయ ప్రాబల్యాన్ని విస్తరిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ పథకానికి (బీఆర్‌ఐ) ప్రత్యామ్నాయంగా 'శ్రేష్ఠతర ప్రపంచ పునర్నిర్మాణ (బీ3డబ్ల్యూ)' వ్యూహానికి జీ7 నేతలు తెరతీశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 40 లక్షల కోట్ల డాలర్ల మేరకు మేటవేసిన మౌలిక వసతుల కొరతకు దీనితో పరిష్కారం చూపిస్తామంటున్నారు. బీఆర్‌ఐ భాగస్వామి ఇటలీ; ప్రతిపాదిత బీజింగ్- ఈయూ పెట్టుబడుల ఒప్పందానికి సహకరించిన ఫ్రాన్స్, జర్మనీ ఇప్పుడు జీ7 తరఫున 'బీ3డబ్ల్యూ'కు జైకొడుతున్నాయి! మిత్రపక్షాల దన్నుతో అమెరికాను తిరిగి మార్గదర్శక పాత్రలో నిలబెట్టాలన్నది బైడెన్(Joe Biden) తాజా సంకల్పమైతే- అగ్రరాజ్యానికి అనుచరులం కాము, భాగస్వాముల మన్నది ఐరోపా దేశాల నవీన దృక్పథం. వాణిజ్య ప్రయోజనాలే ప్రపంచ రాజకీయాలను శాసిస్తున్న తరుణంలో కార్బిస్ బే ప్రకటన ఎలా అమలు కానున్నదన్నదే ఆసక్తికరం!